బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షురాలు హసీనాను ఆ దేశానికి అప్పగించాల్సిందేనా? బంగ్లాదేశ్ ఒత్తిడికి భారత్ తలొగ్గుతుందా? లేక దౌత్య, న్యాయపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకుంటుందా? హసీనా భవితవ్యం మాత్రమే కాదు. దక్షిణాసియాలో భారత్ దౌత్య ప్రాధాన్యానికి కూడా ఈ వ్యవహారం ఒక పరీక్షగా మారింది!
మార్గం – అడుగు, ఎడిటోరియల్
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా వ్యవహారం భారత్-బంగ్లాదేశ్ మధ్య దౌత్య సంబంధాలకు సవాల్ గా మారింది. 2024 ఆగస్టు 5న విద్యార్థుల ఉద్యమంతో అధికారం కోల్పోయి దేశం విడిచివచ్చిన హసీనా, అప్పటి నుంచి భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. ఒకప్పుడు భారత్‌కు సన్నిహిత మిత్రురాలిగా ఉన్న ఆమెను, ఇప్పుడు తమకు అప్పగించాలంటూ బంగ్లాదేశ్ ప్రభుత్వం ఒత్తిడి పెంచుతోంది. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాల్లో కొత్త చిక్కులు ఏర్పడుతున్నాయి.
2024 జూలై-ఆగస్టు విద్యార్థి ఉద్యమాన్ని అణచివేసేందుకు హసీనా ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భారీ ప్రాణనష్టం సంభవించింది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం అంచనా ప్రకారం ఈ హింసాకాండలో దాదాపు 1,400 మంది మరణించారు. వేలాది మంది గాయపడ్డారు. ఈ ఘటనలకు సంబంధించి మానవత్వానికి వ్యతిరేకమైన నేరాలకు పాల్పడ్డారన్న అభియోగాలపై బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ 2025 నవంబరు 17న హసీనాకు ఆమె గైర్హాజరీలో మరణశిక్ష విధించింది. అయితే ఈ ఆరోపణలను ఆమె ఖండిస్తున్నారు.
హసీనా పాస్‌పోర్టు, జాతీయ గుర్తింపు కార్డును బంగ్లాదేశ్ ప్రభుత్వం రద్దు చేసింది. ఆమె పార్టీ అవామీ లీగ్ కార్యకలాపాలపైనా నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో భారత్-బంగ్లాదేశ్ మధ్య 2013లో కుదిరిన నేరస్తుల అప్పగింత ఒప్పందం ప్రకారం హసీనాను తమకు అప్పగించాలని ఢాకా కోరుతోంది.
ఈ పరిస్థితుల్లో డిసెంబరులో స్వదేశానికి తిరిగి వెళ్లాలని హసీనా నిర్ణయించుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇందుకోసం లండన్‌కు చెందిన మ్యాట్రిక్స్ ఛాంబర్స్ న్యాయవాదుల ద్వారా నవంబరు 9న న్యూఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్‌కు కొత్త పాస్‌పోర్టు, జాతీయ గుర్తింపు కార్డు కోసం లేఖ పంపించారు. అయితే, బంగ్లాదేశ్ ప్రభుత్వం ఈ అభ్యర్థనను తిరస్కరించింది. విదేశాంగ సహాయ మంత్రి హుమాయున్ కబీర్ ఆమెకు కొత్త పాస్‌పోర్టు ఇచ్చే ప్రసక్తే లేదని ప్రకటించారు. అప్పగింత ఒప్పందం ద్వారానే ఆమె తిరిగి రావాలని స్పష్టం చేశారు.
హసీనా అప్పగింతపై భారత్ మాత్రం న్యాయపరమైన పరిశీలన అవసరమని చెబుతోంది. నవంబరు 11న భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ వ్యవహారం చట్టపరమైన అంశమని, తగిన ప్రక్రియ ద్వారా పరిశీలిస్తామని తెలిపారు. ప్రయాణానికి అవసరమైన పత్రాలు కూడా ఉండాలని పేర్కొన్నారు.
ఇది కేవలం ఒక మాజీ ప్రధానిని అప్పగించే వ్యవహారం మాత్రమే కాదు. రెండు దేశాల మధ్య వాణిజ్యం, సరిహద్దు భద్రత, ఉగ్రవాద నియంత్రణ, ప్రాంతీయ ప్రయోజనాలు కూడా ఇందులో ముడిపడి ఉన్నాయి. హసీనాను అప్పగించకపోతే బంగ్లాదేశ్‌తో సంబంధాలు మరింత దెబ్బతినే ప్రమాదం ఉంది. మరోవైపు, మరణశిక్ష విధించిన వ్యక్తిని అప్పగించే విషయంలో న్యాయపరమైన పారదర్శకత, మానవ హక్కుల హామీలు కీలకం.
బంగ్లాదేశ్ ఒత్తిడికి భారత్ తలొగ్గుతుందా? లేక దౌత్య, న్యాయపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకుంటుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రజాస్వామ్య విలువలు, న్యాయ ప్రక్రియ, పొరుగు దేశాలతో సత్సంబంధాలను పరిశీలించి, తగు నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత భారత్‌పై ఉంది. హసీనా భవితవ్యం మాత్రమే కాదు.. దక్షిణాసియాలో భారత్ దౌత్య ప్రాధాన్యానికి కూడా ఈ వ్యవహారం ఒక పరీక్షగా మారింది!

