రూ.8 లక్షలకు లడ్డూ సొంతం చేసుకున్న బద్దం నరేష్ రెడ్డి

జింబాబ్వే రాజధాని హరారేలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. హరారే గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో తొమ్మిది రోజులపాటు నిర్వహించిన వేడుకలు భక్తిశ్రద్ధలతో, ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగాయి. ఉత్సవాల్లో భాగంగా మధు దేవ్ దంపతులు విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుంకుమార్చనతో పాటు వివిధ రకాల పూజా కార్యక్రమాలు చేపట్టి గణనాథుడిని భక్తులు కొలిచారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం గణపయ్య పాటలు, భజనలతో ఉత్సవ ప్రాంగణం మార్మోగింది. శశికుమార్‌తో పాటు పలువురు ప్రముఖులు గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. చివరి రోజు నిర్వహించిన లడ్డూ వేలం పాటలో బద్దం నరేష్ రెడ్డి రూ.8 లక్షలకు గణపయ్య లడ్డూను సొంతం చేసుకున్నారు. అలాగే పూజా వస్త్రాన్ని ప్రశాంత్ రెడ్డి రూ.2,07,933లకు దక్కించుకున్నారు. అనంతరం గణనాథుడి నిమజ్జన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆటలు, పాటలు, భక్తి నినాదాలతో చిన్నారులు, యువత, పెద్దలు ఉత్సాహంగా శోభాయాత్రలో పాల్గొన్నారు. విదేశీ గడ్డపై తెలుగు, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను చాటుతూ నిర్వహించిన ఈ వేడుకలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.


