ప్రజాస్వామ్యానికి పునాది ఓటు హక్కు. అర్హులైన ప్రతి పౌరుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తన ఓటును వినియోగించుకునేలా ఎన్నికల వ్యవస్థ ఉండాలి. అయితే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు విధానం మాత్రం కొన్ని ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఒకసారి డిగ్రీ పూర్తి చేసి, గతంలో పట్టభద్రుల ఓటరుగా నమోదైన వ్యక్తి ప్రతి కొత్త ఓటర్ల జాబితా తయారీ సమయంలో మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఏమిటి? ఇప్పటికే ధ్రువీకరించిన విద్యార్హతను పదేపదే నిరూపించుకోవడం ఎంతవరకు సమంజసం? ఈ విధానం అర్హులైన పట్టభద్రులకు అదనపు భారంగా మారడం లేదా?
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఒకసారి ఓటరుగా నమోదైన వ్యక్తి పేరు సాధారణంగా ఓటర్ల జాబితాలో కొనసాగుతుంది. చిరునామా మారినప్పుడు లేదా ఇతర వివరాల్లో మార్పులున్నప్పుడు సవరణలకు అవకాశం ఉంటుంది. కానీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు మాత్రం ప్రత్యేక ఓటర్ల జాబితాలను నిర్ణీత వ్యవధిలో కొత్తగా రూపొందిస్తారు. దీంతో గతంలో ఓటు హక్కు వినియోగించుకున్న పట్టభద్రులు సైతం తిరిగి నమోదు చేసుకోవాల్సి వస్తోంది. సాధారణ ఓటర్లకు ఒక విధానం, పట్టభద్రులకు మరో విధానం ఎందుకు? ఈ వ్యత్యాసానికి కారణాలను ఎన్నికల సంఘం ప్రజలకు మరింత స్పష్టంగా వివరించాల్సిన అవసరం ఉంది.
ప్రజాప్రాతినిధ్య చట్టం–1950లోని సెక్షన్ 27, ఓటర్ల నమోదు నిబంధనలు–1960 ప్రకారం పట్టభద్రుల నియోజకవర్గాలకు ప్రత్యేక ఓటర్ల జాబితాలు రూపొందుతాయి. ఆరేళ్లకొకసారి కొత్తగా జాబితాలను తయారుచేసే విధానం చట్టబద్ధంగా అమలవుతోంది. అయితే చట్టం నిర్దేశించిన విధానాన్ని కాలానుగుణంగా మెరుగుపరిచే అవకాశాలను కూడా పరిశీలించాలి. గతంలో ధ్రువీకరించిన విద్యార్హత వివరాలను భద్రపరిచి, తిరిగి వినియోగించుకునే డిజిటల్ వ్యవస్థను ఎందుకు అభివృద్ధి చేయకూడదు? పట్టభద్రుడైన కాలం, సంబంధిత నియోజకవర్గంలో సాధారణ నివాసం వంటి అర్హతలను పరిశీలిస్తూనే నమోదు ప్రక్రియను సరళీకరించవచ్చు కదా!
గ్రామీణ ప్రాంతాల్లోని పట్టభద్రులు, ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లినవారు, నమోదు గడువులపై అవగాహన లేనివారు ఈ విధానంతో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అర్హత ఉన్నప్పటికీ గడువులోగా దరఖాస్తు చేసుకోలేక ఓటు హక్కును కోల్పోవాల్సి వస్తోంది. అందుకే గ్రామస్థాయిలో విస్తృత ప్రచారం, సులభమైన ఆన్లైన్ నమోదు, దరఖాస్తుల స్థితిని తెలుసుకునే సదుపాయాలు కల్పించాలి.
ఒకసారి ధ్రువీకరించిన విద్యార్హతను మళ్లీ సమర్పించాల్సిన అవసరాన్ని తగ్గించలేమా? గతంలో నమోదైన పట్టభద్రుల వివరాలను ఆధారంగా చేసుకుని అర్హతలను నవీకరించే విధానం ప్రవేశపెట్టలేమా? ఈ ప్రశ్నలకు ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలి. అవసరమైతే చట్టపరమైన మార్పులపైనా చర్చ జరగాలి.
ప్రజాస్వామ్యానికి బలం ఓటరు. ఆ ఓటరుకు సౌలభ్యం కల్పించడం వ్యవస్థ బాధ్యత. డిగ్రీ ఒక్కసారే సాధిస్తారు. కానీ ఓటు కోసం మళ్లీ మళ్లీ దరఖాస్తు ఎందుకు? అర్హతను నిర్ధారించాలి.. ఓటు హక్కును సంక్లిష్టం చేయకూడదు. పట్టభద్రుల అర్హతకు తగిన గుర్తింపు, నమోదు ప్రక్రియకు సరళమైన విధానం కల్పించినప్పుడే ప్రజాస్వామ్యంపై విశ్వాసం మరింత బలోపేతమవుతుంది.

నల్ల విక్రమ్ కుమార్
8886744481

