తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠ వీడింది. గత కొన్ని రోజులుగా నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. ప్రజా తీర్పు తర్వాత కొనసాగిన అనిశ్చితి, పెద్ద పార్టీల కుట్రలు, చిన్న పార్టీల బేరసారాలు, మద్దతు లేఖల హైడ్రామా, గవర్నర్ భేటీలు, డీప్‌ఫేక్ ఆరోపణలు వంటి పరిణామాల మధ్య చివరకు తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ ప్రభుత్వం ఏర్పాటు, రాష్ట్ర రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి నాందీ పలికింది. సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో, ఎన్నికల అనంతర రాజకీయ క్రీడా కేళి ప్రజాస్వామ్య వ్యవస్థలోని బలహీనతలను మరోసారి వెలుగులోకి తీసుకొచ్చింది.
234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118. ఎన్నికల్లో టీవీకే 108 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, పూర్తి మెజారిటీకి పది స్థానాలు తక్కువ కావడంతో రాజకీయ పార్టీలు తమ అరాచక రెక్కలు విప్పాయి. ఒక్కసారిగా అధికారం హస్తగతానికి లెక్కల సమీకరణాలు రెక్కలు తొడిగాయి. అధికారాన్ని కోల్పోయిన డీఎంకే 82 స్థానాలకు పరిమితమవగా, ఏఐఏడీఎంకే 21 స్థానాలతో తీవ్ర నిరాశను చవిచూసింది. కాంగ్రెస్ 5, వీసీకే 4, వామపక్షాలు కలిపి 6, పీఎంకే 3, ఏఎంఎంకే 2 స్థానాలు గెలుచుకోవడంతో చిన్న పార్టీల చేతుల్లో ప్రభుత్వ భవితవ్యమే చిక్కుకుంది.
ప్రజలు స్పష్టంగా మార్పును కోరుకున్నప్పటికీ, మ్యాజిక్ ఫిగర్ ను చేరని టీవీకే గెలిచిన సంఖ్య ప్రభుత్వం ఏర్పాటుకు సరిపోలేదు. అతిపెద్ద పార్టీగా ఉన్న టీవీకేను ప్రభుత్వం ఏర్పాటు చేయమని ఆహ్వానించాలనే అభిప్రాయం ఒకవైపు వినిపించగా, మరోవైపు మెజారిటీ నిరూపణ లేకుండా ఆహ్వానం ఇవ్వకూడదని ప్రతిపక్షాలు వాదించాయి. ఈ నేపథ్యంలో విజయ్ మూడుసార్లు లోక్ భవన్‌ను సందర్శించి గవర్నర్‌ను కలిసినా ప్రయోజనం లేకుండా పోయింది. మ్యాజిక్ ఫిగర్ తోకూడిన మద్దతు లేఖలు కూడా కావాలనడంతో విజయ్ రాజకీయ మద్దతు కోసం నానా తంటాలు పడాల్సి వచ్చింది. అయితే మద్దతు లేఖల సమర్పణలో చోటుచేసుకున్న జాప్యాలు, అనుమానాలు పరిస్థితిని మరింత సంక్లిష్టం చేశాయి.
ఏఎంఎంకే వైఖరి ఈ రాజకీయ నాటకానికి మరింత మసాలా జోడించింది. తమ ఎమ్మెల్యేలు టీవీకేకు మద్దతు ఇస్తున్నారంటూ సమర్పించిన పత్రాలు అసలైనవి కావని, ఆ పార్టీ అధినేత దినకరన్ ఆరోపించడం సంచలనం సృష్టించింది. అంతేకాకుండా, టీవీకే విడుదల చేసిన వీడియో కూడా కృత్రిమ మేధ సాయంతో రూపొందించిన ‘డీప్‌ఫేక్’ వీడియో అని ఏఎంఎంకే ఎమ్మెల్యే కామరాజ్ గవర్నర్‌కు ఫిర్యాదు చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. భారత రాజకీయాల్లో సాంకేతికతను ఉపయోగించి మద్దతు రాజకీయాలను ప్రభావితం చేసే ప్రయత్నాలపై ఈ పరిణామాలు ఆందోళనలు రేకెత్తించాయి.
ఇక డీఎంకే మాత్రం మొదటి నుంచీ టీవీకేపై తీవ్ర విమర్శలు గుప్పించింది. స్పష్టమైన మద్దతు లేకుండానే గవర్నర్‌ను పదేపదే కలవడం ద్వారా ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపించింది. అయినప్పటికీ, ప్రజా తీర్పు అతిపెద్ద పార్టీ వైపే ఉందన్న వాదన బలంగా వినిపించింది. ఈ సమయంలో పీఎంకే వ్యవస్థాపకుడు డాక్టర్ రామదాస్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ చర్చకు కొత్త దిశనిచ్చాయి. గతంలో అటల్ బిహారీ వాజ్‌పేయికి 13 రోజులపాటు మెజారిటీ నిరూపించుకునే అవకాశం ఇచ్చిన ఉదాహరణను ప్రస్తావిస్తూ, అతిపెద్ద పార్టీగా ఉన్న టీవీకేకు కూడా అవకాశం ఇవ్వాలని ఆయన సూచించారు.
చివరకు రాజకీయ సమీకరణాలు విజయ్‌కు అనుకూలంగా మారాయి. వామపక్ష పార్టీలు బేషరతుగా మద్దతు ప్రకటించగా, కాంగ్రెస్ తన ఐదు మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖలను సమర్పించింది. అనంతరం కీలకమైన వీసీకే కూడా టీవీకేకు మద్దతు ప్రకటించడంతో విజయ్ కూటమి బలం 120కి చేరింది. దీంతో మేజిక్ ఫిగర్‌ను దాటిన టీవీకేకు ప్రభుత్వం ఏర్పాటు దాదాపు ఖాయమైంది. గవర్నర్ కూడా చివరకు విజయ్ను ప్రభుత్వం ఏర్పాటు చేయమని ఆహ్వానించడంతో రాజకీయ అనిశ్చితికి తెరపడింది.
ఈ మొత్తం పరిణామ క్రమం తమిళనాడు రాజకీయ సంస్కృతిపై కొన్ని కీలక ప్రశ్నలను లేవనెత్తింది. ప్రజా తీర్పు స్పష్టంగా మార్పు వైపు మొగ్గుచూపినా, చిన్న పార్టీలు పెద్ద బెనిఫిట్ల కోసం, తమ మద్దతును బేరసారాలకు బరితెగించడం ప్రజాస్వామ్య నైతికతపై సందేహాలు కలిగించింది. అలాగే, మద్దతు లేఖలు, వీడియోల వాస్తవాలపై వచ్చిన వివాదాలు రాజకీయాల్లో సాంకేతిక దుర్వినియోగం ఎంత ప్రమాదకరమో సూచించాయి.
రాజ్యాంగ వ్యవస్థ చివరకు తన మార్గంలోనే పరిష్కారాన్ని కనుగొన్నదనేది కూడా ఈ పరిణామాల్లో స్పష్టమైంది. అతిపెద్ద పార్టీకి అవకాశం ఇవ్వడం, తరువాత అసెంబ్లీలో బలం నిరూపించుకోవడం అనే పార్లమెంటరీ సంప్రదాయం. ఇప్పుడు ప్రజల దృష్టి అంతా విజయ్ నాయకత్వంపైనే ఉంది. సినీ స్టార్‌గా అపార ప్రజాదరణ సంపాదించిన ఆయన, రాజకీయ నాయకుడిగా ప్రజల ఆశలను ఎంతవరకు నెరవేర్చగలరన్నది కీలకంగా మారింది. సంకీర్ణ మద్దతుతో ఏర్పడుతున్న ఈ ప్రభుత్వం స్థిరంగా నిలుస్తుందా? ఇచ్చిన హామీలను అమలు చేస్తుందా? అనే ప్రశ్నలకు సమాధానం రాబోయే రోజుల్లో తేలుతుంది. ఆల్ ది బెస్ట్ విజయ్.!

