గీ డిగ్రీలు సదివే పిల్లలు ఏం ఆలోశిస్తరు? ఆటా, పాటా, అల్లరి, సదువు, కెరీర్ గివే కదా? కనీ గీ పిల్లగాడు గివేవీ ఆలోసించలే.. తమ ఊరి పక్కనుండే పోతున్న నది గురించి ఆలోసించిండు. గా నదిల పేరుకుపోయిన శెత్తా శెదారాన్ని తొలిగించాలని నిర్ణయించుకుండు.

గీ పిల్లగాని పేరు బిట్టు తబాహి. మధ్యప్రదేశ్ రాజ్ గఢ్ జిల్లా బియోరా పట్టణం గీతని ఊరు. గా పక్కనుంచే అజ్నార్ అనే నది పోతాంది. గా నది డంపింగ్ యార్డులెక్క మారింది. మొత్తం కాలుష్య కాసారమై, శెత్తా శెదారంతోటి నిండిండి. గదాన్నెట్లైనా తీసేయాల్నని నిర్ణయించుకుండు. ఈ ఏడాది జనవరి 26న రంగంలకి దిగిండు. గాయినెకి ఈత గూడ రాదు. శేతులకు, కాళ్ళకు ఎలాంటి రచ్చణ లేదు. ఒక దోస్తుతో మొదలు పెట్టి, అనేక మంది మిత్రులతో పోగేసిన 30 యేలు ఖర్సు శేసిండు. అనేక పరికరాలు కొన్నడు. నదిని మొత్తం శుభ్రం శేసిండు.
ఇగ గీ పొల్లగాని పనితనాన్ని, గా ఆనంద్ మహీంద్రా ఓ పాలి శేర్ శేసిండు. గిది ఎంత స్ఫూర్తిదాయకంగ ఉందో శెప్పిండు. అన్నట్లు.. గీ బిట్టు అనే పిల్లగాని ఇంటి పేరు తబాహి. తబాహి అంటే హిందీల విధ్వసం. వినాశనం. కాలుష్యాన్ని నాశనం శేయడమే తన ఆశయమని బిట్టు శెప్పడం విశేషం. మనం గూడ గిసొంటి పనులకు పూనుకుందామా?

