ఒక్క పోటుతో కూల్చేశారు..
పదవులపై నాకు సోకు లేదు
తనకు పదవులపై ఎలాంటి ఆసక్తి, వ్యామోహం లేదని స్పష్టం చేశారు. ఎంతో కష్టపడి రాజకీయంగా ఈ స్థాయికి వచ్చానని, అయితే ఒక్క పోటుతో తనను పదవి నుంచి తొలగించారని తెలంగాణ ప్లానింగ్ కమిషన్ మాజీ వైస్ చైర్మన్ డాక్టర్ జి. చిన్నారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనను పదవీ నుండి తొలగించిన తరువాత మాట్లాడుతూ, ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీని ప్రారంభించినప్పటి నుంచి తాను కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నానని తెలిపారు. పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలుగా పనిచేశానని, పదవులు ఉన్నా లేకున్నా తన గౌరవం తనకు ఉంటుందని అన్నారు.
ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్‌గా తనకు ఇచ్చిన నియామక ఉత్తర్వుల్లో కూడా టిల్ ఫర్థర్ ఆర్డర్ అని పేర్కొన్నారని చిన్నారెడ్డి గుర్తుచేశారు. అయినప్పటికీ ఇప్పుడు తనను పదవి నుంచి తొలగించారని తెలిపారు. పదవి కోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసే ప్రయత్నం తాను ఎప్పుడూ చేయలేదని స్పష్టం చేశారు. తన రాజకీయ విలువలు, గౌరవమే తనకు ముఖ్యమని పేర్కొన్నారు.
ఇదే సమయంలో వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డితో తనకు ఎదురైన అనుభవాలను కూడా చిన్నారెడ్డి ప్రస్తావించారు. తన మనుషులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వెళ్తే “మెడ పట్టి బయటకు దొబ్బుతా” అని మేఘారెడ్డి అన్నారని ఆరోపించారు. అయినప్పటికీ తాను అన్నింటినీ భరిస్తూ వచ్చానని తెలిపారు. పదవులు వస్తుంటాయి.. పోతుంటాయని, కానీ ఇన్నేళ్లుగా సంపాదించుకున్న గౌరవం, పార్టీతో తన అనుబంధమే తనకు ముఖ్యమని చిన్నారెడ్డి పేర్కొన్నారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

