పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలకు దూరం..పైగా సెపరేట్
ఈసీపై ఏఐసీసీ ఆందోళనలకు కూడా హాజరుకాని వైనం
పట్టభద్రుల ఎమ్మెల్సీ సమాయత్త సమావేశానికి గైర్హాజర్
సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు మంత్రుల సందర్శనలోనూ నో వేర్
పైగా విడిగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్న కొండా కపుల్స్
కన్న కూతురు మాటలతో మంత్రి పదవి కోల్పోయిన వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు దంపతులకు ప్రజల్లో సింపతి లేకుండా పోతోందా? మంత్రి పదవి కోల్పోయిన తర్వాతనైనా, వరంగల్ తూర్పు ఎమ్మెల్యేగా ప్రజలకు దగ్గర అవ్వాల్సింది పోయి, పార్టీకి, ప్రభుత్వానికి దూరమవుతున్నారా? మంత్రి పదవి పోయాక, తమకు ఓట్లేసిన నియోజకవర్గ ప్రజలకైనా దగ్గర కావాల్సిందిపోయి, దూరం పెంచుకుంటున్నారా? కనీసం వారి సానుభూతికి, సహానుభూతికి కూడా కొండా కపుల్స్ నోచుకోలేకపోతున్నారా? ఇటీవలి పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉండటమేకాకుండా, ఆతర్వాత ప్రత్యేకంగా వారే కొనసాగిస్తున్న కార్యకలాపాలు వారిని పార్టీకి, ప్రభుత్వానికే కాదు, సొంత నియోజకవర్గ ప్రజలకు కూడా దూరం చేస్తున్నాయనే అభిప్రాయాలు వారి చర్యలను బట్టి బలపడుతున్నాయి. పైగా ఈ అంశాలే ప్రస్తుతం వరంగల్ తూర్పు నియోజకవర్గంలో చర్చనీయంగా మారాయి. తాజా పరిణామాలపై ‘అడుగు’ ప్రత్యేక కథనం.
చవితి కీడు పేరుతో, వినాయక చవితి పర్వదిన పది రోజులూ నియోజకవర్గానికి దూరంగా ఉన్న కొండా కపుల్స్.. తమ సొంత నియోజకవర్గం వరంగల్ తూర్పు పరిధిలోనే నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ సందర్శనకు, సన్నాహక సమావేశానికి కొండా సురేఖ దూరంగా ఉండడం చర్చకు దారి తీసిది. మంత్రులు పొంగులేటి, సీతక్క, ఎంపీ వేం నరేందర్రెడ్డితో పాటు ఉమ్మడి జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ప్రొటోకాల్ ప్రకారం స్థానిక ఎమ్మెల్యే సురేఖకు ఆహ్వనం లేకుండా ఉండే అవకాశమే లేదు. పైగా అలా సమాచారం లేకుండా కొండా దంపతులు ఊరుకునే రకం కూడా కాదు. బహుషా ఆహ్వనం ఉన్నప్పటికీ మంత్రులతో కలిసి పాల్గొనడం ఇష్టం లేకనే దూరంగా ఉండి ఉంటారనే చర్చే జరుగుతోంది.
వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సన్నాహకంగా ఉ మ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలోనూ సురేఖ, మురళీ కనిపించలేదు. అంతకు రెండు రోజుల ముందే ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సరోత్తంరెడ్డి సురేఖ ఇంటికి వెళ్లి మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావును కలిసి ఆశీస్సులు తీసుకున్నారు.
ఇటీవల సీఈసీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆందోళనలు నిర్వహించింది. వరంగల్ తూర్పులో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఆయూబ్ నేతృత్వంలో జరిగిన కార్యక్రమానికి దూరంగా ఉన్న సురేఖ, మరుసటి రోజు తన అనుచరులతో కలిసి పోచమ్మమైదాన్ సెంటర్లో ప్రత్యేకంగా నిరసన నిర్వహించారు.
మరోవైపు సురేఖ ఇటీవల తన క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశాలకు హాజరై తన ప్రత్యర్థులపై విమర్శలు చేశారే తప్ప, ప్రజలకు నేనున్నాననే భరోసా ఇవ్వలేకపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ లోనే ఉంటామంటూ పార్టీ నాయకులపై తరచూ తిట్ల దండకం అందుకుంటున్న కొండా కపుల్స్, క్రమంగా ఆ పార్టీకి, పార్టీ నాయకులకు కూడా దూరం అవుతున్నట్టుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఇక ఇటీవల ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ నిరసన కార్యక్రమానికి కూడా ఎఐసీసీ సభ్యురాలిగా ఉన్న సురేఖ హాజరు కాలేదు. అయితే, దసరా నుంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్న నేపథ్యంలో ఆ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి సైతం సురేఖ దూరంగా ఉంటారా? అన్న ప్రచారం జరుగుతోంది. పైగా కొండా కపుల్స్ కి గిట్టని వారే, ఆమె సొంత నియోజకవర్గంలో అధికారిక, పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తుండటం, వాటికి ఆమె దూరంగా ఉండటం వంటి తాజా పరిణామాలు కాస్త వాళ్ళకి మున్ముందు మరింత ఇబ్బందికరంగానే మారుతున్నట్లుగా కనిపిస్తోంది. మరికొంత కాలం ఇలాగే కొనసాగితే, రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని కొండా దంపతులు వీడడం ఖాయంగా అనిపిస్తోంది.

