‘తొలకరి వాన – తొంభై పాళ్ళు’ అన్నరు. గట్లనే ‘రోహిణిలో చల్లకుండా, రోకలితో నూర్చలేం’ అట. ‘రోహిణి కార్తెలో చల్లే విత్తనం, రోకలి పోటుకైనా మొలకెత్తుతుంది’ అన్నరు. ఉత్తర సూసి ఎత్తర గంప అన్నది గందుకే.! అదను తప్పితే చదునే. మరందుకే అదను సూసి యిత్తనాలేయాలె. వానను శూసి వరిసాగు శేయాలె. కనీ, గా ఊల్లె గిదంతా శెల్లదు. గా కుటుంబం యిత్తు సల్లకపోతే వరిసాగే సాగది. ఎంత వాన పడ్డా ఎవ్వలూ గింజ కూడా సల్లరు. గట్ల గిప్పుడు గా ఊల్లె సాగే ఆగింది? గదేందో సూద్దాం పదండ్రి.

గా ఊరు బిహార్ రాస్ట్రం. నలంద జిల్ల గంధూపుర్. గా ఊల్లె 150 కుటుంబాలుంటయి. గండ్ల మహతో కుటుంబమే తొట్టతొలుత వరినాట్లు ఏయాలె. గవాల్లు ఏసే దాకా ఎవ్వలూ ఏయరు. ఒకేల ఏసిండ్రా… అరిష్టాలొచ్చి ఊరంతా గత్తరైతదని నమ్ముతరు. 200 ఏండ్లుగా గా మహతో కుటుంబం మొలకలు సల్లినంకనే ఊరంతా సల్లుకుంటరు. ఇగిప్పుడు గా మహతో కుటుంబం మండె కూడా కట్టలే. దీంతోటి గా ఊరంతా వరిసాగు ఆగిపోయింది. గ మహతోవాల్ల దగ్గరికి పోయి ఊరోల్లు బతిలాడిండ్రు. ఇనకపోతే పంచాయతీ పెట్టిండ్రు. మీ కడుపు సల్లగుండ… ఎట్లనన్న శేసి పిడికెడు మొలకలు సల్లుండ్రి అని బతిలాడుకుంటాండ్రు. కనీ గవాల్లు యింటలేరు. గా మహతో వాల్ల మనసు కరుగుత లేదు. ఇగ గా ఊల్లె మొత్తం సాగే ఆగింది.

