పార్టీ నుంచి బహిష్కరించాలంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు|MLA|MLC
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మంత్రి కొండా సురేఖ వ్యవహారం తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత చేసిన తీవ్ర వ్యాఖ్యలు సొంత పార్టీలోనే పెను రాజకీయ తుఫానుకు దారితీశాయి. సుస్మిత వ్యాఖ్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదని, అవి పూర్తిగా ఆమె వ్యక్తిగత అభిప్రాయాలని పేర్కొంటూ మంత్రి కొండా సురేఖ క్రమశిక్షణ కమిటీకి వివరణ ఇచ్చినప్పటికీ పార్టీ నాయకత్వం, ప్రజాప్రతినిధులు శాంతించలేదు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వర్గానికి చెందిన ప్రభుత్వ విప్‌లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక్కతాటిపైకి వచ్చి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సుస్మిత చేసిన వ్యాఖ్యలను మంత్రి సురేఖ బహిరంగంగా ఖండించకపోతే కుదరదని, పార్టీ ప్రతిష్టను దిగజారుస్తున్న కొండా సురేఖను వెంటనే మంత్రివర్గం నుంచే కాకుండా పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయాలని అధిష్ఠానాన్ని గట్టిగా డిమాండ్ చేశారు.
ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మాట్లాడుతూ, ప్రతిపక్షాలు విమర్శలు చేయడం సహజమని, కానీ అధికారంలో ఉంటూ సొంత పార్టీ నేతలే ముఖ్యమంత్రిపై తీవ్ర ఆరోపణలు చేయడం దురదృష్టకరమని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో నడిపించి అధికారంలోకి తెచ్చిన సీఎం రేవంత్ రెడ్డిపై నిరాధారమైన వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
మరో విప్ వేముల వీరేశం స్పందిస్తూ, గతంలో సినిమా నటి సమంత విషయంలోనూ కొండా సురేఖ వాడిన అభ్యంతరకర భాష పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టిందని గుర్తుచేశారు. సొంత ఎంటర్‌టైన్‌మెంట్ కోసం పార్టీని బలిచేయాలని చూస్తే సహించబోమని, సీఎం నిర్ణయాలను తప్పుపట్టే వారికి పార్టీలో కొనసాగే హక్కు లేదని స్పష్టం చేశారు.
సీఎం రేవంత్‌ను రాజకీయంగా బలహీనపరిచేందుకు కుట్రలు పన్నుతున్నారని ఎమ్మెల్యే బాలు నాయక్ ధ్వజమెత్తారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడేవారు ఎంతటివారైనా కులం, హోదాలతో సంబంధం లేకుండా తక్షణమే క్రమశిక్షణా చర్యలు చేపట్టాలని, షోకాజ్ నోటీసులతో సరిపెట్టకుండా శాశ్వతంగా బహిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ కొండా దంపతుల వైఖరిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ పార్టీలో ఉన్నా బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేయడం వారికి అలవాటుగా మారిందని, ఉమ్మడి జిల్లాలోని ఏ ఒక్క ఎమ్మెల్యేతోనైనా సఖ్యతగా ఉన్నారా అని ప్రశ్నించారు. గతంలో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు బీ-ఫారాలు తీసుకొని వదిలి వెళ్లిన చరిత్ర వారిదని, ఇప్పుడు మళ్లీ అధికారం దక్కగానే ప్రతిపక్షాలకు ఆయుధాలు ఇచ్చేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. బీసీ కార్డును అడ్డం పెట్టుకుని పార్టీని బ్లాక్‌మెయిల్ చేయాలని చూడడం సరికాదని, ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో పార్టీ మెజారిటీ గణనీయంగా తగ్గిందని ఎత్తిచూపారు.
వేలాది మంది కార్యకర్తల చెమట, త్యాగాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేలా వ్యవహరిస్తున్న కొండా సురేఖను పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సిందేనని ఎమ్మెల్యేలు కేఆర్ నాగరాజు, మధుసూదన్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, దొంతి మాధవరెడ్డి, మందుల సామెల్, వెడ్మ బొజ్జు, బుయ్యని మనోహర్ రెడ్డి, కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, బత్తుల లక్ష్మా రెడ్డి, వీర్లపల్లి శంకర్, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ, ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, బస్వరాజు సారయ్య ముక్తకంఠంతో డిమాండ్ చేశారు.

