ఇప్పుడు పార్లమెంటులో జరుగుతున్నది నిజంగా ప్రజల కోసమే అయితే, వారికి ప్రయోజనం కలగాలి. విద్యార్థుల కోసమే అయితే వారి సమస్యకు పరిష్కారం రావాలి. ప్రజాస్వామ్యం కోసమే అయితే పార్లమెంట్ సరిగా పనిచేయాలి. ప్రజల సమస్యలను పక్కనపెట్టి సభను స్తంభింపజేయడమూ, న్యాయం కోరుతున్న విద్యార్థులపై బలప్రయోగం చేయడమూ రెండూ సరైనవి కావు. ఢిల్లీ అయినా రాంచీ అయినా ఒకే న్యాయ ప్రమాణం ఉండాలి. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఒకే విలువలు పాటించాలి.
డా.మార్గం-అడుగు, ఎడిటోరియల్
ప్రజల సమస్యలపై పోరాడాల్సిన ప్రజాప్రతినిధులు ఒకవైపు పార్లమెంటును స్తంభింపజేస్తే, తమ భవిష్యత్తు కోసం రోడ్డెక్కిన విద్యార్థుల గొంతును పాలకులు నొక్కేస్తుంటే, చివరకు మిగిలేది ఏమిటి?
పార్లమెంట్ సమావేశాలంటే దేశ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. తమ సమస్యలపై తమ ప్రతినిధులు గళమెత్తాలని కోరుకుంటారు. కానీ, ఇటీవలి కాలంలో పార్లమెంటరీ కార్యకలాపాలు అత్యంత దారుణంగా దిగజారి సాగుతున్నాయి. సభ ప్రారంభం కావడం, విపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకురావడం, ప్లకార్డులు ప్రదర్శించడం, నినాదాలు చేయడం, సభ వాయిదా పడటం… షరా మామూలైపోయింది.
ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ప్రతిపక్షాల హక్కు మాత్రమే కాదు, బాధ్యత కూడా. అయితే, ప్రశ్నించేందుకు ఉన్న సభను పనిచేయనివ్వకుండా చేయడం సమంజసమేనా? ఒక మంత్రి క్షమాపణ చెప్పాలని, ప్రధాని సమాధానం ఇవ్వాలని విపక్షాలు డిమాండ్ చేయవచ్చు. కానీ ఆ డిమాండ్‌ను చర్చ, ప్రశ్నలు, తీర్మానాలు, వాదనలు, ఆధారాల ద్వారా బలంగా వినిపించాలి. సభను స్తంభింపజేయడం ద్వారా చివరకు నష్టపోయేది ప్రభుత్వం కంటే ప్రజలే.
పార్లమెంట్ పని తీరు ఘోరంగా ఉంది. 2025 వర్షాకాల సమావేశాల్లో లోక్‌సభ కేవలం 29 శాతం, రాజ్యసభ 34 శాతం మాత్రమే పనిచేశాయి. లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో 23 శాతం, రాజ్యసభలో కేవలం 6 శాతం మాత్రమే వినియోగమైంది. అనేక బిల్లులు అంతరాయాల మధ్య చర్చ లేకుండానే ఆమోదించబడ్డాయి. 2024 శీతాకాల సమావేశాల్లోనూ లోక్‌సభ 52 శాతం, రాజ్యసభ 39 శాతం సమయమే పనిచేశాయి. అంటే సమస్య ఒక్క పార్టీది కాదు.. అధికార పక్షం, ప్రతిపక్షం రెండూ పార్లమెంటరీ సంప్రదాయాల పరిరక్షణకు బాధ్యత వహించాలి.
ఇదే సమయంలో ఉద్యోగ నియామక పరీక్షల్లో అవకతవకలు, పేపర్ లీక్ ఆరోపణలపై విద్యార్థులు, ఉద్యోగార్థులు రోజుల తరబడి ఆందోళన చేస్తున్నారు. జూలై చివర్లో ప్రారంభమైన ఆందోళన ఇంకా కొనసాగుతూనే ఉంది. సోమవారం వేలాది మంది అభ్యర్థులు రాంచీలోని అసెంబ్లీని ముట్టడించారు. పోలీసులు వారిని అడ్డుకునేందుకు బాష్పవాయు గోళాలు, జలఫిరంగులు, లాఠీలను ఉపయోగించారు. ఉద్రిక్తతల కారణంగా అసెంబ్లీ కార్యకలాపాలపైనా ప్రభావం పడింది.
ఝార్ఖండ్‌లో పరిస్థితి తీవ్రతకు దర్యాప్తు పరిణామాలు కూడా అద్దం పడుతున్నాయి. మాజీ జేపీఎస్సీ ఛైర్మన్ ఎల్. ఖియాంగ్తేను రాష్ట్ర సీఐడీ అరెస్టు చేసినట్లు తాజా నివేదికలు చెబుతున్నాయి. అంతేకాదు, జేపీఎస్సీకి చెందిన ముగ్గురు సభ్యులు కూడా రాజీనామా చేసినట్లు సమాచారం వెలువడింది. ఈ పరిణామాలన్నీ విద్యార్థుల అనుమానాలను పూర్తిగా నిరాధారమైనవిగా కొట్టిపారేయలేమని స్పష్టం చేస్తున్నాయి.
ఇక్కడే రాజకీయ పార్టీల చిత్తశుద్ధికి అసలైన పరీక్ష. దిల్లీలో విద్యార్థుల నిరసనకు మద్దతు ఇచ్చే పార్టీలు ఝార్ఖండ్‌లో విద్యార్థులు అదే తరహా సమస్యపై రోడ్డెక్కినప్పుడు ఎందుకు మౌనంగా ఉండాలి? అధికారంలో ఉన్నప్పుడు ఒక ప్రమాణం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో ప్రమాణం ఎందుకు? అందుకే అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకే వైఖరితో వ్యవహరించాలి.
అయితే శాంతి భద్రతలను కాపాడటం పోలీసుల బాధ్యత. అసెంబ్లీ ముట్టడిని అడ్డుకోవాల్సిన అవసరం ఉండవచ్చు. కానీ లాఠీచార్జి, జలఫిరంగులు, బాష్పవాయు ప్రయోగం చివరి మార్గాలుగా మాత్రమే ఉండాలి. ముఖ్యంగా విద్యార్థులు పాల్గొనే నిరసనల్లో ముందస్తు చర్చలు, ప్రతినిధి బృందంతో చర్చ, ప్రత్యామ్నాయ నిరసన స్థలం వంటి పద్ధతులకు ప్రాధాన్యం ఇవ్వాలి.
పేపర్ లీక్ వ్యవస్థపై కఠిన చర్యలు తప్పనిసరి. పటిష్ఠ దర్యాప్తు, వేగవంతమైన న్యాయ ప్రక్రియ, అక్రమంగా సంపాదించిన ఆస్తుల స్వాధీనం, భారీ జరిమానాలు, పరీక్ష నిర్వహణ సంస్థలపై బాధ్యత, డిజిటల్ భద్రతా వ్యవస్థల బలోపేతం మరింత అవసరం. నేరం చేసినవాడు ఎంత పెద్దవాడైనా తప్పించుకోలేడనే భయం.. నిర్దోషి విద్యార్థికి అన్యాయం జరగదనే భరోసా రెండూ కల్పించాలి.
ఇక పార్లమెంట్ విషయంలోనూ ఇదే సూత్రం వర్తిస్తుంది. అధికార పక్షం ప్రతిపక్షాన్ని వినాలి. ప్రతిపక్షం సభను పనిచేయనివ్వాలి. చర్చ జరగాలి. ప్రశ్నలకు సమాధానాలు రావాలి. బిల్లులపై లోతైన పరిశీలన జరగాలి. ప్రజల డబ్బుతో నడిచే పార్లమెంట్ సమయాన్ని నినాదాలతో వృథా చేయడం ప్రజల పట్ల బాధ్యతా రాహిత్యమే. 2025 బడ్జెట్ సమావేశంలో లోక్‌సభ నిర్ణీత సమయానికి 111 శాతం పనిచేసిన సందర్భం కూడా ఉంది. అంటే సభ సజావుగా సాగడం అసాధ్యం కాదు. రాజకీయ సంకల్పం ఉంటే సుసాధ్యమే.
ఝార్ఖండ్ విద్యార్థుల ఆందోళనకు పరిష్కారం రోడ్డుపై పోలీసు బలప్రయోగంలో లేదు. అసెంబ్లీలో స్పష్టమైన ప్రకటనలో ఉంది. పారదర్శక దర్యాప్తులో ఉంది. తప్పు చేసినవారిపై చర్యలో ఉంది. భవిష్యత్తులో ఒక్క పరీక్ష కూడా లీక్ కాకుండా పటిష్ఠ వ్యవస్థ ఏర్పాటు చేయడంలో ఉంది. అలాగే పార్లమెంట్ ప్రతిష్ఠంభనకు పరిష్కారం సభ వెలుపల నినాదాల్లో కాదు, సభ లోపల చర్చల్లో ఉంది.
ఇప్పుడు పార్లమెంటులో జరుగుతున్నది నిజంగా ప్రజల కోసమే అయితే వారికి ప్రయోజనం కలగాలి. విద్యార్థుల కోసమే అయితే వారి సమస్యకు పరిష్కారం రావాలి. ప్రజాస్వామ్యం కోసమే అయితే పార్లమెంట్ సరిగా పనిచేయాలి. ప్రజల సమస్యలను పక్కనపెట్టి సభను స్తంభింపజేయడమూ, న్యాయం కోరుతున్న విద్యార్థులపై బలప్రయోగం చేయడమూ రెండూ సరైనవి కావు. ఢిల్లీ అయినా రాంచీ అయినా ఒకే న్యాయ ప్రమాణం ఉండాలి. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఒకే విలువలు పాటించాలి.
నినాదాలకు బదులు చర్చలు. నిరసనలకు బదులు పరిష్కారాలు జరగాలి. రాజకీయ ప్రయోజనానికి బదులు ప్రజా ప్రయోజనాలు అనే బాధ్యతను ప్రజాప్రతినిధులు, పాలకులు, ప్రతిపక్షాలు గుర్తించినప్పుడే పార్లమెంట్ ప్రతిష్ఠ పెరుగుతుంది.

