ఎనకటికి ఎంత ఎక్కువ మందిని కంటే గంత ఇలువ. అంత గౌరవం. ఒక్కొకల్లు డజను మందిని కనేది. గంపెడు మందితో ఇల్లు కళకళలాడేది. ఎంత ఎక్కువ మంది ఉంటే, గా ఇంటికి అంత బలం ఉండేది.
ఇగ కాలం మారింది. గడిసినా కొద్దీ, గంత మందిని సాదుడు కట్టమైపాయే! ఇగ ఒక్కరు వద్దు! ఇద్దరే ముద్దు!! అని పచారం సేసి, గాయింత గా జనాభను అరికట్టిరి. అయినా, పపంచకంల మన దేశమే జనాభాల ముందుండే!

ఇగిప్పుడు మల్లా కాలం మారింది. పతి జంటా ముగ్గురిని కనాలని సెప్పబట్టిరి.!? గాన్నే ఆగక, మూడో బిడ్డను కంటే బంపర్ ఆఫర్లు ఇయ్యబట్టిరి.!
గుజరాత్ ల ‘కచ్ కడ్వా పాటిదార్ సమాజ్’ ఉంది. గండ్ల మొత్తం 17 వేల మందే ఉన్నరట! ఇగ గిదంతా పని కాదని, మూడో బిడ్డను కంటే గవాల్లకు రూ.50 వేల ఫిక్స్డ్ డిపాజిట్ బహుమతిగ ఇస్తమని పకటించింది. గంతేకాకుండా, గా జంటను ఘనంగా సత్కరిస్తమని తెలిపింది.
గీ లెక్కనే సూరత్ పార్శీ పంచాయత్ కూడా జనాభా ప్రోత్సాహక పథకాన్ని అమలు సేస్తున్నది. మూడో బిడ్డకు 25 ఏండ్లు వచ్చే దాకా, నెలకు రూ.5 వేల చొప్పున అందిస్తున్నది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 39 జంటలు గీ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నదట. మరి మనదగ్గర ఏమంటరో కదా!?

