భారత్‌కు శాశ్వత సభ్యత్వం సాధించాలంటే దౌత్య మద్దతుతోపాటు ఐ రా స చార్టర్ సవరణకు అవసరమైన ప్రక్రియలు పూర్తికావాలి. తాజా యూరప్ మద్దతు ఆశలను పెంచినా, తుది ఫలితానికి మరింత అంతర్జాతీయ సమ్మతి అవసరం. కానీ, అది వాస్తవ రూపం దాల్చే వరకు నిరంతర చర్చలు, వ్యూహాత్మక భాగస్వామ్యాలు, సంస్కరణలపై సమ్మతి అత్యవసరం.
మార్గం – అడుగు, ఎడిటోరియల్
ప్రపంచ రాజకీయాల్లో భారత్ ప్రాధాన్యం క్రమంగా పెరుగుతోంది. ఆర్థిక వ్యవస్థ, సాంకేతిక అభివృద్ధి, రక్షణ రంగం, దౌత్య సంబంధాలు, అంతర్జాతీయ సహకారం వంటి విభిన్న రంగాల్లో దేశం తన ప్రభావాన్ని విస్తరించుకుంటోంది. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా, గ్లోబల్ సౌత్ తరఫున కీలక స్వరం వినిపిస్తున్న దేశంగా భారత్ ఎదిగింది. అయినప్పటికీ, ప్రపంచ శాంతి, భద్రతకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునే ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం మాత్రం ఇంకా దక్కలేదు. ఈ అసమానతపై చర్చ జరుగుతున్న వేళ భారత్ అభ్యర్థిత్వానికి నాలుగు యూరప్ దేశాలు మద్దతు ప్రకటించడం దౌత్యపరంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
1945లో ఏర్పడిన భద్రతామండలి నిర్మాణం, నాటి ప్రపంచ శక్తుల సమీకరణాలను ప్రతిబింబిస్తుంది. నేడు ఐరాసలో 193 సభ్యదేశాలు ఉన్నప్పటికీ శాశ్వత సభ్యత్వం అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్… ఐదు దేశాలకే పరిమితమైంది. వీటికి వీటో అధికారం ఉంది. మరో పది దేశాలు రెండేళ్ల కాలానికి ఎన్నికవుతాయి. ఈ నిర్మాణంలో ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా వంటి ప్రాంతాలకు తగిన ప్రాతినిధ్యం లేదన్న వాదన బలంగా వినిపిస్తోంది. 1945 నాటి ప్రపంచం, నేటి ప్రపంచం మధ్య ఉన్న రాజకీయ, ఆర్థిక, జనాభా మార్పులను పరిగణనలోకి తీసుకుంటే భద్రతామండలి సంస్కరణ అవసరం స్పష్టమవుతుంది.
తాజా జాగా 81వ ఐరాస సర్వసభ్య సమావేశం సందర్భంగా జరిగిన తొలి భారత్–విసెగ్రాడ్ గ్రూప్ విదేశాంగ మంత్రుల సమావేశంలో హంగేరీ, పోలాండ్, స్లోవేకియా, చెక్ రిపబ్లిక్ భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించాలన్న డిమాండ్‌కు మద్దతు ప్రకటించాయి. గ్లోబల్ సౌత్‌లో కీలక భాగస్వామిగా, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఎదుగుతున్న శక్తిగా భారత్ ప్రపంచ నిర్ణయాల శక్తిగా ఉండాల్సిన అవసరాన్ని స్లోవాక్ విదేశాంగ మంత్రి జురాజ్ బ్లానార్ ప్రస్తావించారు. ఈ మద్దతు భారత్ దౌత్య ప్రయత్నాలకు అదనపు బలాన్ని అందించింది.
భారత్ ఒంటరిగా ఈ పోరాటం చేయడం లేదు. బ్రెజిల్, జర్మనీ, జపాన్‌లతో కలిసి జీ4 కూటమిగా ఏర్పడి భద్రతామండలి విస్తరణ కోసం ప్రయత్నిస్తోంది. భారత్ ఇప్పటివరకు ఎనిమిది సార్లు తాత్కాలిక సభ్యదేశంగా పనిచేసింది. అంతర్జాతీయ శాంతి పరిరక్షణ కార్యకలాపాల్లోనూ భారత సైనికులు, సిబ్బంది దీర్ఘకాలంగా సేవలందించారు. ఈ అనుభవం ప్రపంచ నిర్ణయ ప్రక్రియలో భారత భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే వాదనకు ఆధారం. అయితే, తాత్కాలిక సభ్యత్వం, శాశ్వత సభ్యత్వం మధ్య అధికారపరమైన తేడా కొనసాగుతూనే ఉంది.
భారత్ అభ్యర్థిత్వానికి అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, రష్యా వంటి శాశ్వత సభ్యదేశాల నుంచి వివిధ సందర్భాల్లో మద్దతు వ్యక్తమైంది. అయితే భద్రతామండలి సంస్కరణలపై సమగ్ర ఏకాభిప్రాయం ఏర్పడలేదు. ముఖ్యంగా వీటో అధికారం, కొత్త శాశ్వత సభ్యదేశాలకు కల్పించాల్సిన అధికారాలు, ప్రాంతీయ ప్రాతినిధ్యం వంటి అంశాలు సంక్లిష్టంగా ఉన్నాయి. రష్యా కొత్త శాశ్వత సభ్యదేశాలను చేర్చడాన్ని సమర్థిస్తున్నప్పటికీ ప్రస్తుత వీటో వ్యవస్థను కొనసాగించాలని చెబుతోంది. చైనా భారత్ శాశ్వత సభ్యత్వానికి స్పష్టమైన మద్దతు ప్రకటించని పరిస్థితి కూడా సంస్కరణ ప్రక్రియలో ఒక సవాలుగా ఉంది.
విదేశాంగ మంత్రి జైశంకర్ అంతర్జాతీయ వ్యవస్థను మరింత సమగ్రంగా, సమర్థంగా తీర్చిదిద్దాల్సిన అవసరాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇంధనం, ఆహారం, ఎరువులు, ఆర్థిక రంగాల్లో ఎదురవుతున్న సంక్షోభాలు అభివృద్ధి చెందుతున్న దేశాలపై ప్రభావం చూపుతున్న నేపథ్యంలో బహుపాక్షిక సహకారం మరింత బలపడాలి. ఏ ఒక్క దేశ ఆధిపత్యానికీ ప్రపంచ వ్యవస్థ లోనుకాకుండా, దేశాల మధ్య సమాన భాగస్వామ్యం పెరగాలన్నది ఈ దృక్పథంలో కీలకాంశం.
భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించాలన్న డిమాండ్ కేవలం ఒక దేశ ప్రయోజనానికి సంబంధించిన అంశం కాదు. ఐరాస వ్యవస్థను ప్రస్తుత ప్రపంచ వాస్తవాలకు అనుగుణంగా పునర్వ్యవస్థీకరించాలన్న విస్తృత ప్రశ్నతో ఇది ముడిపడి ఉంది. అయితే సభ్యత్వం సాధించాలంటే దౌత్య మద్దతుతోపాటు ఐరాస చార్టర్ సవరణకు అవసరమైన ప్రక్రియలు పూర్తికావాలి. తాజా యూరప్ మద్దతు ఆశలను పెంచినా, తుది ఫలితానికి మరింత అంతర్జాతీయ సమ్మతి అవసరం. భారత్ శాశ్వత సభ్యత్వం సాధించే లక్ష్యానికి ఈ పరిణామం ఒక దౌత్యపరమైన ముందడుగు. కానీ అది వాస్తవ రూపం దాల్చే వరకు నిరంతర చర్చలు, వ్యూహాత్మక భాగస్వామ్యాలు, సంస్కరణలపై సమ్మతి అత్యవసరం.

