తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో పని చేసే రెగ్యులర్ ఉపాధ్యాయుల పదవీ విరమణ వయస్సును 60 నుండి 65 ఏళ్లకు పెంచింది. ఈ పెంపు యూజీసీ వేతన స్కేల్ పొందుతున్న ఉపాధ్యాయులకు వర్తిస్తుంది.
తెలంగాణ ఉన్నత విద్యామండలి (TGCHE) తెలిపిన ప్రకారం, 2013 తర్వాత కొత్త నియామకాలు చేపట్టలేదు, దీంతో అనేక మంది ఉపాధ్యాయులు పదవీ విరమణ చేశారు. ఈ కారణంగా విద్యా, పరిశోధన నాణ్యతపై ప్రభావం పడింది. యూజీసీ నిబంధనలు, 2016 వేతన సవరణలను అనుసరిస్తూ, అనుభవం కలిగిన అధ్యాపకులను కొనసాగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్లకు ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

