అజం జాహి కార్మిక భవన స్థల పరిరక్షణ కోసం
అఖిల పక్షం ఏర్పాటు వైపు అడుగులు..!
వరంగల్ అజం జాహి కార్మిక భవన స్థల పరిరక్షణ కోసం కార్మిక కుటుంబాలు, రాజకీయ పార్టీలు ఉమ్మడిగా ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. రాజకీయాలు, పార్టీలకతీతంగా “వరంగల్ అజం జాహి కార్మిక భవన పరిరక్షణ కమిటీ” పేరుతో అఖిలపక్షం ఏర్పాటు చేసి ముందుకు సాగాలని నిర్ణయించారు. అజం జాహి కార్మిక కుటుంబానికి చెందిన ప్రముఖ రచయిత, రిటైర్డ్ ప్రొఫెసర్ సారథ్యంలో జేఏసీ ఏర్పాటు జరుగుతున్నది. రిటైర్డ్ ప్రొఫెసర్ కన్వీనర్ గా వివిధ పార్టీలు, ప్రజాసంఘాల ప్రతినిధులు సభ్యులుగా పోరాడేందుకు సై అంటున్నారు. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన చందంగా అజం జాహి మిల్లు పేరు చెప్పుకొని ఎదిగిన నాయకులు మౌనంగా ఉన్నా.. కార్మికుల కుటుంబాలు పోరాడేందుకు సకల సన్నద్ధమవుతున్నాయి. అజం జాహి కార్మికుల కుటుంబాలు ఆత్మీయ సమ్మేళనం పేరుతో త్వరలో సమావేశం కానున్నాయి. ఒకవైపు కబ్జాదారులు, వారికి సహకరించే అధికారులు, వీళ్ళకి అండగా రాజకీయ నాయకులు, మరోవైపు అజం జాహి మిల్లు కార్మిక కుటుంబాలు.. ప్రజా సంఘాలు పోరుబాట పట్టనున్న నేపథ్యంలో ఈ సమస్య పరిష్కారం కానుందా? మరింత జఠిలం కానుందా? మరి అజం జాహి కార్మిక భవన స్థల పరిరక్షణ కోసం ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జీ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. జిల్లాకు చెందిన మంత్రులు కొండా సురేఖ, సీతక్క, వరంగల్ జిల్లా ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారని ప్రజలు ఎదురు చూస్తున్నారు.

