గా ఊల్లె నిజంగా రోజూ పండుగే? ఎవలింట్లా పొయ్యి ఎలగదు. ఊరంతటికీ ఒకటే పొయ్యి. కులం లేదు మతం లేదు. గా ఊరంతా ఒకటే కుటుంబం. రోజూ అంతా కలిసే ఉంటరు. ఒకదగ్గరనే కలిసే ఒండుకుంటరు. కడుపునిండా కలిసే తింటరు. ఊసులు శెప్పుకుంటరు. పండుగ శేసుకుంటరు.

గా ఊల్లె కాస సదువుకున్నోల్లు, పెద్దైనోల్లంతా పెద్ద పెద్ద సదువులతోటి పపంచం పట్టిండ్రు. ఇగ మిగిలినోల్లంతా ముసలోల్లె! లెక్కేస్తే గ వాల్లు 500 మంది దాటిండ్రు. ఇగ గవాల్లందరి దగ్గరా డబ్బుంది, పొలం, శెలకలు గట్రాలున్నయి. లేనిదల్లా కుటుంబాలే? పండుటాకులు, ఒంటరైపోయిండ్రు. ఇగ గా ఊరికి గ అమెరికా నుంచొచ్చి సర్పంచ్ అయిన పూనంభాయి పటేల్ కు ఏం చేయాల్నో తోయలే. పిల్లగాండ్లు, నడీడోల్లు ఎవ్వలూ లేరు. గా ముసలోల్ల తిప్పలు సూసిండు. గిదంత పని కాదని, అందరినీ పోగేసిండు. రోజూ గా 500 మందీకి ఒక్కదగ్గర్నే వంట పెట్టిండు. ముసలోల్లకు ఏది ఆరోగ్యమో గదే పెడ్తాండు. ఇగ మొదట్ల కాస అటిటన్నా, ఇగిప్పుడు గవాల్లంతా ఒక్కదగ్గర్నే తింటాండ్లు. కట్టసుఖాలు పంచుకుంటాండ్లు. ఊకూకనే తింటే ఏం బాగుంటదని, నెలకు మనిషో 2,500 రూపాయిలు ఇస్తాండ్లు. గిదెట్లుంది!? కొడుకులు, బిడ్డలు సూత్తలేరని బాదపడేకంటే, గీ ఆలోశన సేత్తే మస్తుగుంటది కదా? గింత సెప్పిన గా ఊరు పేరే సెప్పలే కదా! గా ఊరు చందంకి. రాష్ట్రం గుజరాత్.

