రైతులు పండించిన ప్రతి గింజను కొంటామని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. పాలకుర్తి నియోజకవర్గ పరిధిలో పెద్దవంగర మండల కేంద్రంలో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం, చిట్యాల గ్రామంలో వాటర్ ప్లాంట్, ముత్తారం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం, తీగారం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన, లక్ష్మీనారాయణపురం, దేవరుప్పుల మండల కేంద్రం, నిర్మల గ్రామాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని మాట్లాడుతూ… రైతులకు అండగా మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా మన ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. సన్నరకం వడ్లకు క్వింటాలకు రూ.500 బోనస్ ఇస్తున్నట్లు తెలిపారు. రైతులు నేరుగా కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకురావాలని, దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. రైతులకు అందుబాటులోగా కొనుగోలు కేంద్రాలను విస్తృతంగా ఏర్పాటు చేస్తున్నట్టు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో తొర్రూరు మార్కెట్ చైర్మెన్ హనుమాండ్ల తిరుపతి రెడ్డి, బ్లాక్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, అధికారులు, కాంగ్రెస్ నేతలు, రైతులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

