కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి గిరిజన వ్యవహారాల శాఖపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఆదివారం ఢిల్లీలో జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ, “గిరిజన వ్యవహారాల శాఖను ఉన్నత కులాల వారికి అప్పగిస్తేనే నిజమైన పురోగతి సాధ్యమవుతుంది” అని అన్నారు.
“ప్రస్తుతం గిరిజన సమాజానికి చెందిన వ్యక్తులే ఈ శాఖను నిర్వహిస్తున్నారు. ఇది దేశానికి శాపం. గిరిజనుల సంక్షేమానికి బయటివారు బాధ్యత తీసుకోవడం అవసరం. ఒక బ్రాహ్మణుడు లేదా నాయుడు ఈ శాఖను పర్యవేక్షిస్తే గణనీయమైన మార్పు వస్తుంది” అని సురేష్ గోపి అన్నారు.
అలాగే, గిరిజన నాయకులకు ఉన్నత వర్గాల సంక్షేమ శాఖను అప్పగించాలని కూడా సూచించారు. తాను గిరిజన వ్యవహారాల శాఖను నిర్వహించాలనే కోరికను ప్రధాని మోదీకి వ్యక్తం చేశానని, అయితే శాఖల కేటాయింపుకు కొన్ని విధానాలుంటాయని తెలిపారు.
కేరళలో తీవ్ర నిరసన
సురేష్ గోపి వ్యాఖ్యలపై కేరళలో తీవ్ర ప్రతిస్పందన వ్యక్తమైంది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి బెనోయ్ విశ్వం మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా విమర్శించారు. కుల వ్యవస్థను ప్రోత్సహించేలా మాట్లాడిన సురేష్ గోపి, రాష్ట్రాన్ని అవమానించిన కేంద్ర సహాయ మంత్రి జార్జ్ కురియన్ను తక్షణం మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలు కేరళలో రాజకీయ దుమారం రేపుతున్నాయి.

