విద్యారంగంలో నిజమైన సంస్కరణలు రావాలంటే ప్రభుత్వ పాఠశాలల నాణ్యతను పెంచడం, కామన్ స్కూల్ విధానాన్ని దశలవారీగా అమలు చేయడం, ప్రైవేట్ విద్యాసంస్థలపై సమర్థవంతమైన నియంత్రణ విధించడం ఒకేసారి అమలు చేయాలి. తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఆలోచన ఈ దిశగా మొదటి అడుగుగా నిలవవచ్చు. కానీ అది విజయవంతం కావాలంటే రాజకీయ సంకల్పం, పరిపాలనా చిత్తశుద్ధి, దీర్ఘకాలిక ప్రణాళిక అవసరం.
డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్
తెలంగాణలో ప్రభుత్వం ప్రారంభించిన “తెలంగాణ పబ్లిక్ స్కూల్” విధానం విద్యారంగంలో ఒక కొత్త చర్చకు తెరతీసింది. విద్య అనేది కేవలం వ్యక్తిగత అభివృద్ధికి సంబంధించిన అంశం మాత్రమే కాదు. సామాజిక సమానత్వం, ఆర్థిక పురోగతి, ప్రజాస్వామ్య బలోపేతానికి పునాది. అందుకే ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాలు విద్యను ప్రభుత్వ ప్రధాన బాధ్యతగా గుర్తించాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా అదే దిశగా అడుగులు వేయడం స్వాగతించదగ్గ పరిణామం. అయితే కొత్త పేర్లతో కొత్త పథకాలను ప్రవేశపెట్టడం కంటే, రాష్ట్రంలోని విద్యా వ్యవస్థను సమూలంగా పునర్నిర్మించడం మరింత అవసరం.
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వ, స్థానిక సంస్థల ఆధ్వర్యంలో 26 వేల పాఠశాలలు పనిచేస్తున్నాయి. వీటిలో 19 లక్షల మంది విద్యార్థులు చదువుతుండగా, ప్రైవేట్ విద్యాసంస్థల్లో 35 నుంచి 36 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. అంటే రాష్ట్రంలోని విద్యార్థుల్లో రెండింట మూడొంతులకుపైగా ప్రైవేట్ విద్యాసంస్థలపై ఆధారపడుతున్నారు. ఇది ప్రభుత్వ విద్యపై ప్రజల విశ్వాసం ఎంత మేర తగ్గిందో తెలుపుతోంది.
గత రెండు దశాబ్దాలుగా ప్రైవేట్ విద్యాసంస్థల విస్తరణ వేగంగా జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా సాధారణ కుటుంబాలు అప్పులు చేసి తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివితే నాణ్యమైన విద్య, ఇంగ్లీష్ పరిజ్ఞానం, భవిష్యత్తు అవకాశాలు దూరమవుతాయనే భావన బలపడింది. ఫలితంగా అనేక ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థుల కొరతతో మూతపడే పరిస్థితికి చేరుకున్నాయి. విద్య హక్కుగా కాకుండా వ్యాపార వస్తువుగా మారిపోయిన దుస్థితి నెలకొంది.
ఈ నేపథ్యంలో కామన్ స్కూల్ విధానం అవసరం మరింత స్పష్టంగా కనిపిస్తోంది. సమాజంలోని అన్ని వర్గాల పిల్లలు ఒకే పాఠశాలలో చదవడం ద్వారా మాత్రమే విద్యా సమానత్వం సాధ్యమవుతుంది. ప్రస్తుతం కులాలు, మతాలు, సంక్షేమ వర్గాల వారీగా హాస్టళ్లు, పాఠశాలలు కొనసాగుతున్నాయి. మరోవైపు ధనికుల పిల్లలు ఖరీదైన ప్రైవేట్ పాఠశాలల్లో, పేదల పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. ఈ విభజన విద్యలోనే కాదు, సామాజిక సంబంధాల్లో కూడా అంతరాలను పెంచుతోంది.
తెలంగాణ పబ్లిక్ స్కూల్ భావనను ప్రభుత్వం నిజాయితీగా అమలు చేయాలంటే, దానిని కేవలం కొద్ది మోడల్ పాఠశాలలకే పరిమితం చేయకూడదు. ప్రతి గ్రామం లేదా మండల స్థాయిలో నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒకే సమగ్ర విద్యా వ్యవస్థను ఏర్పాటు చేయాలి. విద్యార్థులకు ఉచిత విద్యతో పాటు అల్పాహారం, మధ్యాహ్న భోజనం, పుస్తకాలు, యూనిఫాంలు, డిజిటల్ వసతులు, రవాణా సదుపాయం కూడా కల్పించాలి. ప్రస్తుతం విద్యారంగంపై ప్రభుత్వం ఖర్చు చేస్తున్న వేల కోట్ల రూపాయలను సమర్థవంతంగా వినియోగిస్తే ఈ లక్ష్యాన్ని సాధించడం అసాధ్యం కాదు.
ఇంగ్లీష్ భాష విషయంలో కూడా వాస్తవాలను గుర్తించాల్సిన అవసరం ఉంది. నేడు సామాన్య కుటుంబాలు కూడా తమ పిల్లలు ఇంగ్లీషులో మాట్లాడాలని కోరుకుంటున్నాయి. అందువల్ల తెలుగు మాధ్యమాన్ని బలోపేతం చేస్తూనే, ఎల్‌కేజీ నుంచే స్పోకెన్ ఇంగ్లీష్‌ను తప్పనిసరి చేయాలి. మాతృభాషలో విద్యార్థులు విషయ పరిజ్ఞానం పొందుతూనే, ఇంగ్లీష్‌లో కమ్యూనికేషన్ నైపుణ్యాలు పెంపొందించుకునే ద్విభాషా విధానాన్ని అమలు చేయాలి. ప్రపంచంలోని అనేక దేశాలు ఇదే నమూనాను అనుసరిస్తున్నాయి.
హాస్టళ్ల వ్యవస్థపై కూడా పునరాలోచన అవసరం. వేలాది మంది పిల్లలు చిన్న వయస్సులోనే కుటుంబాలకు దూరంగా హాస్టళ్లలో ఉంటున్నారు. విద్యార్థుల వ్యక్తిత్వ వికాసంలో కుటుంబం కీలక పాత్ర పోషిస్తుంది. అందువల్ల సాధ్యమైనంత వరకు పిల్లలు ఇంటి నుంచే పాఠశాలకు వెళ్లే విధంగా రవాణా సదుపాయాలను కల్పించాలి. ప్రత్యేక అవసరాలు గల అంధ, బధిర, మూగ విద్యార్థులకు మాత్రం ప్రత్యేక పాఠశాలలు, హాస్టల్ సదుపాయాలు కొనసాగించవచ్చు.
అమెరికా, బ్రిటన్, ఫిన్లాండ్ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రభుత్వ పాఠశాల వ్యవస్థే విద్యకు ప్రధాన ఆధారం. అక్కడ ప్రభుత్వ విద్య నాణ్యతపై ప్రజలకు విశ్వాసం ఉంది. మన దేశంలో మాత్రం నియంత్రణలేని ప్రైవేట్ విద్యావ్యవస్థ ప్రభుత్వ విద్యను బలహీనపరిచింది. ప్రైవేట్ పాఠశాలలను పూర్తిగా వ్యతిరేకించడం పరిష్కారం కాదు. కానీ కనీస ప్రమాణాలు లేకుండా నడుస్తున్న విద్యాసంస్థలపై కఠిన నియంత్రణ తప్పనిసరి.
విద్యారంగంలో నిజమైన సంస్కరణలు తీసుకురావాలంటే ప్రభుత్వ పాఠశాలల నాణ్యతను పెంచడం, కామన్ స్కూల్ విధానాన్ని దశలవారీగా అమలు చేయడం, ప్రైవేట్ విద్యాసంస్థలపై సమర్థవంతమైన నియంత్రణ విధించడం అనే మూడు అంశాలు ఒకేసారి అమలులోకి రావాలి. తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఆలోచన ఈ దిశగా మొదటి అడుగుగా నిలవవచ్చు. కానీ అది విజయవంతం కావాలంటే రాజకీయ సంకల్పం, పరిపాలనా చిత్తశుద్ధి, దీర్ఘకాలిక ప్రణాళిక అవసరం. విద్యను వ్యాపార వస్తువుగా కాకుండా సామాజిక హక్కుగా గుర్తించినప్పుడే సమాన అవకాశాల సమాజం నిర్మాణం సాధ్యమవుతుంది.

