పాదయాత్రకు ప్రజల ఘనస్వాగతం
రాజ్యాంగ పరిరక్షణ కోసం అందరూ ముందుకు రావాలి
సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఈ యాత్రలో భాగస్వామ్యం కావాలి
సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేయాలి
జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ యాత్రలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
పాలకుర్తి నియోజకవర్గంలో భారత రాజ్యాంగ పరిరక్షణ కోరుతూ.. ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. రాజ్యాంగ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అనే నినాదంతో, ఏఐసీసీ (అఖిల భారత కాంగ్రెస్ కమిటీ), పీసీసీ (ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ) ఆదేశాల మేరకు రాయపర్తి మండలం కాట్రపల్లి గ్రామం నుండి బురహాన్ పల్లి గ్రామం వరకు “జై బాపు, జై భీమ్, జై సంవిధాన్” పేరుతో రాజ్యాంగ పరిరక్షణ సన్నాహక సమావేశం, పాదయాత్ర నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని పాలకుర్తి శాసనసభ్యురాలు యశస్విని రెడ్డి, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, దేశ ప్రజలు రాజ్యాంగాన్ని గౌరవించి, దానిని కాపాడే బాధ్యత తీసుకోవాలని వారు పిలుపునిచ్చారు. కాట్రపల్లి నుండి బురహాన్ పల్లి వరకు సాగిన ఈ పాదయాత్రలో గ్రామస్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రజలు, మహిళలు కోలాట నృత్యాలతో, సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొన్నారు. కిలోమీటర్ల మేర సాగిన ఈ పాదయాత్ర “భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం, దేశాన్ని పరిరక్షించుకుందాం” అనే నినాదాలతో విజయవంతంగా ముగిసింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ, భారత రాజ్యాంగ అమలుకు 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, పార్లమెంట్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్‌ను అవమానించే విధంగా చేసిన వ్యాఖ్యలపై నిరసనగా “జై బాపు, జై భీమ్” కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించారు. రాజ్యాంగ పరిరక్షణ అనేది ఒక ప్రత్యేక వ్యక్తి లేదా పార్టీకి చెందినదికాదు, ఇది దేశంలోని ప్రతి పౌరుడి బాధ్యత అని స్పష్టంగా చెప్పారు. రాజ్యాంగాన్ని గౌరవించకుండా, ప్రజాస్వామ్య విలువలను అపహాస్యం చేసే విధంగా వ్యవహరించడం అన్యాయం అని పేర్కొన్నారు. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యుత్తమమైన రాజ్యాంగాల్లో ఒకటని, దేశాన్ని ఏకతాటిపై ఉంచే గొప్ప శక్తిగా నిలుస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా చేతిలో మహాత్మా గాంధీ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటాలు పట్టుకుని ప్రజలు పాల్గొనడం గర్వించదగిన విషయమని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేయాలని ఎమ్మెల్యే సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయాన్ని సాధించేందుకు, రాజ్యాంగ పరిరక్షణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగ పరిరక్షణకు అన్ని వర్గాల ప్రజలు ముందుకు రావాలని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పిలుపునిచ్చారు. రాజ్యాంగ విలువలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, దేశ ప్రజలు రాజ్యాంగాన్ని గౌరవించి, దానిని పరిరక్షించే బాధ్యత తీసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, బ్లాక్ మండల నాయకులు, స్థానిక ప్రజలు, వివిధ గ్రామ శాఖ అధ్యక్షులు, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

