
ఇనబడతాందా? ఎవలకన్న మనం ఫోన్ చేసినా, ఎవలన్న మనకు ఫోన్ చేసినా, ఏం చేత్తం? ముచ్చట్లు పెడతం. వాటిల్ల ఎవ్వలు యినకూడనియి గూడుంటయి. సాటు, మాటుయి గూడా ఉంటయి. మరి గా ముచ్చట్లను మనం గాక ఇంకెవలో యింటె ఎట్లుంటది? ఏమైతది? ఆగం గావచ్చు. రోగం తిరగొచ్చు. గదే మరి, ఫోన్లల్ల మన ముచ్చట్లన్నింటినీ గా గూగుల్ డాట్ కాం అనే వెబ్ సైటు గప్ చుప్ గా యింటాందట! ఇని ఊకుంటే బాగనే ఉండు. యిన్నదిన్నట్లు రికార్డు గూడ చేస్తాందట!! ఇగ గీ సంగతి తెలిసి, పోన్లు వాడేటొల్లు గోల్ గోల్ అయితాండ్రట. ఆల్ల పానం ఆగమాగమైతాందట. సాటు పోటు ముచ్చట్లోల్లయితే, ఇగ గీ పోను పాడుగానని బేజారైపోతుండ్రట. యింట్ల ఈలుగాక బయటకుపోతే, సాటుగ మాటేసి ఫోటోలు తీసే ఛీఛీ..గదే… సీసీ కెమెరాలాయె. ఏదో మాట్లాడుకుందామంటే, గీ యియనుడేంది? అది ఇని ఊకోక, ఉన్నదున్నట్లు రాసి, దాసి పెట్టుడేంది? దీనమ్మ జీవితం. గుట్టు లేనిది గట్టు దాటినట్లాయె. అయితే, గీ గూగుల్ గుట్టును కనిపెట్టిన పోన్ల కంపినోల్లు ఓ అల్కటి కిటుకు కనిపెట్టే ఉంచిండ్రు. గది తెలవకనే మనం ఆగమాగమైతానమట. గదేందో తెలుసా మరి?
మీ ఫోన్లల్ల గా అంతర్జాలాన్ని ఆన్ చేయాలె. గూగుల్ క్రోమ్ ను తెరవాలె. హిస్ట్రీ మీద ఒత్తాలె. myactivity.google.com అని ఒకటి వత్తది. దాన్ని ఒత్తాలె. మూడు యెంపికలు వస్తయి. అండ్ల మొట్ట మొదలే web&app activity అని కనబడతది. అది గనక ఆన్ అయి ఉంటే ఆఫ్ చేయాలె. గంతే! లేదంటే గూగుల్ క్రోమ్ ను తెరిచి, my activity అని కొడితే, web&app activity అని వస్తది. దాని మీద ఒత్తి ఆఫ్ చేయాలె. ఇగ మీ ఫోన్లల్ల ఎట్లున్నదో చూసుకోండ్రి మరి.

