కేసీఆర్ గురించి తెలుసుకోవడానికి 9 ఏళ్లు పడితే , రేవంత్ రెడ్డి నిజస్వరూపం ఒక్క ఏడాదిలేనే బయటపడిందని జాతీయ బీజేపీ కార్యవర్గ సభ్యులు, మల్కాజ్ గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. మెదక్ జిల్లా, గజ్వేల్ లో ఏర్పాటు చేసిన పట్టభద్ర, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ…. ఈ ఉమ్మడి మెదక్ జిల్లా గడ్డ మీద మాకు తిరుగులేదు అని ప్రగల్భాలు పలికిన కేసిఆర్ పార్టీనే ఎంపీ ఎన్నికల్లో ప్రజలు మట్టికరిపించారన్నారు. తప్పులు చేస్తే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఊరుకోరన్నారు. 317 జీఓ తో టీచర్లను బిఆరెస్ పార్టీ హింసపెడితే అండగా నిలబడ్డ పార్టీ బీజేపీ పార్టీనేనని, ఆ విషయం ఉపాధ్యాయ లోకం గుర్తుంచుకోవాలన్నారు. ఆరు గ్యారంటీలని హామీలను ఇచ్చి ఏమి చేయకుండా కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందన్నారు. అలాగే నిరుద్యోగ సమస్య తీర్చేందుకు నాలుగు లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టిన కమిట్మెంట్ ఉన్న పార్టీ బీజేపీయేనని అన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలను ప్రజలు నమ్మడం లేదన్నారు. ఒక్క బీజేపీని మాత్రమే ప్రజలు నమ్ముతున్నారని చెప్పారు. ఈ సందర్భంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి, టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్యలకు మద్దతు ఇవ్వాలని మెదక్ జిల్లా పట్టభద్రులను, ఉపాధ్యాయులకు ఈటెల విజ్ఞప్తి చేశారు. బిసిల కుల గణన గురించి మాట్లాడుతూ…. ఎప్పుడు బీసీలకు న్యాయం చేయని బిఆర్ఎస్ పార్టీకి బీసీ అనే మాట ఎత్తే అర్హత, నైతికత లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ అంటేనే ఒక కుటుంబ పార్టీగా ప్రజల్లో చైతన్యం వచ్చిందని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు.

