మద్దతు కోరిన మిడిదొడ్డి శ్యాంసుందర్
రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ప్రక్షాళన, మార్పు కోసం రాబోయే రాష్ట్ర అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న తనకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ విద్య కమిటీ చైర్మన్ మిడిదొడ్డి శ్యాంసుందర్ కోరారు. బుధవారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించిన ఆయన ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు ఇటుకూరి వీరయ్యతో పాటు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులను కలిసి మద్దతు కోరారు. దీనికి ప్రతిస్పందనగా, నాయకులు, కౌన్సిల్ సభ్యులు తమ సంపూర్ణ మద్దతును ప్రకటిస్తూ, రాష్ట్ర మహాసభలో త్వరగా ఎన్నికలు నిర్వహించాలని, బైలాను కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. రాష్ట్ర మహాసభలో మెరుగైన పరిపాలన కోసం మార్పు అవసరమన్నారు.
ఈ సందర్భంగా మిడిదొడ్డి శ్యాంసుందర్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని ఆర్యవైశ్యుల సమస్యల పరిష్కారం, మెరుగైన ఆరోగ్య, విద్యా అవకాశాల కోసం తన ప్రధాన లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు. మహాసభ అధ్యక్షునిగా పోటీ చేయడంలో తన ఉద్దేశం సమాజ సేవేనని, ఆర్యవైశ్య సమాజానికి శ్రేయస్సు తేవడమే ధ్యేయమని చెప్పారు. మహాసభలో బాధ్యతాయుతమైన నాయకత్వం అందించేందుకు అందరి మద్దతు అవసరమని, సమాజంలోని ప్రతి ఒక్కరి అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
నారాయణ పేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, గద్వాల జిల్లాల్లో జరిగిన ఆర్యవైశ్య మహాసభ సమావేశాల్లో అక్కడి స్థానిక ఆర్యవైశ్య నాయకులు, కుల బంధువులు తదితరులు పాల్గొన్నారు.

