షాపింగ్ మాల్ యజమానిని అరెస్ట్ చేయాలని డిమాండ్
చారిత్రాత్మక అజం జాహీ మిల్లు కార్మిక భవన స్థలాన్ని ఆక్రమించిన షాపింగ్ మాల్ యజమానిని, అతడికి రిజిస్ట్రేషన్ చేసిన వ్యక్తిని, ఈ కబ్జాకు సహకరించిన కార్మిక సంఘ నేతను వెంటనే అరెస్ట్ చేసి, అదే స్థలంలో కొత్తగా భవనాన్ని నిర్మించాలని, 2021లోసుప్రీం కోర్టు తీర్పుననుసరించి, మిల్లు భూమిలోనే మిల్లు కార్మికులకు ఇంటి స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో వరంగల్ చౌరస్తాలో మంగళవారం ధర్నా నిర్వహించారు. కబ్జాదారులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఆయా సంఘాల నాయకులు మాట్లాడుతూ, మిల్లు కార్మిక భవన స్థలం మిల్లు కార్మికులు కొనుగోలు చేసిందేనని, అది వారికే చెందుతుందన్నారు. తప్పుడు దస్తావేజులతో తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నంత మాత్రానా స్థలాలు కబ్జాదారుల పరం కాబోవన్నారు. ఆ స్థలంలో నూతన కార్మిక భవనాన్ని నిర్మించే వరకు ఉద్యమాలు చేస్తూనే ఉంటామని హెచ్చరించారు. ఈ ధర్నాకు అజం జాహీ మిల్స్ మాడిఫైడ్ వాలంటకీ రిటైర్డ్ 2002 వర్కర్స్ అసోసియేషన్, మిల్లు కార్మికులు, కార్మిక కుటుంబాల సభ్యులు, మిల్లు కార్మిక భవనస్థల పరిరక్షణ సమితి, అజం జాహీ మిల్స్ వర్కర్స్ యూనియన్, విఆర్ఎస్ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్లతోపాటు పలు కార్మిక సంఘాలు, కార్మికులు పాల్గొన్నారు.

