తెలంగాణలో కార్మికుల శ్రేయస్సు కోసం సీఎం కేసీఆర్ చేసిన కృషిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసించారు. తాజాగా తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించిన కేటీఆర్, కార్మికుల సంక్షేమం కోసం కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన చర్యలను వివరించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, కరోనా సమయంలో వలస కార్మికులను కూడా కేసీఆర్ ప్రభుత్వం ఆదుకున్నదని గుర్తుచేశారు. గతంలో కేంద్ర కార్మికశాఖను నిర్వహించిన అనుభవం కేసీఆర్‌కు ఉందని, కార్మికుల సమస్యలను అర్థం చేసుకునే నాయకుడిగా ఆయన నిలిచారని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ కార్మికుల జీతాలు మూడు సార్లు పెరిగాయని, అంగన్‌వాడీ టీచర్ల జీతాన్ని ₹13,500కు పెంచిన ఘనత కూడా బీఆర్ఎస్ ప్రభుత్వానిదని చెప్పారు. అలాగే ఆశా వర్కర్ల జీతాలు పెంచి, వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడించారు.
కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, వారు ఆశా వర్కర్లపై లాఠీచార్జ్ చేయించారని మండిపడ్డారు. అంతేగాక, ప్రస్తుత కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు పరిస్థితి లేనిదని, ఆర్పీలకు ఎనిమిది నెలలుగా జీతాలు రాలేదని తెలిపారు.బీఆర్ఎస్ పార్టీ కార్మికుల అండగా ఎల్లప్పుడూ ఉంటుందని కేటీఆర్ హామీ ఇచ్చారు.

