ఫార్ములా ఈ రేస్, ఔటర్ రింగ్ రోడ్డు లీజు విషయంలో ఎటువంటి తప్పు జరగలేదు
అసెంబ్లీలో మీడియాతో చిట్ చాట్ లో కేటీఆర్
తెలంగాణ శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో ఫార్ములా ఈ రేస్, ఔటర్ రింగ్ రోడ్డు (ఒఆర్‌ఆర్) లీజు అంశాలపై చర్చ తీవ్ర ఉత్కంఠ రేపుతున్నది. ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) చేసిన వ్యాఖ్యలు, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్నాయి.
అసెంబ్లీలో మీడియాతో చిట్ చాట్ చేసిన మాజీ మంత్రి, BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడుతూ….. ఫార్ములా ఈ రేస్‌లో ఎలాంటి అవినీతి జరగలేదని స్పష్టం చేశారు. హెచ్‌ఎండీఏ చట్టం ప్రకారం హైదరాబాద్ నగరాభివృద్ధి కోసం ఎటువంటి కార్యక్రమానికైనా ఖర్చు చేయవచ్చని పేర్కొన్నారు. ప్రతి పనికి ప్రభుత్వ అనుమతులు అవసరం లేకుండా స్వతంత్రంగా పనిచేయడం హెచ్‌ఎండీఏ ప్రత్యేకత అని తెలిపారు. అలాగే ప్రభుత్వం విచారణ చేయాలని ముందుకు వస్తే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఈ కేసులో ఏ ఒక్క పైసా అవినీతి జరగలేదని న్యాయ పరంగా ఎప్పుడైనా తేలుస్తామన్నారు. అలాగే ఔటర్ రింగ్ రోడ్డు లీజుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై కేటీఆర్ గట్టిగా స్పందించారు. టోటల్ ఆపరేషన్ ట్రాన్స్‌ఫర్ (టీఓటీ) విధానం భారతదేశంలోని ప్రధాన రహదారుల్లోనూ అమలులో ఉందని, ఔటర్ రింగ్ రోడ్డు నుంచి పొందిన నిధులను రైతు రుణమాఫీ వంటి కార్యక్రమాలకు వినియోగించామని చెప్పారు. “ఔటర్ రింగ్ రోడ్డు లీజు ద్వారా ఒక కంపెనీకి లబ్ధి చేకూరిందని రేవంత్ చెబుతున్నారు. అయితే, లీజును రద్దు చేయడానికి ఎందుకు ప్రయత్నం చేయడం లేదో” చెప్పాలి అన్నారు. గతంలో రేవంత్ రెడ్డి చేసిన అవినీతి ఆరోపణలపై హెచ్‌ఎండీఏ పరువు నష్టం కేసు కూడా వేసిన సంగతి గుర్తు చేశారు. ఒఆర్‌ఆర్ లీజు విచారణకు సంబంధించిన సిట్ ఏర్పాటు పై కూడా కేటీఆర్ విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి మున్సిపల్ శాఖ, హోంశాఖ మంత్రిగా ఉన్న సందర్భంలో తమ అధికారులతో సిట్ విచారణ చేయడం ఎంతవరకు నిజాలను వెలుగులోకి తీసుకొస్తుందో చెప్పాలని కోరారు. “ఒఆర్‌ఆర్ లీజు సంబంధిత విచారణను సిట్టింగ్ జడ్జి లేదా రిటైర్డ్ జడ్జితో నిష్పాక్షికంగా జరపాలి,” అని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో అధికార పార్టీ ఎంఎల్ఏలు స్పీకర్ గౌరవానికి భంగం కలిగేలా వ్యవహరించడం దారుణమన్నారు.

