Shock|షాక్ ఇచ్చిన హైకోర్టు|High Court
BC Reservations|బీసీ రిజర్వేషన్లపై వివాదం,
STATE|రాష్ట్రవ్యాప్తంగా Protest|ఆందోళనలు తీవ్రం
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రవ్యాప్తంగా జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలను హైకోర్టు నిలిపివేసింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 9పై స్టే విధిస్తూ, నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పుతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేగింది.
జీవో నంబర్ 9 ద్వారా ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించింది. అయితే ఈ జీవో చట్టబద్ధతను సవాల్ చేస్తూ పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించడంతో, కోర్టు ఎన్నికల ప్రక్రియపై తాత్కాలిక ఆంక్షలు విధించింది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది.
విచారణ సందర్భంగా అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి బీసీల జనాభాపై ప్రభుత్వ వైఖరిని సమర్థించారు. సర్వే ప్రకారం తెలంగాణలో 57.6 శాతం బీసీ జనాభా ఉన్నట్లు తేలింది. ఈ సంఖ్యపై ఎవరూ అభ్యంతరం తెలపలేదు. పిటిషనర్లు ప్రభుత్వ రిపోర్ట్‌ను కోరడం అవసరం లేదు. బిల్లుపై ఏ పార్టీ కూడా వ్యతిరేకత వ్యక్తం చేయలేదు. గవర్నర్ గడువులోగా ఆమోదించకపోయినా, చట్టం ఆటోమేటిక్‌గా అమలులోకి వస్తుంది. తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ప్రత్యేక నోటిఫికేషన్ అవసరం లేదని ఆయన వాదించారు.
అదే సమయంలో ఏజీ సుదర్శన్‌రెడ్డి మరో అంశాన్ని స్పష్టం చేశారు. విద్య, ఉద్యోగ రిజర్వేషన్లు వేరు. రాజకీయ రిజర్వేషన్లు వేరు. ఇందిరా సహాని కేసు విద్య, ఉద్యోగ రిజర్వేషన్లకు మాత్రమే వర్తిస్తుంది. మేము రాజకీయ రిజర్వేషన్ల కోసమే జీవో తెచ్చాం. కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ విధానాన్ని అనుసరిస్తూ కుల వివరాలను జనగణనలో చేర్చేందుకు సిద్ధమవుతోంది అని ఆయన అన్నారు. అయితే హైకోర్టు ఈ వాదనలను పరిశీలించిన తరువాత నాలుగు వారాల పాటు విచారణను వాయిదా వేసింది.
ఈ తీర్పుతో బీసీ వర్గాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తొందరపాటు చర్యల వల్లే బీసీలకు అన్యాయం జరిగింది. బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. బీసీలకు పదవులు వస్తే ఓర్చుకోలేకపోతున్నారు. బీసీల నోటి కాడ ముద్దను లాక్కున్నారు అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన హెచ్చరిస్తూ ప్రభుత్వ స్పందన బట్టి తెలంగాణ బంద్‌కు పిలుపునిస్తాం అని ప్రకటించారు.
ఇక హైకోర్టు తీర్పుపై తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఘాటుగా స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బలహీనమైన జీవో ద్వారా బీసీలను మోసం చేశాడు. బీసీల హక్కులను చాటుకునే బదులు, రాజకీయ లాభాల కోసం జీవోను ఉపయోగించారు అని ఆయన ఆరోపించారు. తీన్మార్ మల్లన్న రేపు రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చారు. రేపు తెలంగాణ వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేయాలని పార్టీ కార్యకర్తలను ఆయన ఆదేశించారు. బీసీలను వంచించిన ఈ ప్రభుత్వాన్ని ప్రజలు క్షమించరు. ఈ బంద్ బీసీల స్వాభిమాన పోరాటానికి నాంది అవుతుంది అని మల్లన్న పేర్కొన్నారు.
ప్రస్తుతం హైకోర్టు తీర్పుతో రాష్ట్ర రాజకీయ వాతావరణం వేడెక్కింది. బీసీ సంఘాలు, తెలంగాణ రాజ్యాధికార పార్టీ, ప్రతిపక్షాలు ఈ నిర్ణయంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు మాత్రం ఈ విషయంపై మౌనం పాటిస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ ఆగిపోవడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయదలచుకున్న అభ్యర్థులు అయోమయంలో పడ్డారు.
రాబోయే రోజుల్లో హైకోర్టు విచారణలో ప్రభుత్వం తన వాదనలను సమగ్రంగా సమర్పించనుంది. ఈ నాలుగు వారాల్లో బీసీ రిజర్వేషన్ల చట్టబద్ధత, జీవో 9 అమలు, గవర్నర్ ఆమోదం, మరియు సుప్రీంకోర్టు తీర్పుల ఆధారంగా హైకోర్టు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే, రాష్ట్రవ్యాప్తంగా బీసీ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలకు సిద్ధమవుతున్నాయి. పలు జిల్లాల్లో ఇప్పటికే బంద్ పిలుపుకు మద్దతు తెలిపిన సంఘాలు ఉన్నాయి. ఈ పరిణామాలు తెలంగాణలో రాజకీయ చర్చలకు కొత్త ఊపును తెచ్చాయి.
హైకోర్టు తీర్పు వల్ల బీసీ రిజర్వేషన్ల భవిష్యత్తు మరియు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ రెండూ అనిశ్చితిలో పడ్డాయి. ఈ నేపధ్యంలో ప్రభుత్వం చట్టపరంగా తన వైఖరిని సమర్థించగలదా లేదా అనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన ప్రశ్నగా మారింది.

