అడుగు EXCLUSIVE
‘వెలుగు’లోకి కార్మిక భవన కబ్జా ‘చీకటి’ కోణాలు!
దురాక్రమణ దందాను బహిర్గతం చేసిన దస్తావేజులు
బయటపడ్డ కార్మిక సంఘ నాయకుల దుర్మార్గాలు
అడుగు చేతిలో అనూహ్యమైన ఆధారాలు
అక్రమార్కుల పై కేసులు ఖాయం
త్వరలోనే కార్మిక భవనానికి శంకుస్థాపన
ఆశావహ దృక్పథంలో కార్మికులు
“అడుగు” ఎక్స్లూజివ్ ఇన్వెస్టిగేటివ్ కథనం
గ ‘ లీజు’ గుట్టు రట్టయింది. లేని లీజు ను సృష్టించి, కార్మికుల నమ్మకాన్ని వమ్ము చేసి, కార్మిక భవన స్థలాన్ని తెగనమ్మిన కార్మిక సంఘ నేత మోసాలను కార్మికులే ‘ ఇప్ప ‘ నున్నారు. తప్పుల తడకగా దస్తావేజులు, వారసులే కాని కొడుకులు, ఆ కొడుకులకు సహకరించిన నేతలు, నేతల అడుగులకు మడుగులొత్తిన అధికారులు, అక్రమ అనుమతులు… కలగలిసి మొత్తం దురాక్రమణ బాగోతం వెలుగు చూసింది. దస్తావేజుల ఆధారాల వెలుగులో ఆజం జాహి మిల్లు కార్మిక భవన స్థల కబ్జా చీకటి కోణాలు వెలుగు చూశాయి. ఇందుకు సంబంధించిన అనేక ఆధారాలను “అడుగు” దొరకబట్టింది. ఇది “అడుగు” అందిస్తున్న ఎక్స్లూజివ్ కథనం.

తప్పుడు పత్రాలతో వరంగల్ అజం జాహి కార్మిక భవన్ కబ్జాకు యత్నించిన వారి గుట్టు ‘విప్ప’ నున్నారా?.. కబ్జా దారులకు సహకరించిన కార్మిక నాయకుల దుర్మార్గాలను ఎండగట్టనున్నారా? అంటే… ప్రస్తుతం అజంజాహి కార్మిక కుటుంబ సభ్యులు, విశ్రాంత కార్మికులు చేస్తున్న ప్రయత్నాలు అవుననే రుజువు చేస్తున్నాయి. కబ్జాకు తొలి కార్మిక భవన్ లీజు పేరుతో చేసిన తప్పుడు ప్రయత్నం అందుకు సహకరించిన గత కార్మిక నాయకులు చేసిన తప్పిదాలు ఒక్కొక్కటిగా చీకటి కోణాలు వెలుగుచూస్తున్నాయి. ఈ గ’లీజు’ గుట్టు ‘విప్ప’ డానికి కార్మిక కుటుంబాలు సమాచార హక్కు చట్టాన్ని ప్రయోగించారు. తద్వారా అధికారికంగా సంబంధిత ప్రభుత్వ కార్యాలయాల నుంచి దస్తావేజులను సేకరించారు. రెవిన్యూ, మున్సిపల్ అధికారులు ఇచ్చిన రికార్డులను చూస్తే విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. వాటిలోంచి కొన్నింటిని ‘అడుగు’ సేకరించింది. వాటి గుట్టుమట్లను ఒకసారి పరిశీలిద్దాం.
స్వచ్ఛంద పదవీ విరమణ కార్మికుల మంటూ అదే పేరుతో ఓ సంఘాన్ని స్థాపించి అధ్యక్ష, కార్యదర్శులుగా పదవులు వెలగబెట్టిన ఓ ఇద్దరు స్వార్థపరుల కాసుల కక్కుర్తి, దుర్మార్గపు చర్యలు, అవినీతి కారణంగానే మిల్లు కార్మిక భవనం కబ్జాకు గురైంది. ప్రస్తుతం కనుమరుగయ్యే దశకు చేరుకుంది. లేని లీజు డ్రామాను తెర మీదకి తెచ్చి బ్రహ్మాండంగా పండించారు. దీనికి కావాల్సిన ఇం ‘ధనాన్ని’ ఓ బడా వ్యాపారి సమకూర్చాడు. ఇందుకు ఓ మాజీ ఎమ్మెల్యే కొడుకు కాని కొడుకు వారసుని పేరుతో తెరమీదకు తన్నుకు వచ్చాడు. అతడికి అప్పటి ఎమ్మెల్యే సహకరించాడు. ప్రజల హక్కుల ముసుగులో పని చేసే ఓ న్యాయవాది అన్యాయమైన అద్భుత స్ర్కీన్ ప్లే, డైరెక్షన్ లో ఇదంతా నడిచింది. అంతే, ఆ భూమికి లేని కాగితాలు రెక్కలు కట్టుకుని పుట్టుకొచ్చాయి. తిలాపాపం తలా పిడెకెడు లాగా అంతా కలిసి 80 ఏండ్ల చరిత్ర కలిగిన కార్మిక భవన స్థలానికి లేని పర్మీషన్లు కూడా వచ్చేశాయి. వరంగల్ మహా నగర పాలక సంస్థ అక్కడ బహుళ అంతస్తుల భవన నిర్మాణానికి అనుమతులు ఇచ్చేసింది. స్వాతంత్ర్యానికి ముందే 10వేల మంది కార్మికులకు ఉపాధినిచ్చిన అజం జాహీ మిల్లు ఆఖరి ఆనవాలు అడ్రస్ లేకుండా పోయే పరిస్థితి ఏర్పడింది. కార్మికులు, వారి కుటుంబాలు, వారసులు మేలుకున్నారు. సంఘాలు సంఘాలు, పార్టీలు కలిసి ఉద్యమిస్తున్నారు.
అవినీతికి తెర లేపరిలా…

తేదీ 25-12-2015 న అప్పటికి అజం జాహి మిల్లు విశ్రాంత కార్మిక సంఘం అధ్యక్ష్య, కార్యదర్శులుగా ఉన్న కొమ్ము రవి, ఇప్ప ఆది నారాయణ లు అప్పటి వరంగల్ తహశీల్దార్ సమక్షంలో పంచనామా రాసిచ్చారు. సుల్తానాబాద్ కు చెందిన గొట్టిముక్కల రాజిరెడ్డి కి లక్ష్మీపురంలో సర్వే నెంబర్ 90/1 లో 9 గంటల భూమి ఉంది. అట్టి భూమిని అజం జాహి మిల్లు వర్కర్స్ యూనియన్ కొరకు గజ్జల రాధాకృష్ణకు 1957 నుంచి 1965 వరకు ఎనిమిదేళ్లపాటు లీజుకి ఇచ్చారు. అప్పటి అడ్వకేట్ బండారు చంద్రమౌళీశ్వర రావు సమక్షంలో జరిగిన ఒప్పంద డాక్యుమెంట్లన్నీ నిజమేనని నమ్మి, రాజిరెడ్డి కుమారుడైన నరేష్ రెడ్డి కి అప్పగించడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవని సంతకాలు చేసి ధారాదత్తం చేసేశారు.
తప్పుల తడకగా దస్తావేజులు
సేకరించిన దస్తావేజుల్లో మరికొన్ని నిజాలు బయటపడ్డాయి. కబ్జా చేసిన వ్యక్తి కార్మిక భవనం లీజుకు ఇచ్చామంటూ సృష్టించిన అప్పటి ఆ పత్రాల్లో అలవాట్లో పొరపాటు లాగా తప్పులో కాలేశారు. ఐదు దశాబ్దాల క్రితం లీజుకు ఇచ్చినట్టు సృష్టించిన ఆ తప్పుడు దస్తావేజుల్లో వరంగల్ లక్ష్మీపురం అజంజాహీ మిల్లు స్థలంలో ఉన్న కార్మిక భవనాన్ని హనుమకొండ మండలం అంటూ తప్పుగా రాసుకున్నారు. ఐదు దశాబ్దాల క్రితం వరంగల్ జిల్లాలో మండలాలే లేవు. అప్పుడు మండల వ్యవస్థ లేనే లేదు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక మండలాలను ఏర్పాటు చేసిన విషయం మరిచిపోయిన కబ్జాదారులు తప్పులో కాలేసి తప్పుడు పత్రాలు రాసుకున్నారు. మరో పొరపాటు కబ్జా చేసే పత్రాలలో జరిగింది. తాము కొనుగోలు చేశామని చెప్తున్న వ్యక్తి పేరున 9 గుంటల స్థలం ఉంటే 12 గుంటల స్థలం ఉన్నట్టు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అది మరో తప్పిదం.. నిజాయితీగా ఉండేవాడు నిర్భయంగా పనిచేస్తాడు. తప్పు చేసేవాడు భయం భయంగా పనిచేస్తాడు. కార్మిక భవన కబ్జాకు యత్నించిన సమయంలోనూ కబ్జాదారులు భయం భయంగా చేసిన తప్పుడు పనులు రాసిన తప్పుడు రాతలు వెలుగులోకి వచ్చాయి. తను మాజీ ప్రజాప్రతినిధికి వారసుండంటూ సృష్టించిన తప్పులు సహా అనేక లోటుపాట్లు ఆ దస్తావేజుల్లో ఉన్నాయి. ఇలా ఒక్కటి కాదు రెండు కాదు అనేక తప్పులు చేసి కబ్జా చేసిన పత్రాలు తప్పుల తడకలాగా ఉన్నాయి.
కార్మిక కుటుంబాల పోరాటం

వరంగల్ అజం జాహి కార్మిక భవన పరిరక్షణ కోసం అఖిలపక్షం ఏర్పాటు చేసి ముందుకు సాగుతున్నారు కార్మిక కుటుంబాలు. మరో వైపు ఆందోళన, న్యాయపోరాటం చేస్తున్నారు. అజం జాహి మిల్లుతో అనుబంధం ఉన్న రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు, విశ్రాంత ఉద్యోగులను కలిసి వాస్తవ పరిస్థితులు, నిజా నిజాలను వెలుగులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మిల్లుతో అనుబంధం ఉన్నవారిని కలుస్తూ వారి అనుభవాలను వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు యత్నిస్తున్నారు. అలా సేకరించిన పలు విషయాలు ‘మా నాన్న అజంజాహి కార్మికుడు’ సొసైటీ పేరుతో ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూప్ లో పొందు పరుస్తూ వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళుతున్నారు.
కార్మిక నాయకుల పై కేసు?
తాము అజంజాహి కార్మిక సంఘం నాయకులం అంటూ కబ్జాదారుడికి సహకరించిన సదరు వ్యక్తిపై ఇప్పటికే కార్మిక కుటుంబాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో వారిపై చర్యలు తీసుకునేందుకు పోలీస్ అధికారులు సిద్ధమవుతున్నారు. తప్పుడు దస్తావేజులతో కార్మిక భవన కబ్జాకు సహకరించిన వారి గుట్టు రట్టవడంతో ఏ క్షణానైనా వారిపై కేసు నమోదు చేసే అవకాశం ఉంది. శ్రీకృష్ణ జన్మస్థానంలో ఊచలు లెక్కపెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కబ్జాకు సహకరించిన ఒక కార్మిక నాయకుడు కాలం చేయగా, మిగిలిన నేత పై కార్మికులు కారాలు, మిరియాలు నూరుతున్నారు. ఇప్పటికే అతడిని పోలీసు స్టేషన్ కు తీసుకెళ్లి విచారించారు.
అయితే, మరికొద్ది రోజుల్లో కబ్జాకు గురైన కార్మిక భవన కథ సుఖాంతం అవుతుందా? ఈ సాక్ష్యాధారాలు వారిని చట్టానికి పట్టిస్తాయా? ఇందుకు సంబంధిత అధికారులు, నేతలు సహకరిస్తారా? ఇంత జరిగిన తర్వాత కూడా ప్రభుత్వ పెద్దలు మొండి కేసి విలన్లు గా మిగులుతారా? లేక హీరోలుగా నిలుస్తారా? అన్నది వేచి చూడాలి.
కాగా, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నూతన కార్మిక భవన నిర్మాణానికి పునాదులు పడతాయన్న ఆశావహ దృక్పథంలో కార్మికులు ఉన్నారు.

