దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం కీలక పెట్టుబడిని రాబట్టింది. జేఎస్ డబ్ల్యూ డిఫెన్స్ అనుబంధ సంస్థ అయిన జేఎస్ డబ్ల్యూ యూఏవీ లిమిటెడ్ తెలంగాణలో మానవ రహిత ఏరియల్ సిస్టమ్స్ (డ్రోన్లు) తయారీ యూనిట్ స్థాపించనున్నట్లు ప్రకటించింది. ఈ యూనిట్ దాదాపు రూ.800 కోట్ల పెట్టుబడులతో స్థాపించబడనుండగా, అమెరికా ఆధారిత డిఫెన్స్ టెక్నాలజీ సంస్థ అనుబంధంతో రూపొందించనుంది.
ఈ ప్రాజెక్టుతో రాష్ట్ర ప్రభుత్వం దావోస్ వేదికగా జేఎస్ డబ్ల్యూ యూఏవీ లిమిటెడ్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దీని ద్వారా 200 మందికి పైగా ఉద్యోగాలు లభించనున్నాయి. అత్యాధునిక రక్షణ టెక్నాలజీతో పాటు తెలంగాణ అభివృద్ధిలో ఇది కీలకంగా మారనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఈ ఒప్పందంతో డ్రోన్ టెక్నాలజీకి తెలంగాణ ప్రధాన కేంద్రంగా మారుతుందని తెలిపారు. మంత్రి శ్రీధర్ బాబు ఈ ప్రాజెక్టు రక్షణ రంగంలో సరికొత్త ట్రెండ్ సృష్టిస్తుందని అభిప్రాయపడ్డారు.

