రాను రాను పెండ్లిల్లు కట్టమైతానయి. పిల్లలు దొరుకతలేరు. వయసై పోతాంటే ఎవ్వలూ పిల్లనిత్తలేరు. ఇగ జీవితంల ఓ దారికొచ్చినంక పెండ్లి శేసుకుంటే, ఉట్టుట్టిగనే పెటాకులైతానయి. ఇగ ఆలుమగల మద్దెల ఆశలు, కోరికలు బాగా పెరిగినయి. భావోద్వేగాలను దాసుకుంటలేరు. ఎట్ల పడితే గట్ల ఎవలికి నచ్చినట్లు వాల్లు బతుకుతాండ్లు. గీ ఆగమాగంలనే పెండ్లిల్ల పేరయ్యలు, మ్యారేజీ బ్యూరోలను పట్టుకుంటే యేలకు యేలు దొబ్బుతాండ్లు. ఇగ గిదంత పని కాదని ఒకాయినె సొంతంగా కంప్యూటర్ల కావాల్సిన ముచ్చట్లు రాపిచ్చిండు. గదాన్ని నకలు తీసిండు. గవాటిని చాయ దుకాన్ల కాడ అతికిచ్చిండు.

గండ్ల పెండ్లికి అర్హతలు రాసి పెట్టిండు. మొదటి పెండ్లి లేదా రెండో పెండ్లి అయినా, విడాకులు తీసుకున్నా, వితంతువైనా పరవా లేదట. ఇంకా యివరాలు కావాల్నంటే సంప్రదించమని పోన్ నెంబర్ కూడా రాసి పెట్టిండు. ఇగ గిది పెట్టినాయినె ఓ ప్రైవేట్ స్కూల్ల పీఈటీ అంటే ఆటల సారుగ పని శేత్తడట.
గీ ఇచ్చెంత్రాన్ని సూసినోల్లు ముక్కు మీద యేలేసుకుంటాండ్లు. గీ ఉపాయం మంచిగుంది కదా అనుకుంటాండ్లు.

