మహ్మద్ బిన్ తుగ్లక్ చాలా తెలివైన వాడని చరిత్ర చెబుతోంది. మధ్యయుగంలో ప్రగాఢముద్రవేయగలిగిన వ్యక్తిత్వాన్ని కలిగి వున్నాడు. దూరదృష్టి, ఆలోచనాపరుడు, రాబోయే యుగాలు, తరాల గూర్చి ఆలోచించగలిగే శక్తినీ గలిగినవాడు. అని ప్రతీతి. అప్పట్లోనే బంగారు నాణాలకు బదులు రాగి, వెండి నాణాలను ప్రవేశ పెట్టాడు. కరువు కాటకాల సమయంలో ప్రజల ముక్కుపిండి మరీ పన్నులు వసూలు చేసిన తుగ్లక్, చివరకు జుట్టు పన్ను కూడా విధించాడని చెబుతారు. రాజ్య రక్షణ కోసమే ఆయన ఆనాడు అలా చేసి ఉండవచ్చు. కానీ, విచ్చలవిడి పన్నులు, పరిపాలనా పద్ధుతల వల్ల తుగ్లక్ పాలన అంటే పిచ్చి పాలన అనీ, తుగ్లక్ అంటే పిచ్చోడనే ముద్ర పడిపోయింది. ఎంత తెలివైనోడైనా, తెలివి తక్కువ పనులు చేస్తే ఆనాటి నుండే తుగ్లక్ అనడం రివాజుగా మారింది. బహుషా ఇప్పుడు మన పాలకులను తుగ్లక్ పూనాడేమో తెలియదు కానీ, తుగ్లక్ ను మించిన పద్ధుతలను అవలంబిస్తున్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ పన్నులు తుగ్లక్ పరిపాలనకు అత్యంత దగ్గరగానే కాదు సేమ్ టు సేమ్ అనిపిస్తుంది. షేమ్ టు షేమ్ కూడా అనుకోవచ్చు.
తుగ్లక్ పన్నులు… పరిపాలన!
నోట్ల రద్దు ఫలితాలు ఏ మేరకు ఫలితాలు సాధించాయో ఆనాడే ప్రజల అనుభవంలోకి వచ్చేశాయి. ఇప్పుడు జీఎస్టీ కూడా ప్రజల ముక్కుపిండి పన్నులు వసూలు చేస్తున్న ఓ విచిత్ర విధానంగా మారిపోయింది. నాడు తుగ్లక్ జుట్టు పన్ను వేస్తే, ఇప్పుడు చివరకు చెత్త పన్ను కూడా వేసేస్తున్నారు. నిత్య జీవితంలో ప్రజలు ఏది కొన్నా, నిత్యావసరంగా ఏ వస్తువును వాడినా, చివరకు ఆహారం తీసుకోవడం నుంచి విసర్జన దాకా మనిషి జీవితమంతా పన్నుల మయంగా మారిపోయింది. ఆరోగ్యం కోసం తీసుకున్న ఇన్సూరెన్స్, సేవింగ్స్ కోసం తీసుకున్న జీవితభీమాలపైనా జీఎస్టీ తప్పడం లేదు. 12 నుంచి 18శాతం ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు.
తాజా గాణాంకాల మేరకు దేశంలో ఈ ఏడాది ఒక్క జూన్‌లోనే రూ.2,591 కోట్ల నికర జీఎస్టీ వసూలైంది. 2017లో జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి జూన్ నెలకు ఇదే అత్యధికం. 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి తైమ్రాసికంలో మొత్తం వసూలైన నికర జీఎస్టీ రూ.8,860 కోట్లు. గతేడాది జూన్‌లో వచ్చిన రూ.3,910 కోట్ల పన్ను ఆదాయం కంటే ఇది 6.58 శాతం ఎక్కువ. ఈ ఏడాది జూన్‌లో ఐజీఎస్టీ సెటిల్మెంట్ రూ.1,365 కోట్లు వచ్చింది. వృత్తి పన్ను రూ.29 కోట్ల నుంచి రూ.49 కోట్లకు పెరిగింది. లిక్కర్‌పై వ్యాట్ రూ.61 కోట్ల నుంచి రూ.86 కోట్లకు, పెట్రోలియం ఉత్పత్తులపై వ్యాట్ రూ.1,380 కోట్ల నుంచి రూ.1,435 కోట్లకు పెరిగింది.
మీరు హోటల్ కి వెళ్ళి టిఫిన్ చేస్తే రూ.500 బిల్లు అయిందనుకుందాం. హోటల్ బిల్లులో ఎస్ జీఎస్టీ రూ.45, సీజీఎస్టీ రూ.45 కలిపి మొత్తం రూ.590కి బిల్లు వస్తుంది. జీఎస్టీ అంటే ఒకటే బిల్లు కదా? ఈ రెండు జీఎస్టీలేంటి? అనే అనుమానం కలుగుతుంది. కానీ, ఈ రెండు కలిపితేనే జీఎస్టీ. ఎస్జీఎస్టీ రాష్ట్రానికి, సీజీఎస్టీ కేంద్రానికి వెళుతుందన్నమాట. అంటే జీఎస్టీ లో కేంద్రం సగం, రాష్ట్రం సగం చొప్పున పంచుకుంటున్నాయి. అంటే ప్రజల నుండి వసూలు చేసే జీఎస్టీని అటు కేంద్రం, ఇటు రాష్ట్రం చెరిసగంగా పంచుకుంటున్నాయని అర్థం. అందుకే జీఎస్టీ దోపిడీని కలిసికట్టుగా కేంద్రం, రాష్ట్రాలు ఇష్టానుసారంగా చేస్తున్నాయి. కాబట్టే, కేంద్రాన్ని రాష్ట్రాలు, రాష్ట్రాలను కేంద్రం ఎప్పటికీ ప్రశ్నించవు, నిలదీయవు. పన్నలు వసూళ్ళ దందాను ఆ విధంగా దండుకునే ఏర్పాట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకున్నాయన్నమాట. ఇప్పుడు ప్రజలు ఎవరిని ఆశ్రయించాలి? సగటు మనిషిని, సామాన్యుడిని ప్రభుత్వాలే ఈ విధంగా దోపిడీ చేస్తుంటే ఎవరిని ఎవరు ప్రశ్నించాలి? మనమే ఓటు వేసి, గెలిపించుకుని, పరిపాలించడానికి అవకాశాన్ని, అధికారాన్ని అప్పగించింది ఎందుకు? ఇందుకేనా? ఇదేం దోపిడీ? ఇదేం పన్నుల విధానం? నిలదీసేదెవ్వరు?
మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యాట్ స్థానంలో జీఎస్టీ పన్ను విధానాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇది ప్రభుత్వాలకి ఆదాయం పెరగటానికి తోడ్పడింది. గత పార్లమెంట్ సమావేశాల్లో ఇన్సూరెన్స్ పై జీఎస్టీ తగ్గించాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కోరితే, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెద్దగా పట్టించుకోలేదు. నిజానికి ప్రజల సమస్యలను తెలుసుకునే బదులు ఎదురుదాడి చేశారు. అయితే ప్రస్తుతం మధ్యతరగతి భారతీయులకు అనుగుణంగా పన్ను రేట్లలో తగ్గింపును అందించ బోతున్నట్లు వెల్లడైంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం అనేక వస్తువుల ధరలను అధిక జీఎస్టీ బ్రాకెట్ నుంచి తక్కువ పన్నులకు మార్చాలని కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే ఏయే రంగాల్లో ప్రజలు బాధపడుతున్నారో గుర్తించాలి. ప్రస్తుతం మధ్య, దిగువ మధ్య తరగతి ఆదాయం కలిగిన ప్రజల కోసం జీఎస్టీ పన్నుల విషయంలో కూడా పెద్ద మార్పులకు కేంద్రం శ్రీకారం చుడుతోందని సమాచారం. 12 శాతం కింద ఉన్న అనేక వస్తువులపై పన్నును 5 శాతానికి తగ్గించనున్నట్లు తెలిసింది. నిజంగా ఇలాంటి ఆలోచన ఉంటే అనేక రంగాలపై పన్ను శాతాన్ని అత్యదికంగా 5శాతానికి తగ్గిస్తే మేలు.
ఇకపోతే పన్నుల్లో హేతుబద్దత లేకపోవడం వల్ల చిన్న, మధ్యతరగతి ప్రజలు, కంపెనీలు జీఎస్టీ కట్టుకోలేక దివాళా తీస్తున్నారు. ఉప్పులు, పప్పులపై జీఎస్టీ పడ్డాక కూడా ఇడ్లీ దోశలపై పన్నులు వాయిస్తున్నారు. మధ్యతరగతి ప్రజలు హోటల్‌కు వెళ్లి టిఫిన్ చేయలేని దుస్థితి నెలకొంది. దేశంలో నిరుద్యోగ తీవ్రత చాలా ఎక్కువగా వుంది. పని చేయగలిగిన శ్రామికుల సంఖ్య 64 శాతానికి పెరిగిందని, కేవలం 37 శాతం మందికి మాత్రమే పనులు దొరికాయని ఓ నివేదిక తెలిపింది. యువతకు ఉపాధి కల్పించడం దేశం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాల్‌గా మారింది. సాంకేతిక పరిజ్ఞానం, కృత్రిమ మేధ ప్రభావంతో నిరుద్యోగం మరింత తీవ్రం కానుంది. ఐటి సేవల రంగాలలో తక్కువ నైపుణ్యం ఉంటే చాలన్న రీతిలో సాగుతోంది. ఐటి కంపెనీలు కూడా ఉద్యోగులను ఉన్న పళంగా తీసేస్తున్నాయి. ప్రధాని మోడీ చెబుతున్నట్లుగా 2047 నాటికి దేశం సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే విద్యారంగం, వ్యవసాయరంగం కీలకమని నిపుణులు సూచిస్తున్నారు. అత్యధిక అక్షరాస్యత వున్న కేరళ తలసరి ఆదాయం దేశంలో మొదటి స్థానంలో వుంది. తర్వాత స్థానాల్లో తమిళనాడు, తెలంగాణ వున్నాయి. బీహార్ తలసరి ఆదాయం అతి తక్కువగా వుండడానికి అక్షరాస్యత కూడా ముఖ్య కారణం. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా నినాదాలను రాజకీయ ప్రచారం కోసం వాడుకుంటున్నారు. ప్రపంచీకరణ ఆర్థిక విధానాల వల్ల ప్రభుత్వ సేవలు కుదించుకుపోయాయి. ఉపాధి అవకాశాలు తగ్గిపోవడంతో పాటు పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలు ప్రజల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. పేదరికం లేని సమాజం కోసం ప్రణాళికలు అమలు చేయడమంటే ముక్కు పిండి పన్నుల వసూలు చేయడం మాత్రం కాదని గుర్తించాలి.

