ప్రభుత్వాల విధానాలేవీ రైతాంగానికి మేలు చేయడంలేదు. విత్తనాలు, ఎరువులు మొదలు… ధరల వరకు అంతా రైతాంగ దోపిడీయే తప్ప మరేమీ లేదు. ప్రక్రుతి ప్రకోపాలకి, ప్రభుత్వాల నిర్లక్ష్యానికి రైతన్న బలవుతున్నాడు. ‘జై జవాన్! జై కిసాన్!’, ‘రైతే రాజ!’ని పొగడటమే తప్ప ఆచరణలో అంతా శూన్యమే. శుష్క ప్రియాలు!, శూన్య హస్తాలు!! అన్నట్లుగానే రైతుల పరిస్థితి రోజురోజుకు దిగజారుతున్నది. వ్యవసాయాన్ని దండుగ చేసిన వారి వల్లే కాదు, పండుగ చేశామన్న వాళ్ళ వరకు అంతా ‘సాగును సావు!’చేసి పెట్టారు. అసలు పాలకులకు వ్యవసాయంపై ఓ విధానమంటూ ఏమీ లేదు. ప్రకటించిన విధానాలేవీ వ్యవ‘సాయాని’కి ‘సాగు’కు అనుకూలంగా లేవు. అత్యధిక ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవించే దేశంలో వ్యవసాయ విధానం లేకపోవడం కంటే ఆత్మహత్యాసద్రుశ్యం మరోటి ఉండదు.
పంటల పెట్టుబడులు, విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు, సాగునీరు, విద్యుత్, పంటలకు సరైన మార్కెటింగ్, ధరలు కల్పిస్తే చాలు రైతులు వారి మానాన వారు బతుకుతారు. దేశ ప్రజలకు ఇంత బతుకునిస్తారు. కానీ మన దేశంలో, రాష్ట్రంలో రైతుల జీవితాలు అత్యంత దయనీయంగా మారాయి. రైతులకు పెట్టుబడులు అందించడం, ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచడం, వారు పండించిన పంటలకు సరైన మార్కెటిగ్ ధరలు కల్పించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలం అవుతున్నాయి. విద్యుత్, సాగునీరు సరేసరి. కనీస మౌలిక వసతులు లేకుండానే రైతుల సాగుబడి కొనసాగుతున్నది. వర్షాభావ పరిస్థితుల్లో వర్షాధారమై, దైవాదీనంగా వ్యవసాయం ఉండటమే దీనాతి దీనం. ‘‘పురుగుల మందే నీకు పెరుగన్నమాయెనా!’’ వంటి పాటలు దేశ రైతుల దిశ, దెశలను అర్థం చేస్తున్నాయి.
రైతులకు సంబంధించిన కార్యకలాపమేదైనా, ప్రభుత్వాలు, పాలకులు మాటలే తప్ప క్షేత్రస్థాయిలో పథకాలు అమలు కావడం లేదు. కనీస మద్దతు ధరలు ప్రకటించినా వాటిని అమలు చేయడంలో శ్రద్ధ చూపడం లేదు. రైతులు పండించిన పంటల విషయమే తీసుకుంటే, తాలు, దడువాయిల పేరుతో దోచేస్తున్నారు. పంటలకు సకాలంలో రుణాలు అందడం లేదు. బ్యాంకులు కూడా రైతుల పట్ల కఠినంగానే ఉంటున్నాయి. దీంతో రైతులు పంటరుణాలను ప్రైవేట్ వ్యక్తుల నుంచే తెచ్చుకోవాల్సి వస్తోంది. దళారులు కొన్న తరవాతే ప్రభుత్వం, అధికారులు రంగప్రవేశం చేస్తారు. పంటల కోసం తెచ్చిన పెట్టుబడి అప్పులు తీర్చే తొందరలో ధాన్యాన్ని, పంటలను వచ్చిన రేటుకు, అంటే దళారుల రేటుకు అమ్ముకోక తప్పడం లేదు. ఇదంతా క్షేత్రస్తాయిలో అధికారులకు తెలుసు. మార్కెట్ కమిటీలు పెట్టినా, సహకారసంఘాలు ఉన్నా.. ధాన్యం చేతికొచ్చే సమయానికి తిప్పలు పడక తప్పడం లేదు. పంట ఏదైనా ఇదే దుస్థితి ఉంది. కొనుగోళ్ల విషయంలో ఆందోళనలు రాజకీయపార్టీల బలాబలాల ప్రదర్శనగా ఉందే తప్ప రైతులను ఆదుకునే విధానంలా ఉండడం లేదు. ఇందులో అన్ని పార్టీలు ఎవరికివారు తమవంతు రాజకీయ లాభం కోరే పాత్ర పోషిస్తూ రక్తి కట్టిస్తున్నారు. పాలకులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను ఎలా మోసం చేస్తారో స్పష్టంగా కనిపిస్తోంది. నిజానికి కేంద్రం తీరు కూడా ఏ మాత్రం సరిగా లేదు. ఇందులో ఎలాంటి అనుమానాలు లేవు. ధాన్యం కొనుగేళ్లే కాదు.. అనేకానేక విషయాల్లో కేంద్రాన్ని నిలదీయాల్సిందే. రైతులు తాము బతకడానికే కష్టపడుతున్నారు. మనలను బతికించడానికి వారు వ్యవసాయం చేస్తున్నారు. కేంద్రం పెట్రో, డీజిల్, గ్యాస్ ధరలతో మొత్తంగా అన్ని సరకుల ధరలు పెంచుతూ పోతున్నది. సామాన్యులు నానాయాతనలు పడుతున్నా పట్టించుకోవడం లేదు. అలాగే ధాన్యం ధరలను ఏటేటా పెంచడం లేదు. ఎవరికి వారు ధాన్యం ధరలు నిర్ణయించుకునే పరిస్థితి లేదు. నిజానికి వ్యవసాయంపై జాతీయ విధానం రావాల్సిందే. ధాన్యం కొనుగోళ్లలో పారదర్శక విధానం రావాలి. వ్యవసాయ దిగుముతలను తగ్గించుకుని.. ఎగుమతులను పెంచుకోవాలి. వంటనూనెల దిగుమతిని ఆపేయాలి. దేశీయంగా పంటలకు ప్రోత్సాహం ఇవ్వాలి. ఇవన్నీ చర్చించడానికి కేంద్రంపై ఒత్తిడి తేవాలి. అన్ని రాష్ట్రాల్లో ఏకాభిప్రాయం రావాలి. కానీ అలా జగరడం లేదు. ఎవరి రాజకీయ ప్రయోజనాలు వారు చూసుకుంటున్నారే తప్ప ప్రజలను పట్టించుకోవడం లేదు. రైతుల పట్ల ఎలాంటి వివక్ష చూపడం లేదని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, ధాన్యం కొనుగోళ్లు మాత్రం సజావుగా సాడం లేదు. ఇప్పుడు వడగళ్ల వానల కాలం. ధాన్యం కల్లాల్లోకి చేరకముందే తడిసి ముద్దవుతోంది. కల్లాల్లో కొన్నిసార్లు తడిసి కొట్టుకు పోతోంది. ఇదంతా దైవాధీనంగా రైతుల పరిస్థితి ఉంది. మార్కెట్లో పత్తి, మిర్చి, వరి తదితర పంటలు వచ్చినా.. ట్రాక్టర్లు బారులు తీరినా సక్రమంగా అమ్ముకుని ఇంటికి చేరుతామన్న ధైర్యం రైతుల్లో ఏ రోజూ కనిపించడం లేదు. పంజాబ్‌లో ధాన్యాన్ని కొనుగోలు చేసిన తరహాలోనే దేశమంతటా ఒకే విధానాన్ని అమలు చేస్తున్నామని కేంద్రం నమ్మబలికినా .. ఏటేటా మాత్రం ధాన్యం అమ్మకాల వ్వయహారం ప్రహసనంగా మారుతోంది. తెలంగాణలో డీసెంట్రలైజ్ ప్రొక్యూర్మెంట్ విధానం (డీసీపీ)లో బియ్యం సేకరిస్తున్నామని.. పంజాబ్ నుంచి నాన్ డీసీపీ విధానంలో సెంట్రల్ పూల్ ద్వారా బియ్యం సేకరించి ఇతర రాష్టాల్రకు పంపిస్తున్నామని ప్రభుత్వాలు చెబుతున్నాయి. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ నేటిదాకా ఒకే విధానం అమల్లో ఉందని కేంద్ర అధికారులు అంటున్నారు. తెలంగాణ అవసరాలకు వినియోగించుకోగా మిగిలిన బియ్యాన్ని సెంట్రల్ పూల్ కింద ఎఫ్‌సీఐకి అప్పగిస్తోందని గుర్తు చేస్తున్నారు. తెలంగాణతోపాటు దక్షిణ భారతదేశం నుంచి ఎఫ్‌సీఐ సేకరించే బాయిల్డ్ రైస్‌ను సెంట్రల్ పూల్ కింద కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు పంపిస్తామని అధికారులు చెబుతున్నారు. తెలంగాణ కూడా పశ్చిమ బెంగాల్, బీహార్‌లకు బాయిల్డ్ రైస్‌ను పంపుతుంది. తెలంగాణలో బాయిల్డ్ రైస్ వినియోగం లేనందున మొత్తం బియ్యాన్ని ఎఫ్‌సీఐకే పంపిస్తూ వస్తోంది. దేశంలో బాయిల్డ్ రైస్ బియ్యానికి డిమాండ్ లేకుండా పోయింది. అందుకే రా రైస్ మాత్రమే సేకరిస్తున్నారు.
నిజంగానే జాతీయ విధానం రావాలంటే అందుకు ప్రత్యామ్నాయంగా ఆయా రాష్ట్రాలతో చర్చించి, అందరినీ కలుపుకుని పోరాడాలి. అందుకే వరి, మిర్చి తదితర పంటల కొనుగోళ్ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏటా విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది. ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం ఒక స్పష్టమైన వైఖరి తీసుకొని.. రైతులకు భరోసా కల్పించాలి. దీనిని కడవరకు ముందుకు తీసుకుని వెళ్లాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలదే! పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు రావాలి. అసలే వడగళ్ల సీజన్లో ధాన్యం తడిసినా, చేలో నష్టపోయినా తక్షణం పరిహారం అందాలి. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వారితోనే చర్చించాలి. వారే తమ సమస్యలను వివరించగలరు. పరిష్కారాలు చూపగలరు.
పాలకులు ఇన్నేళ్లయినా రైతుల సమస్యలపై అవగాహన కలిగి ఉండడం లేదు. ఈ విధానం పోవాలి. కేంద్ర, రాష్ట్రాలు కలసి పంటల కొనుగోళ్లపై సమగ్రంగా చర్చించాలి. రైతులకు ఏది చేస్తే లాభమో దానిని అనుసరించాలి. దానినే ఖరారు చేయాలి. అప్పుడే మార్పులు రాగలవు.

