-రాజ్యాంగ నిపుణులు, తమిళ ఎంపీ విల్సన్
భారత రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ లో చేర్చితేనే బీసీలకు 42% రిజర్వేషన్లకు రక్షణ ఉంటుందని ప్రముఖ రాజ్యాంగ నిపుణులు, న్యాయవాది, తమిళనాడు ఎంపీ విల్సన్ అభిప్రాయ పడ్డారు. బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం, ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫెడరేషన్, ఆల్ ఇండియా ఓపిసి స్టూడెంట్స్ అసోసియేషన్ సంయుక్తంగా “సామాజిక న్యాయానికి 42% బీసీ రిజర్వేషన్లు-దిక్సూచి” అనే అంశంపై శనివారం హైదరాబాద్ లోని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం చైర్మన్ టి. చిరంజీవులు అధ్యక్షత వహించారు. ఎంపీ విల్సన్, ఆల్ ఇండియా ఓబీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ వంగాల ఈశ్వరయ్య, మాజీ అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్, ప్రముఖ డాక్టర్ పుంజాల వినయ్ కుమార్, ఓబీసీ లాయర్స్ జేఏసీ చైర్మన్ రాజు, దేవరాజు తదితరులు పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఎంపీ విల్సన్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగ మౌలిక స్వరూపానికి అనుకూలంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకువచ్చే విధానాలు, చట్టాలను కోర్టులు కొట్టివేయలేవని అన్నారు. 1994 నుంచే తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయని, రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చడం వల్లనే ఇది సాధ్యమైందని తెలిపారు. తమిళనాడులో సామాజిక న్యాయ ఉద్యమ ఫలితంగా నేడు దేశవ్యాప్తంగా సామాజిక న్యాయానికి తమ రాష్ట్ర సీఎం ఛాంపియన్ గా నిలిచారని చెప్పారు. తమిళనాడులో పెరియార్, అన్నాదురై, కరుణానిధి వంటి మహనీయులు రిజర్వేషన్ల కోసం రోడ్ల మీదకు వచ్చి ఉద్యమాలు చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రిజర్వేషన్లు 50% మించ కూడదన్న కోర్టు తీర్పులను అధిగమించి రిజర్వేషన్లు అమలు చేయడానికి ప్రధాన కారణం ఆనాడు తమిళనాడులోని అన్ని రాజకీయ పార్టీలు ఒక్కటైనందునే ఇది సాధ్యమైంది అన్నారు. రిజర్వేషన్లను తొమ్మిదవ షెడ్యూలులో చేర్చడం వల్ల ఆ చట్టానికి పూర్తి రక్షణ ఏర్పడుతుందన్నారు. ఇక ఆ చట్టంలో ఎవరూ జోక్యం చేసుకోవడానికి వీలు ఉండదని వివరించారు. ఇక దేశంలో డీ లిమిటేషన్ వల్ల దక్షిణ భారతదేశంలో ఎంపీల సంఖ్య తగ్గి రేపు చట్టాలు తయారు చేయడంలో చాలా నష్టం జరుగుతుందని అన్నారు. ఇప్పుడు జరగబోయే డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా మనం ఉద్యమం చేయని పక్షంలో భవిష్యత్తులో ఎవరు దక్షిణాది రాష్ట్రాలను పట్టించుకోకుండానే నిర్ణయాలు జరుగుతాయని దానివల్ల దక్షిణ భారతదేశ ప్రజలు చాలా నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
జస్టిస్ వంగాల ఈశ్వరయ్య మాట్లాడుతూ, గతంలో చట్టం చేయకుండా జీవోలు తెస్తూ వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్లు తెస్తే ఆయా హైకోర్టులు, సుప్రీంకోర్టు కొట్టి వేసిన పలు తీర్పులను సోదాహరణంగా వివరించారు. రాజ్యాంగం, చట్టాల మీద, రిజర్వేషన్ల మీద అవగాహన లేనివారు తమను విమర్శిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ మాట్లాడుతూ, శాస్త్రీయ ఆధారాలతో కూడిన కులగణన లెక్కలు చట్టాలు లేకుండా జీవోలు తెస్తే కోర్టులు కొట్టివేసినయని చెప్పారు. తెలంగాణలోని బీసీ ఉద్యమకారులు, సంఘాలు వివిధ రాజకీయ పార్టీల బీసీ నేతలందరూ ఏకమై బీసీల రిజర్వేషన్లు అమలుకై పోరాటాలు చేయాలని బీసీ ఇంటలెక్చువల్స్ ఫారం చైర్మన్ టీ చిరంజీవులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల లేసి నివాళులర్పించారు. ఇంకా ఈ కార్యక్రమంలో బీసీ ఇంటలెక్చువల్స్ కోర్ కమిటీ సభ్యులు సోషల్ జస్టిస్ పార్టీ అధ్యక్షులు చామకూర రాజు, కె వి గౌడ్, కోలా జనార్దన్, అవ్వారు వేణు, కొండల్ గౌడ్, బొమ్మ రఘురాం, ఒంటెద్దు నరేందర్, కిరణ్, వీరస్వామి, శ్రీకాంత్, శీను తదితరులు పాల్గొన్నారు.

