ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు చట్టసభల్లో చర్చకు రావడం లేదు. అసెంబ్లీలు కావచ్చు, పార్లమెంట్ కావచ్చు. రాజకీయ నాయకులు తమ ఎజెండానే చర్చించుకుంటున్నారు. ఓట్లు వేసి, అధికారం కట్టబెట్టి తమ సమస్యలు చర్చించండని తమ ప్రజాప్రతినిధులను చట్టసభలకు పంపిస్తే, వారు ప్రజలను, వారి సమస్యలను వదిలేసి, తమ ప్రయోజనాలనే చర్చించుకుంటున్నారు. మరి ప్రజలు ఏం చేయాలి? ప్రజలు తమ సమస్యలపై రచ్చబండలో చర్చించాలి. సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయాలి. ప్రధానంగా సాగునీరు, మంచినీరు, రోడ్లు, కమ్యూనికేషన్, విద్యుత్, వైద్యం, విద్య, పన్నులు, నిత్యవావసర ధరలు వంటి కనీస వసతులపై చర్చచేయాలి. ధరల పెరుగుదల, నివారణ చర్యలపై చర్చించి వాటిని తమ ప్రజాప్రతినిధులకు నివేదికల రూపంలో అందించాలి. చట్టసభల్లో ఈ సమస్యలు చర్చించాలని కోరాలి. చట్టసభల్లో చర్చల ఎజెండాను ప్రజలే నిర్ణయించడం ద్వారా కొత్త రాజకీయాలకు నాందీ పలకాలి. లేకుంటే మన ప్రజాప్రతినిధులు చట్టసభల్లో ప్రజా సమస్యలు చర్చించరు. ప్రజోపయోగ చట్టాలను రూపొందించరు. ఎన్నికలకు ముందే పార్టీలు, నాయకులు ఎన్నికైతే ఏం చేయబోతున్నారో ముందే హావిూ ఇచ్చారు గనక వాటిపై నిలదీయాలి. ఒకప్పుడు సభలు పెట్టాలంటే ప్రభుత్వాలు భయపడేవి. ప్రతిపక్షాలు హోం వర్క్ చేసి సభలకు వచ్చేవి. ఇప్పుడా పరిస్థితి లేకుండా పోయింది. పరస్పర నిందారోపణలతో బుల్డోజింగ్ చేయడమే తప్ప, ప్రజా సమస్యలను చర్చించే దిక్కులేకుండా పోయింది. విలువైన సభాసమయం పరనింద, ఆత్మస్థుతితో ముగుస్తున్నది. అసెంబ్లీలే కాదు పార్లమెంట్ వంటి అన్ని చట్టసభల్లోనూ చర్చలకు అవకాశం ఉండటం లేదు. గత పదేళ్లుగా ఏ అంశాన్ని కూడా చర్చించడానికి బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ముందుకు రావడం లేదు. అవసరమైనన్ని రోజులు సమావేశాలు నిర్వహించడం, తమకు అనుకూలమైన బిల్లులు రూపొందించడం. ముగించడం. అన్న ప్రక్రియను బీజేపీ ఎంచుకుంది. ఇది ఎవరికి లాభమో ప్రజలు ఆలోచన చేయాలి. ఈ తరుణంలో అటు రాష్ట్రాల్లో కానీ, ఇటు కేంద్రంలో కానీ, ఆయా పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ప్రధాని, సీఎంలను ప్రజలు నిలదీలయాలి. ప్రజా సమస్యలు చర్చించే స్వేచ్ఛను లేకపోతే, వారిని ఆయా పార్టీలకు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేయాలి. ఒకవేళ ప్రశ్నించడం చేతకాని వారిని రాజకీయాల నుంచి, ఆయా పదవుల నుంచి తప్పుకోమని చెప్పాలి. నియోజకవర్గ, ప్రజల సమస్యలను చర్చించే అవకాశం లేనప్పుడు వారు ఉండేమి ఫలితం? వారు తప్పుకుంటే కొత్తవారికి అవకాశం వస్తుంది కదా? పార్టీ ఏదైనా అన్ని పార్టీల పరిస్థితి ఇదే. గొప్పలు చెప్పుకుంటున్న బీజేపీ నేతలు కూడా ప్రజల సమస్యలపై చర్చించాలన్న ఆసక్తిని ప్రదర్శించడం లేదు. పార్లమెంట్ ఉన్నదే ప్రజల సమస్యలపై చర్చించడానికి అన్న స్పృహ లేకుండా కాలాన్ని గడిపేశారు. పార్లమెంట్ సమావేశాలు మొక్కుబడిగా జరుగుతున్న వేళ..ఎంపిలను ఎన్నుకుని ఏం లాభం అన్న అనుమానం కలుగుతోంది. ఈ తరహా ప్రజాస్వామ్యం ఆందోళనకరం కాక మరోటికాదు. ప్రజలు అనేకానేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ధరల దాడితో సామాన్యులు అతలాకుతలం అవుతున్నారు. జిఎస్టీ పేరుతో బాదేస్తున్నారు. ఇవన్నీ ఎవరికి చెప్పుకోవాలి. ఎవరు వీటిని చర్చించి నిర్ణయిస్తారు. కేవలం పార్లమెంటుకు మాత్రమే చర్చించే అవకాశం ఉంది. కాబట్టి ఎంపిలు ఇప్పటినుంచి ఈ సమస్యలపై సిద్ధంగా ఉండాలి. పార్లమెంటులో తమకు మెజార్టీ ఉందికదా అని అధికారపార్టీ సమస్యలపై ఇంతకాలం పెద్దగా చర్చకు పూనుకోలేదు. ఇంతకన్నా దారుణం మరోటి ఉండదు. నిజానికి దేశంలో నేటికీ వ్యవసాయంపై, మద్దతు ధర, పంటల కొనుగోళ్లకు సంబంధించి స్పష్టమైన విధానాలు లేవు. రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పంటలను ఎలాగైనా కొనుగోలు చేసి… వాటిని ప్రజలకు చేర్చాలన్న విధానాలూ లేవు. వ్యవసాయ జాతీయ విధానం, ఆహార పంటల ఎగుమతుల విధానాలను అమలు చేయడం లేదని వ్యవసాయ నిపుణులు ఎప్పటినుంచో మొత్తుకుంటున్నారు. కందుల కొనుగోళ్లకు సంబంధించి ఇప్పటివరకు స్పష్టత లేదు. మార్క్ ఫెడ్ రంగంలోకి దిగడంలేదు. ఇప్పటికే రైతులు పంటను అమ్మడానికి సిద్ధం చేశారు. ఓవైపు కందిపప్పు ధరలు అమాంతంగా పెరుగుతున్నా.. కందులను పండించిన రైతులకు మాత్రం గిట్టుబాటు ధరలు దక్కడం లేదు. సాగు చట్టాలను బలవంతగా రుద్దేందుకు యత్నించిన కేంద్రం.. నిజానికి సాగు చట్టాల్లో ఇవన్నీ పొందుపర్చి ఉంటే ఆందోళనలు జరిగి వుండేవి కాదు. ఏ రాష్ట్రంలో ఏ పంట పండుతుందో అంచనాలు రూపొందించాలి. ఏ పంట పండిస్తే రైతులకు లాభసాటో కూడా లెక్కలు వేయాలి. దేశానికి ఏ పంటలు అవసరమో ప్రణాళిక సిద్ధం చేయాలి. కానీ అలా జరగగడం లేదు. పార్లమెంటులో ఇలాటి అత్యవసర సమస్యలపై సమగ్రంగా చర్చించడం లేదు. కేవలం ఎన్నికల కోసం పథకాలు చేపట్టడం, ఓటు బ్యాంక్‌ను సృష్టించడం వంటివాటి పైనే ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు. దేశంలో అనుత్పాదక రంగాలను పెంచి పోషిస్తున్నారు. దుబారా ఖర్చులు చేస్తున్నారు. వీటి గురించి ఎవరు కూడా నిలదీయడం లేదు. బ్యాంకులను ముంచినోళ్లను.. కంపెనీలు పెట్టి రుణాలు ఎగ్గొట్టినోళ్లను వెనకేసుకుని వస్తున్న మోడీ ప్రభుత్వం, రైతులకు సంబంధించి ఆమోదయోగ్య విధానాలను మాత్రం రూపొందించడం లేదు. పంటల కొనుగోళ్లను రాష్ట్రాలకు వదిలేయడం వల్ల ధాన్య సేకరణ అన్నది ఇప్పటికీ ఓ మిథ్య గా మారింది. మిర్చి, పత్తి, వరి తదితర పంటలకు సేకరణ విధానం లేక పోవడంతో రైతులు నష్టపోతున్నారు. పంటలు మార్కెట్‌కు తరలిస్తున్నా.. గిట్టుబాటు ధరలు రావడం లేదు. ఈ దశలో వారి వద్ద నుంచి పంటలను కనీస మద్దతు ధరలకు కొనుగోళ్లు చేసేలా చర్యలు తీసుకోవాలి. రైతులను ఆదుకునేందుకు ఎంత సాయం చేసినా దేశ అభివృద్ధికి పునాది పడినట్లే. రైతుల్లో నైరాశ్యం నెలకొంటే దేశానికే ప్రమాదం. పంటలు పండిరచిన రైతులను ఆదుకునేందుకు కేవలం పంటలను మద్దతు ధరలు ఇచ్చి కొనుగోలు చేయాలని ఏటా ఆందోళనలు చేస్తున్నా, రోడ్డెక్కుతున్నా ప్రభుత్వాలకు చీమ కుట్టినట్లు కూడా లేదు. మొన్నటికి మొన్న ఎపిలో మిర్చి ధరల కోసం రైతులు ఆందోళనకు దిగారు. తమ పంటను కొనుగోలు చేయాలంటూ ఆందోళనలకు దిగడం పరిపాటే అన్న ధోరణిలో ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటున్నాయి. ధరలు పెరుగుతున్నా పండిన పంటను ప్రజలకు చేరువ చేయడంలో ప్రభుత్వం విఫలం అవుతోంది. సహకార సంఘాలు, మార్కెట్ కమిటీలు ఉన్నా లాభం లేదన్న పరిస్థితి ఏర్పడిరది. సిసిఐ, మార్క్ ఫెడ్ లాంటి సంస్థలు ఉన్నా న్యాయం జరగడం లేదు. ఇలా ఎంతకాలం రైతులు ఆందోళనలకు దిగాలో పాలకులు చెప్పాలి. ఇవన్నీ చెప్పుకోవడానికి వేదిక లేదు. చర్చిద్దామంటే పార్లమెంటులో అవకాశం ఇవ్వడం లేదు. అందువల్ల ప్రజలు పార్లమెంట్ చర్చలపై ఎంపిలను నిలదీయాలి. అప్పుడే పాలకులుగా ఉన్నవారు, ఓట్లు అడుగుతున్న వారు తప్పులు గుర్తిస్తారు. ప్రజలు కూడా తాయిలాలకు లొంగి ఓటేసినంత కాలం ఇలాంటి దౌర్భాగ్యపు పాలన తప్పదు.

