మోడీ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి
-మాజీ ఎంపీ బి. వినోద్ కుమార్
తెలంగాణ భవన్‌లో జరిగిన ప్రెస్ మీట్‌లో మాజీ ఎంపీ బి. వినోద్ కుమార్ మాట్లాడుతూ, జనాభా లెక్కల ప్రాధాన్యతను వివరించారు. 2021లో జరగాల్సిన జనాభా లెక్కలు కరోనా కారణంగా వాయిదా పడ్డాయని, ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం సరైన నిధులు కేటాయించకపోవడంతో లెక్కలు జరగకుండా ఆలస్యం చేస్తోందని విమర్శించారు. జనాభా లెక్కలు లేకపోతే పథకాలు సమర్థంగా అమలు కావని, ఉపాధి హామీ, ఆహార భద్రత చట్టాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు.
జనగణన జరిగితే కుల గణన జరగాలనే డిమాండ్ ఉంది కాబట్టి, దాన్ని తప్పించుకునేందుకే మోడీ ప్రభుత్వం జనాభా లెక్కలను ఆలస్యం చేస్తోందనే అనుమానం కలుగుతోందన్నారు. కొత్త జనాభా లెక్కల ప్రకారమే మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని అమలు చేయాల్సి ఉన్నా, మోడీ ప్రభుత్వం దీన్ని మరో 20 ఏళ్లకు వాయిదా వేయాలని చూస్తోందని ఆరోపించారు. బడ్జెట్‌లో కేవలం 574 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించడం కేంద్ర ప్రభుత్వ అసలైన ఉద్దేశాన్ని బయటపెడుతోందన్నారు.

