బీసీ జాబితాలో ముస్లింలను చేర్చడం హిందూ సమాజానికి పెను ప్రమాదమని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. బీసీలకు జరుగుతున్న అన్యాయంపై బీసీ సంఘాలు మౌనం పాటించడం దురదృష్టకరమన్నారు. అగ్రవర్ణాలతో సహా అందరూ బీసీలకు మద్దతు తెలుపుతున్నా, స్థానిక నేతలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కుల గణనలో బీసీల జనాభాను కావాలని తగ్గించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. తెలంగాణలో 3.35 కోట్ల ఓటర్లు ఉంటే, జనాభా 3.70 కోట్లేనా? మేధావులు, గణాంకాలు చెబుతున్న 4.30 కోట్ల జనాభా ఏదో ఒక కుట్రలో మాయమైందని సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ హయాంలో ఎస్కేఎస్ సర్వే ప్రకారం బీసీలు 51 శాతం ఉంటే, ఇప్పుడు రేవంత్ సర్వేలో 46 శాతానికి తగ్గడం దేనికి సంకేతమని నిలదీశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఎమ్మెల్సీ ఎన్నికల్లో మ్యాచ్ ఫిక్సింగ్ నడుస్తోందని ఆరోపిస్తూ, అందుకే బీఆర్ఎస్ అభ్యర్థిని నిలబెట్టలేదని విమర్శించారు. అవినీతి కేసుల్లో బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేయకపోవడం వెనుక గూఢచార రాజకీయాలు ఉన్నాయని సంజయ్ ధ్వజమెత్తారు. నిరుద్యోగులు, మేధావులను మోసం చేసిన కాంగ్రెస్‌కు ఎందుకు ఓటేయాలంటూ ప్రశ్నించారు. టీచర్లు, నిరుద్యోగ పట్టభద్రులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేసిన కాంగ్రెస్‌ను ఢిల్లీ ప్రజలు తిరస్కరించారని ఆయన వ్యాఖ్యానించారు.

