ప్రయాగరాజ్ మహా కుంభమేళాలో విభిన్న సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దేశం నలుమూలల నుంచి కోట్లాది మంది భక్తులు పవిత్ర స్నానాల కోసం తరలివస్తుండగా, అనేక మంది సాధువులు, నాగ సాధువులు కూడా పాల్గొంటున్నారు. వీరిలో కొందరు తన జీవితాన్ని పూర్తిగా వదిలేసి సన్యాసం తీసుకున్నవారే.
ఇలాంటి సందర్భంలో, జార్ఖండ్‌కు చెందిన ఓ కుటుంబం మహా కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు వెళ్లింది. ఆలయాలు, ఘాట్లు సందర్శిస్తుండగా, ఒక అఘోరి బాబా కనిపించాడు. అతని రూపం చూసి కుటుంబసభ్యులకు ఎక్కడో చూసినట్లుగా అనిపించింది. కాస్త సమీపంగా వెళ్లి గమనించాక, ఆయన 27 ఏళ్ల క్రితం అదృశ్యమైన తమ సమీప బంధువు గంగసాగర్ యాదవ్ అని గుర్తించారు.
గంగసాగర్ యాదవ్ అప్పట్లో తన భార్య, ఇద్దరు పిల్లలను వదిలేసి ఎటూగానీ వెళ్లిపోయాడు. కుటుంబం అతనికోసం ఎన్నో ప్రయత్నాలు చేసింది. పోలీస్ కేసులు పెట్టినా ఎలాంటి సమాచారం రాలేదు. అలా ఆయన కోల్పోయినవారిలో ఒకరయ్యాడు.
కుంభమేళాలో అతనిని గుర్తించిన కుటుంబసభ్యులు తక్షణమే ఈ విషయాన్ని ఆయన భార్యకు తెలిపారు. భర్త 27 ఏళ్ల తర్వాత సన్యాసంలో కలసిపోయి అఘోరిగా మారిపోయాడని తెలుసుకున్న ఆమె, తన పెద్దయిన పిల్లలతో కలిసి వెంటనే కుంభమేళాకు చేరుకుంది. అక్కడికి రాగానే బంధువులు గంగసాగర్ యాదవ్‌ను చూపించారు.

