–రికార్డులతో సహా సమస్యను సిఎం కి సమర్పించిన ఓ నేత
–అధికారులకు లేఖలు రాసిన శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్
–కలెక్టర్ ను కలిసి విజ్ఞాపన అందజేసిన తెలంగాణ ఉద్యమకారుల కమిటీ
–రూపు దాల్చనున్న ఐక్యవేదిక
–కథన రంగంలోకి కమ్యూనిస్టు పార్టీలు, కార్మిక సంఘాలు
–కదం తొక్కుతున్న కార్మికుల కుటుంబాలు
–మీనమేషాలు లెక్కడుతున్న ప్రధాన పార్టీలు
–ప్రధాన పార్టీలను ప్రజల ముందు దోషులుగా నిలబెడుతున్న కార్మికులు
భావోద్వేగానికి గురైన కార్మికులు ఉద్వేగం తో తీసుకున్న నిర్ణయం… ఉద్యమం గా మారి ఉధృత రూపం దాలుస్తున్నది. అజం జాహి మిల్లు… అందులో పని చేసిన కార్మికులు, వారి వారసుల పేగు బంధానికి ప్రతీక అని తేలిపోయింది. మిల్లుకు, కార్మికులకు విడదీయరాని అనుబంధమని రుజువు అవుతుంది. మిల్లు గత వైభవానికి చిన్న జ్ఞాపకంగా మిగిలి నిలిచిన కార్మిక భవన స్థలాన్ని కబ్జా కోరల నుండి కాపాడుకోవడానికి కార్మిక లోకం కదులుతున్నది. కదం తొక్కుతున్నది.
గత ఎమ్మెల్యే కబ్జా కమీషన్ల కక్కుర్తికి బలైన అజం జాహి మిల్లు కార్మిక భవన స్థలం, తాజా ఎమ్మెల్యే బంధు గణ కబ్జా కోరల్లో చిక్కింది. ఓ బడా వ్యాపారి బడా కాంప్లెక్స్ నిర్మాణ పర్మిషను కూడా దక్కి, అధికారుల అవినీతికి పరాకాష్ట అయింది. కాంప్లెక్స్ భవన శంకుస్థాపనకు స్వయంగా మంత్రి భర్త కొట్టిన కొబ్బరికాయ తో అక్రమార్కుల బండారం బట్టబయలు అయింది. మీడియా, కొందరు కార్మిక కుటుంబాల వారసుల చొరవతో అసలు విషయం ప్రజలకు తెలిసిపోయింది. అజం జాహి మిల్లు ఉద్యమాలతో నాయకులై ఉన్నత పదవులు పొందిన నేతలు ఇప్పుడు పెదవులు మూశారు. అయినప్పటికీ కార్మిక లోకం వారసులు చారిత్రాత్మక మిల్లు కార్మిక భావన స్థల పరిరక్షణ కోసం నడుం బిగించారు. దీంతో కొందరు నాయకులు కదలి వచ్చారు. వరంగల్ కు చెందిన ఓ ప్రముఖ నేత రికార్డులతో సహా సమస్యను సిఎం కి సమర్పించారు. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ ఈ సమస్యనిగ్గు తేల్చాలని ఉన్నతాధికారులకు లేఖలు రాశారు. తెలంగాణ ఉద్యమకారుల కమిటీ కలెక్టర్ ను కలిసి విజ్ఞాపన అందజేసింది. ఐక్య వేదిక ఏర్పాటు జరుగుతున్నది. కథన రంగంలోకి కమ్యూనిస్టు పార్టీలు, కార్మిక సంఘాలు దిగాయి. లక్ష సంతకాల సేకరణ లక్ష్యంగా కార్మికుల కుటుంబాల వారసులు కదం తొక్కుతున్నారు.
మరో వైపు, సర్వేల పేరుతో అధికారుల హైడ్రామా కార్మికుల కుటుంబాలని విస్మయానికి గురి చేస్తున్నది. పర్మిషన్లు ఇచ్చి సర్వేల పేరుతో పదేపదే మిల్లు కార్మిక భవన స్థల కొలతలు వేస్తూ వచ్చి పోవడం ఆందోళనకు గురిచేస్తుంది. ఆ బడా వ్యాపారి ఏ క్షణంలోనైనా ఆ కార్మిక భవనాన్ని కూల్చివేసి నూతన భవన నిర్మాణ పనులను ప్రారంభించవచ్చని తెలుస్తున్నది. ఇందుకోసం ఆ బడా వ్యాపారి కోర్టుకు వెళ్లి తగిన ఆదేశాలు తెచ్చుకుంటున్నారన్న ప్రచారం పలువురుని విస్మయానికి గురిచేస్తుంది. ఇదంతా అధికార పార్టీ నేతల కనుసనల్లోనే జరుగుతుందన్న ప్రచారానికి తోడు, వారి మౌనం, ప్రధాన పార్టీలను ప్రజల ముందు దోషులుగా నిలబెడుతున్నది.
మా నాన్న అజంజాహీ కార్మికుడు
అవును. మా నాన్న అజం జాహి కార్మికుడు అనే పేరుతో బిల్లు కార్మిక భవన స్థల పరిరక్షణకు నూతన కార్మిక సంఘం ఆవిర్భవించింది. బిల్లు కార్మికుల కుటుంబాల వారసుల నేతృత్వంలోనే లక్ష సంతకాల సేకరణ లక్ష్యంగా ఈ కమిటీ పని చేయనుంది.
నేటి నుండే లక్ష సంతకాల సేకరణ
అజం జాహి మిల్లు కార్మిక భవన స్థలం వేదిక
అజం జాహి మిల్లు కార్మిక భవన స్థల పరిరక్షణ కోసం ఆవిర్భవించిన మా నాన్న అజం జాహి కార్మికుడు అనే కార్మిక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నుండి లక్ష సంతకాల సేకరణ మొదలుకానుంది. ఇల్లు కార్మిక భవన స్థలం వేదికగా ఆరోజు ఉదయం 10 గంటలకు ముహూర్తంగా నిర్ణయించారు. ఆ తర్వాత 20 టీములుగా వరంగల్ నగరంలోని 20 ప్రాంతాలలో లక్ష సంతకాల సేకరణ లక్ష్యంగా పనిచేయనున్నారు.
అజంజాహి కార్మిక స్థలాన్ని కాపాడుకుందాం – బండా ప్రకాష్ తెలంగాణ శాసన మండలి వైస్ చైర్మన్

వరంగల్ జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులు, మున్సిపల్ కమిషనర్ వివిధ శాఖల అధికారుల దృష్టికి ఈ అజంజాహి మిల్లు కార్మిక భవనం ఇష్యూ తీసుకు వెళ్లాను. ఆల్రెడీ దీనికి సంబంధించి పూర్తి రికార్డులు వెలికి తీయమని లెటర్ రాశాను
అక్కడే కార్మిక భవనం నిర్మించాలి
-ప్రొఫెసర్ కూరపాటి వెంకట నారాయణ, తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర కమిటీ చైర్మన్

గత ప్రభుత్వం కొంత భూమిని ఇతర సంస్థలకు అమ్మి నాశనం చేసింది. ప్రస్తుత ప్రభుత్వం ఉన్న భూమిని కూడా అమ్మాలని ప్రయత్నం చేస్తుంది. దీనిని వెంటనే రద్దు చేసి కారకులను శిక్షించాలి. ప్రస్తుతం వున్న స్థలంలో కార్మిక భవనాన్ని నిర్మించాలి.

