విధులకు హాజరు కాని టీచర్ల పై వేటు!!
సర్వీసుల నుండి 16 మంది తొలగింపు
గైర్హాజరీ టీచర్ల పై గట్టి నిర్ణయం తీసుకున్న యాదాద్రి జిల్లా అధికారులు
అధికారుల నిర్ణయాన్ని హర్షిస్తున్న తల్లిదండ్రులు
తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖలో ఊహించని కీలక పరిణామం చోటు చేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా విద్యాశాఖ తీసుకున్న నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం గా మారింది. కొన్ని ఏళ్లుగా విధులకు హాజరు కాని ప్రభుత్వ ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకుంటూ, 16 మంది టీచర్లను వారి సేవల నుండి తొలగించినట్లు జిల్లా విద్యాధికారి (డీఈఓ) సత్యనారాయణ ప్రకటించారు. ఈ ఉపాధ్యాయులు 2005 నుండి విధులకు హాజరు కాకపోవడమేకాక, విద్యాశాఖ పంపిన నోటీసులకు కూడా స్పందించకపోవడంతో, వారిని సర్వీసుల నుండి తొలగించాల్సి వచ్చినట్లు తెలిపారు.
తొలగించిన 16 మంది ఉపాధ్యాయుల్లో 9 మంది మహిళలు, మిగతా 7 గురు పురుషులు. వీరంతా ఎస్జిటి లుగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ టీచర్లు కొన్ని ఏళ్ళ నుండి లాంగ్ లీవ్‌లో ఉన్నారు. కొందరు వీరిలో విదేశాలకు వెళ్ళి అక్కడే స్థిరపడినట్టు సమాచారం.
ఇదే విషయమై అడుగు ప్రతినిధి డిఈఓ సత్యనారాయణ తో మాట్లాడగా, విద్యా శాఖ ప్రధాన బాధ్యత విద్యార్థులకు మెరుగైన విద్యార్జన వాతావరణాన్ని కల్పించడం. విద్యార్థుల సముచిత హక్కులను దృష్టిలో పెట్టుకొని, విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న టీచర్లపై ఈ చర్యలు తీసుకోవడం తప్పనిసరి అయింది.” అని చెప్పారు. ఆయా టీచర్లకు అధికారికంగా టెర్మినేషన్ లెటర్స్ పంపినట్లు కూడా తెలిపారు.
అంతేకాకుండా, ఈ చర్యలు విద్యా వ్యవస్థలో క్రమశిక్షణను పెంచడం, విద్యార్థుల భవిష్యత్తు మెరుగ్గా ఉండటానికి మేల్కొలుపు చర్యగా ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇతర జిల్లాల్లో కూడా ప్రక్షాళన
యాదాద్రి భువనగిరి జిల్లాతో పాటు, పెద్దపల్లి మరియు హైదరాబాద్ జిల్లాల్లో కూడా సుదీర్ఘ కాలం విధులకు హాజరుకాకుండా ఉన్న టీచర్లపై చర్యలు తీసుకున్నారు. విద్యాశాఖ అనుసరిస్తున్న ప్రక్షాళన కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతోంది.
ఈ చర్యలపై ఉపాధ్యాయ సంఘాలు, విద్యావేత్తలు, ప్రజలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఈ చర్యలను సమర్థిస్తుండగా, మరికొందరు టీచర్లకు మరింత సమయం ఇవ్వాల్సింది అని అంటున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. “విధులకు హాజరు కాని టీచర్ల కారణంగా విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతోంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సరైనది.” అని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ చర్యలు ఉపాధ్యాయులకు ఒక గుణపాఠంగా నిలవాలని, ప్రతి ఉపాధ్యాయుడు తన బాధ్యతలను గుర్తించి విధులను సక్రమంగా నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.

