తమిళనాడు రాజధాని చెన్నైలోని అన్నా యూనివర్సిటీ ప్రాంగణంలో ఓ విద్యార్థిపై జరిగిన అత్యాచార ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ విషయంలో మద్రాస్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. విచారణ జరిపిన హైకోర్టు, ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ సిట్‌లో ముగ్గురు మహిళా ఐపీఎస్ అధికారులను నియమించాలని స్పష్టమైన సూచనలు చేసింది.
అదనంగా, బాధితురాలికి నష్టపరిహారంగా రూ.25 లక్షలు అందించాలని రాష్ట్ర సర్కారుకు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. అలాగే, ఈ ఘటన వల్ల బాధిత విద్యార్థినిపై చదువుకు ఎటువంటి ప్రతికూల ప్రభావం పడకుండా చూసుకోవాలని సూచించింది. బాధితురాలి నుంచి ఫీజు వసూలు చేయకూడదని యూనివర్సిటీని న్యాయస్థానం ఆదేశించింది. ఈ ఘటనపై తీసుకుంటున్న చర్యలు ప్రజల్లో చర్చనీయాంశమవుతున్నాయి.

