సిన్న సిన్న సన్న పోరగాండ్లు, లవ్వు, గివ్వు అని తిరిగేటోల్లు, పెద్దోళ్ళు కూడా ఎందుకో గానీ గా ఎలుగుబంటి లెక్కుండే టెడ్డీ బేర్ బొమ్మను మస్త్ ఇష్టపడుతుంటరు. పొల్లగాండ్లకు కూడా గా బొమ్మల్ని కొనిత్తరు. బహుమానం చేత్తరు. ఇగిప్పుడు ఎవ్వల ఇంట్ల సూసినా గా బొమ్మలే ఉంటానయి. గనీ గా దానికి గా పేరు ఎట్ల వచ్చిందో తెలుసా?

ఒగప్పుడు గా అమెరికాకు అధ్యక్షుడుగ థియోడర్ రూజ్వెల్ట్ అనేటాయన ఉండే… గాయిన ముద్దుపేరు టెడ్డీ బేరిస్. గాయనే జ్ఞాపకార్థం గా బొమ్మకు ‘టెడ్డిబేర్’ అని పేరు వచ్చింది. ఒకసారి గాయన వేటకు ఎల్లిండు అట. ఒక ఎలుగుబంటి కనబడితే కాల్చను పో అన్నడట. గీ సంఘటన ఆధారంగా ఒక కార్టూనిస్ట్ గీసిన చిత్రం సూసి, న్యూయార్క్‌కు చెందిన ఒక యాపారి గా మెత్తటి ఎలుగుబంటి బొమ్మను తయారు సేసి ‘టెడ్డీస్ బేర్’ అని పిలిసిండట.
గా వాటిని లోపల దూది లేదా మెత్తటి పదార్థాలతో నింపి, పైన ముఖమల్ లేదా ఫర్ లాంటి మెత్తటి గుడ్డతో తయారు చేస్తరు. ఇగిది కేవలం ఒక ఆటవస్తువు మాత్రమే కాదు, పేమకు, ఆప్యాయతకు, ఓదార్పుకు గుర్తుగ భావిస్తరు. గందుకే శాలామంది దీనిని పుట్టినరోజులు, పేమికుల రోజు వంటి సందర్భాల్లో బహుమతిగా ఇస్తుంటరు.

