యుద్ధం ఎక్కడ జరిగినా దాని ప్రభావం ప్రపంచమంతటా కనిపిస్తుంది. ప్రాణనష్టం, ఆస్తి విధ్వంసంతో పాటు ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదల, ఆకలి, నిరాశ్రయత వంటి సమస్యలు తీవ్రమవుతాయి. శాంతియుత ప్రపంచమే మానవాళి అభివృద్ధికి పునాది. అందుకే యుద్ధాలకు ముగింపు పలికి, ప్రపంచ శాంతి కోసం దేశాలు కలిసికట్టుగా చొరవ తీసుకోవాలి.
డా. మార్గం – అడుగు, ఎడిటోరియల్
ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న యుద్ధాలు ప్రజల్లో భయాందోళనలు కలిగించడమే కాకుండా ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. యుద్ధాల కారణంగా ప్రాణనష్టం, ఆస్తి విధ్వంసంతో పాటు నిత్యావసరాలు, ఇంధనం, రవాణా, సరఫరా వ్యవస్థలపై భారం పెరుగుతోంది. మొదటి, రెండో ప్రపంచ యుద్ధాలు మానవ చరిత్రలో అపారమైన విషాదాన్ని మిగిల్చాయి. రెండో ప్రపంచ యుద్ధంలో అణ్వాయుధాల వినియోగం విధ్వంసానికి కొత్త పరిమాణాన్ని చూపించింది. అనంతరం లీగ్ ఆఫ్ నేషన్స్, ఐక్యరాజ్యసమితి, భద్రతా మండలి వంటి అంతర్జాతీయ సంస్థలు ఏర్పడినా కొరియా, వియత్నాం, పశ్చిమాసియా, ఉక్రెయిన్ తదితర ప్రాంతాల్లో ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. పాలస్తీనా-ఇజ్రాయెల్ వివాదం, యెమెన్, సూడాన్ వంటి ప్రాంతాల్లోని సంక్షోభాలు కూడా సామాన్య ప్రజల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో యుద్ధాలకు బదులు చర్చలు, దౌత్యం, పరస్పర అవగాహన ద్వారా పరిష్కారాలు వెతకాల్సిన అవసరం మరింత పెరిగింది. అమెరికా కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీసులో సెప్టెంబర్ 15, 2026న ఇరాన్‌పై అమెరికా సైనిక చర్యల ఖర్చు, వాటి ఆర్థిక-బడ్జెట్ ప్రభావాలపై ప్రత్యేక నివేదికను విడుదల చేసింది.
ఇరాన్‌పై అమెరికా సైనిక చర్యల వల్ల రక్షణ శాఖకు సంబంధించిన కార్యకలాపాలు, రవాణా-నిర్వహణ, ఉపయోగించిన ఆయుధాలు, మందుగుండు సామగ్రి భర్తీ వంటి అంశాలు గణనీయమైన ఖర్చులకు దారితీస్తున్నాయని సీబీఓ విశ్లేషించింది. యుద్ధ తీవ్రత పెరిగితే భవిష్యత్ వ్యయం మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. అదే సమయంలో క్షిపణి రక్షణ వ్యవస్థల అధిక వినియోగం వల్ల ఆయుధ నిల్వలపై కూడా ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంది. ఈ యుద్ధ ప్రభావం ఇంధన సరఫరా, అంతర్జాతీయ వాణిజ్యం, ద్రవ్యోల్బణం వంటి అంశాలపై పడే అవకాశం ఉందన్నది కూడా ముఖ్యమైన ఆర్థిక ఆందోళన.
యుద్ధాల ఆర్థిక ప్రభావం యుద్ధం జరుగుతున్న దేశాలకే పరిమితం కాదు. చమురు, సహజవాయువు రవాణాకు అంతరాయం ఏర్పడితే ప్రపంచ మార్కెట్లలో ఇంధన ధరలు పెరగవచ్చు. దాంతో రవాణా, వ్యవసాయం, పరిశ్రమలు, ఆహార సరఫరా తదితర రంగాల్లో ఖర్చులు పెరిగి చివరకు వినియోగదారులపై భారం పడుతుంది. ఆయుధాల కొనుగోలుకు భారీగా ఖర్చు చేసే సంపదలో కొంత భాగాన్ని పేదరిక నిర్మూలన, ఆకలి నివారణ, విద్య, వైద్యం, ఉపాధి కల్పనకు మళ్లిస్తే మానవాభివృద్ధికి మరింత ఉపయోగకరంగా ఉంటుంది. ప్రపంచంలో రక్షణ వ్యయాలు ఇప్పటికే ప్రభుత్వ బడ్జెట్లలో ప్రధాన భాగంగా ఉన్నాయి; సీబీఓ కూడా అమెరికా రక్షణ బడ్జెట్, సైనిక వ్యయాల దీర్ఘకాలిక ప్రభావాలను నిరంతరం విశ్లేషిస్తోంది.
కళింగ యుద్ధం అనంతరం అశోకుడు శాంతి, ప్రజా సంక్షేమం వైపు మళ్లిన చరిత్ర మానవాళికి ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తుంది. “వసుధైవ కుటుంబకం” అనే భారతీయ భావన ప్రపంచమంతా ఒక కుటుంబమనే ఆలోచనను ప్రతిబింబిస్తుంది. ఆధిపత్య ధోరణులు, ద్వేషాలు, ఉగ్రవాదం, ప్రతీకార రాజకీయాలకు బదులుగా మానవతా విలువలు, సంభాషణ, సహకారం ముందుకు రావాలి. అణ్వాయుధాలు, ఖండాంతర క్షిపణులు, అపారమైన ఆయుధ సంపత్తి శాశ్వత శాంతికి హామీ ఇవ్వలేవు. అందువల్ల ప్రపంచ దేశాలు తమ విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించేందుకు చొరవ చూపాలి. యుద్ధాలు త్వరగా ముగిసి, శాంతి చర్చలు మానవ సంక్షేమానికి దారితీసేలా అంతర్జాతీయ సమాజం సమన్వయంతో పనిచేయాలి. ప్రపంచ శాంతి కోసం చొరవ తీసుకోవడం ఇప్పుడు కేవలం రాజకీయ బాధ్యత కాదు.. మానవాళి భవిష్యత్తుపై ఉన్న సమిష్టి బాధ్యత.

