అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ తన విధానాలతో ఆర్థికంగా బలపరచాలని యత్నిస్తున్నారు. కెనడా, మెక్సికోతోపాటు పలు దేశాలపై టారిఫ్‌లు పెంచుతానని ఇప్పటికే హెచ్చరించిన ఆయన, తాజాగా యూరోపియన్ యూనియన్‌ను కూడా ఈ జాబితాలో చేర్చారు.
వాషింగ్టన్‌తో వాణిజ్య అంతరాన్ని తగ్గించకుంటే తీవ్రమైన పరిణామాలు ఎదురవుతాయని ట్రంప్ హెచ్చరించారు. ప్రత్యేకంగా గ్యాస్, చమురు కొనుగోళ్ల విషయంలో అమెరికాను ఆశ్రయించాలని డిమాండ్ చేశారు. అలా చేయకపోతే అన్ని టారిఫ్‌లను గణనీయంగా పెంచుతామని స్పష్టంగా తెలిపారు.
ఈ విధానం ద్వారా అమెరికా గ్యాస్ మరియు చమురు రంగం గ్లోబల్ మార్కెట్లో మరింత స్థిరపడుతుందని ట్రంప్ భావిస్తున్నారు. ఇతర దేశాలు అమెరికా ఇంధనాన్ని కొనుగోలు చేయడం ద్వారా అక్కడి ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుందని ఆయన అభిప్రాయం. అయితే, ఈ నిర్ణయాలు అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని నిపుణులు అంటున్నారు.
ఇంధన వ్యాపారంపై ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు పలు దేశాల్లో చర్చనీయాంశంగా మారాయి. అమెరికా గ్యాస్, చమురు రంగం పట్ల ఇతర దేశాలు ఎలా స్పందిస్తాయనేది చూడాలి.

