అనూహ్యం కాకపోయినా, అనివార్యంగా జరిగిపోయింది. పరిణామాల ఫలితాలేమైనా, కొండంత ఆశయం, తన కూతురు, తమ భవిష్యత్తు కోసం కొంత పట్టువిడుపు ప్రదర్శించి ఉంటే, కొండా సురేఖ మంత్రి పదవి నిలిచేదేమో! అయినా కొండా దంపతులు ఇంత పట్టుదలగా ఎందుకున్నారు? వారి వెనుక ఇంకేమైనా శక్తులున్నాయా? కాంగ్రెస్ ను, సీఎంను బలహీన పరిచే కుయుక్తులేమైనా పన్నారా? కాంగ్రెస్ కల్చరే ఇంత? అనే నిరూపణ పన్నాగమేమైనా జరిగిందా? కాలమే నిర్ణయించాలి. బహుషా, రాజకీయాల్లో ఇంత పట్టుదలలు కూడా అవసరం లేదేమో! మంత్రి పదవి, సీఎం, పార్టీ అధిష్ఠానంతో విభేదాలు, కుమార్తె రాజకీయ ప్రవేశ పరితపనలు ఇప్పుడు ఒకదానితో ఒకటి ముడిపడక విడివడ్డాయి. ‘రాజీ’నామాకు ససేమిరా అనడంతో తప్పని బర్తరఫ్ తర్వాత, కొండా దంపతుల తదుపరి అడుగు ఏమిటన్నది? రాష్ట్ర, కాంగ్రెస్ రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇది కేవలం కుటుంబ రాజకీయ వారసత్వాన్ని కొనసాగించే ప్రయత్నమా? లేక తెలంగాణలో బీసీ సామాజిక వర్గాలను కొత్త రాజకీయ శక్తిగా నిర్మించాలన్న వ్యూహమా? అన్నది రాబోయే రోజుల్లో తేలుతుంది.
కొండా దంపతులకు అనుభవం, పరిచయాలు, వ్యక్తిగత రాజకీయ ప్రభావం ఉన్నా, వాటిని స్థిరమైన ఓటు శక్తిగా, సంస్థాగత బలంగా మార్చగలిగితేనే కొత్త రాజకీయ ప్రయోగం విజయవంతమవుతుంది. లేకపోతే ఇది మరో రాజకీయ సంచలనంగా మాత్రమే మిగిలిపోయే అవకాశమూ ఉంది.
డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్
అనూహ్యం కాకపోయినా, అనివార్యంగా జరిగిపోయింది. పరిణామాల ఫలితాలేమైనా, కొండంత ఆశయం, తన కూతురు, తమ భవిష్యత్తు కోసం కొంత పట్టువిడుపు ప్రదర్శించి ఉంటే, కొండా సురేఖ మంత్రి పదవి నిలిచేదేమో! అయినా కొండా దంపతులు ఇంత పట్టుదలగా ఎందుకున్నారు? వారి వెనుక ఇంకేమైనా శక్తులున్నాయా? కాంగ్రెస్ ను, సీఎంను బలహీన పరిచే కుయుక్తులేమైనా పన్నారా? కాంగ్రెస్ కల్చరే ఇంత? అనే నిరూపణ పన్నాగమేమైనా జరిగిందా? కాలమే నిర్ణయించాలి. బహుషా రాజకీయాల్లో ఇంత పట్టుదలలు కూడా అవసరం లేదేమో! మంత్రి పదవి, సీఎం, పార్టీ అధిష్ఠానంతో విభేదాలు, కుమార్తె రాజకీయ ప్రవేశ పరితపనలు ఇప్పుడు ఒకదానితో ఒకటి ముడిపడక విడివడ్డాయి. ‘రాజీ’నామాకు ససేమిరా అనడంతో తప్పని బర్తరఫ్ తర్వాత, కొండా దంపతుల తదుపరి అడుగు ఏమిటన్నది? రాష్ట్ర, కాంగ్రెస్ రాజకీయాల్లోనే కాదు, వరంగల్ ప్రాంతంలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా తమ కుమార్తె కొండా సుస్మిత రాజకీయ భవిష్యత్తు కోసం వారు కొత్త రాజకీయ వేదికను ఆలోచిస్తున్నారన్న ప్రచారం మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నది. అయితే, ఇది కేవలం కుటుంబ రాజకీయ వారసత్వాన్ని కొనసాగించే ప్రయత్నమా? లేక తెలంగాణలో బీసీ సామాజిక వర్గాలను కొత్త రాజకీయ శక్తిగా నిర్మించాలన్న వ్యూహమా?
కొండా కుటుంబానికి నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం ఉంది. వరంగల్ ప్రాంతంలో, ముఖ్యంగా తమకు బలమైన రాజకీయ పరిచయాలు ఉన్న నియోజకవర్గాల్లో వారికి వ్యక్తిగత అనుచరగణం ఉంది. దీనికి తోడు బీసీ సామాజిక వర్గాల్లో తమకు ఉన్న అనుబంధాన్ని రాజకీయంగా విస్తరించుకోవాలన్న ఆలోచన ఉన్నట్లు వారి అనుచర వర్గాల్లో చర్చ సాగుతోంది. రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలను తమ భవిష్యత్ వ్యూహానికి పునాదిగా చేసుకోవాలని వారు భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇక కొండా సుస్మిత రాజకీయ ప్రవేశం ఈ సమీకరణంలో కీలకమైన అంశం. గతంలో బీఆర్‌ఎస్‌లో ఉన్న సమయంలోనూ ఆమెకు రాజకీయ అవకాశం కల్పించాలని కొండా కుటుంబం ప్రయత్నించింది. తల్లిదండ్రుల రాజకీయ వారసత్వాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో పరకాల నియోజకవర్గంపై ఆమె దృష్టి పెట్టింది. అయితే ప్రస్తుత రాజకీయ పరిణామాల్లో పరకాల నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డికే తిరిగి ప్రాధాన్యం ఉంటుందన్న సీఎం సంకేతాలు సుస్మిత రాజకీయ ఆశలకు ప్రతికూలంగా పరిణమించాయి.
ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై సుస్మిత చేసిన విమర్శలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టించాయి. ఆ వ్యాఖ్యలపై పార్టీ అంతర్గతంగా అసంతృప్తి వ్యక్తం కావడం, కొండా సురేఖపై చర్యల డిమాండ్లు రావడం పరిస్థితిని మరింత సంక్లిష్టం చేసింది. అయితే, సుస్మిత స్వతంత్రంగా చేసిన వ్యాఖ్యలకు తాము బాధ్యులం కాదని కొండా దంపతులు చెప్పడం ద్వారా కుటుంబం తమ వైఖరిని స్పష్టం చేసింది. అదే సమయంలో కుమార్తె వ్యాఖ్యలను బహిరంగంగా ఖండించకపోవడం కూడా ఒక రాజకీయ సంకేతంగానే చూడవచ్చు.
ఇక్కడి నుంచే కొత్త రాజకీయ వేదిక ఆలోచనకు బలం చేకూరుతోంది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీలలో టికెట్లు దక్కక అసంతృప్తితో ఉన్న నాయకులను, ముఖ్యంగా బీసీ సామాజిక వర్గాలకు చెందిన నాయకులను ఒకే వేదికపైకి తీసుకురావడం సాధ్యమైతే అది కొండా కుటుంబానికి కొత్త రాజకీయ వ్యాక్యూంని కల్పించవచ్చు. అయితే, నాయకులను సమీకరించడం ఒక దశ మాత్రమే. వారిని ఎన్నికల్లో గెలిపించగల సంస్థాగత యంత్రాంగం, నిర్మాణం, బూత్ స్థాయి కేడర్, ఆర్థిక వనరులు, స్పష్టమైన రాజకీయ సిద్ధాంతం, పార్టీ నిర్వహణా సామర్థ్యాలు లేకుండా కొత్త పార్టీ నిలదొక్కుకోవడం కష్టం.
తెలంగాణ రాజకీయ చరిత్ర కూడా ఇదే విషయాన్ని చెబుతోంది. స్వతంత్ర రాజకీయ వేదికతో ప్రజల్లో గుర్తింపు పొందిన నాయకుల ఉదాహరణలు ఉన్నప్పటికీ, వ్యక్తిగత ప్రజాదరణను రాష్ట్రవ్యాప్త ఓటు బ్యాంకుగా మార్చడం అంత సులభం కాదు. ఒక పార్టీకి కనీసం నియోజకవర్గ స్థాయి నిర్మాణం, అభ్యర్థుల ఎంపికలో విశ్వసనీయత, నిరంతర ప్రజా కార్యక్రమాలు అవసరం. కొండా కుటుంబం ప్రతిపాదించబోయే రాజకీయ నమూనా ఈ సవాళ్లను ఎలా అధిగమిస్తుందన్నదే అసలు పరీక్ష.
బీసీ ఆత్మగౌరవం, రాజకీయ ప్రాతినిధ్యం ప్రధాన అజెండాగా కొత్త శక్తిని నిర్మిస్తే అది తెలంగాణ రాజకీయాల్లో ఖాళీగా ఉన్న ఒక స్థలాన్ని భర్తీ చేసే ప్రయత్నంగా నిలవొచ్చు. కానీ బీసీ సమాజం ఏకరూప ఓటు బ్యాంకు కాదు. అనేక కులాలు, ప్రాంతాలు, ఆర్థిక-సామాజిక ప్రయోజనాలతో కూడిన విస్తృత సమూహం. కాబట్టి కేవలం బీసీ నినాదం సరిపోదు. రైతులు, యువత, మహిళలు, ఉద్యోగాలు, విద్య, స్థానిక అభివృద్ధి వంటి అంశాలపై స్పష్టమైన విధానం అవసరం.
ప్రస్తుతం కొండా కుటుంబం నుంచి కొత్త పార్టీపై అధికారిక ప్రకటన వెలువడనంతవరకు ఈ చర్చను రాజకీయ అవకాశాల అంచనాగానే చూడాలి. పాదయాత్ర, బీసీ మేధావులతో సంప్రదింపులు, కొత్త నాయకుల సమీకరణ వంటి ఆలోచనలు కార్యరూపం దాల్చితేనే ఈ ఊహాగానాలకు రాజకీయ రూపం వస్తుంది.
చివరికి, ఇది కేవలం ఒక కుటుంబం రాజకీయ భవిష్యత్తు కోసం చేస్తున్న ప్రయత్నమా? లేక తెలంగాణలో కొత్త సామాజిక-రాజకీయ సమీకరణానికి ఆరంభమా? అన్నది రాబోయే రోజుల్లో తేలుతుంది. కొండా దంపతుల వద్ద అనుభవం, పరిచయాలు, వ్యక్తిగత రాజకీయ ప్రభావం ఉన్నా, వాటిని స్థిరమైన ఓటు శక్తిగా, సంస్థాగత బలంగా మార్చగలిగితేనే కొత్త రాజకీయ ప్రయోగం విజయవంతమవుతుంది. లేకపోతే ఇది మరో రాజకీయ సంచలనంగా మాత్రమే మిగిలిపోయే అవకాశమూ ఉంది.

