కాంగ్రెస్‌ను వీడి ప్రజాశాంతి పార్టీలోకి రండి
మంత్రి కొండా సురేఖకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ బహిరంగ ఆహ్వానం పలికారు. కాంగ్రెస్ పార్టీలో చోటుచేసుకుంటున్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో సురేఖ పార్టీ మారే అంశంపై చర్చ జరుగుతున్న వేళ కేఏ పాల్ వీడియో ద్వారా స్పందించారు. కొండా సురేఖకు ఇప్పటికే ప్రజాశాంతి పార్టీ అందుబాటులో ఉందని, వేరే పార్టీలోకి వెళ్లకుండా ప్రజాశాంతి పార్టీలో చేరాలని ఆయన సూచించారు. బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే ప్రజాశాంతి పార్టీ ఒక్కటే మార్గమని కేఏ పాల్ వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ పార్టీలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకుల పదవులకు ఎలాంటి ప్రమాదం ఉండదని, కేవలం బీసీ నాయకుల పదవులకే ముప్పు ఏర్పడుతోందని ఆయన ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో బీసీ నాయకులు, బడుగు బలహీన వర్గాల నేతలు రాజకీయంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కొండా సురేఖలాంటి నాయకులు ప్రజాశాంతి పార్టీలోకి వస్తే బడుగు బలహీన వర్గాల తరఫున మరింత బలంగా పోరాడేందుకు అవకాశం ఉంటుందని కేఏ పాల్ తెలిపారు.
ప్రస్తుతం కొండా సురేఖ రాజకీయ భవిష్యత్‌పై ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో కేఏ పాల్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. సురేఖ కాంగ్రెస్‌లోనే కొనసాగుతారా? పార్టీకి రాజీనామా చేస్తారా? లేక ఇతర రాజకీయ ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తారా? అనే చర్చ జరుగుతున్న సమయంలో ప్రజాశాంతి పార్టీ నుంచి వచ్చిన ఈ ఆహ్వానం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే సురేఖ వైపు నుంచి దీనిపై ఎలాంటి స్పందన వెలువడాల్సి ఉంది.

