సురేఖను పట్టించుకోని అధిష్ఠానం
ముక్తసరిగా మూడు ముక్కల్లో ఖర్గేతో మచ్చట
అపాయింట్ మెంట్ ఇవ్వని కేసీ వేణుగోపాల్
ఏఐసీసీ కార్యాలయంలోనే రోజంతా పడిగాపులు
నిరాశతో వెనుతిరిగిన మంత్రి కొండా సురేఖ
ఖర్గే, కేసీలతో రేవంత్ రెడ్డి వేర్వేరుగా భేటీలు
సురేఖ వ్యవహారాన్ని అంతర్గతంగా చూడొద్దని వినతి
తెలంగాణ కాంగ్రెస్‌లో నెలకొన్న అంతర్గత విభేదాలు ఢిల్లీని తాకాయి. మంత్రి కొండా సురేఖకు కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లభించలేదు. పార్టీ అగ్రనేతలతో భేటీ కోసం ఢిల్లీ వెళ్లిన ఆమెకు పడిగాపులు తప్పలేదు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సురేఖ భేటీ ముక్తసరిగా, మూడు ముక్కల్లోనే ముగిసింది. మరోవైపు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడంతో ఆమె ఏఐసీసీ కార్యాలయంలోనే చాలాసేపు వేచి చూడాల్సి వచ్చింది.
తెలంగాణ కాంగ్రెస్‌లో కొంతకాలంగా కొనసాగుతున్న అంతర్గత విభేదాల నేపథ్యంలో సురేఖ ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై ఆమె కూతురు సుస్మిత చేసిన వ్యాఖ్యలు, వాటిపై పార్టీలో వ్యక్తమైన అసంతృప్తి, తన వాదనను అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే మంత్రి కొండా సురేఖ ఢిల్లీకి వెళ్లారు. అయితే అధిష్ఠానం ఆమెను సీరియస్ గా తీసుకోలేదు. పార్టీ పెద్దల నుంచి తగినంత సమయం లభించకపోవడం ఆమెకు నిరాశ కలిగించింది.
ఖర్గేతో జరిగిన సమావేశంలో సురేఖ తనకు ఎదురవుతున్న రాజకీయ పరిస్థితులను వివరించేందుకు ప్రయత్నించినప్పటికీ, ఖర్గే పెద్దగా ఆసక్తి చూపకపోగా, పీసీసీ స్థాయిలోనే చూసుకోండని చెప్పినట్లు తెలిసింది.
ఇదే సమయంలో కేసీ వేణుగోపాల్‌ను కలిసేందుకు సురేఖ ప్రయత్నించినప్పటికీ అపాయింట్‌మెంట్ దక్కలేదు. దీంతో ఏఐసీసీ కార్యాలయంలోనే ఆమె రోజంతా వేచి చూశారు. చివరకు నిరాశతో వెనుదిరిగినట్లు తెలుస్తోంది.
ఈ పరిణామాలు సురేఖను దాదాపు పార్టీ నుంచి పక్కన పెట్టినట్లేనని, మంత్రి పదవికి ఉద్వాసన తప్పదన్న సంకేతాలేనని పార్టీలోని వారే తేల్చేస్తున్నారు. ఆమె అనుచరులు సైతం కొండా సురేఖపై వేటు తప్పదని, అలా జరిగితే, ఆమె బీజేపీవైపునకు మొగ్గవచ్చన్న సంకేతాలిస్తున్నారు. అలా జరిగితే, తాము మాత్రం కాంగ్రెస్ తోనే ఉంటామని కూడా కొందరు చెబుతున్నారు.
ఇదిలావుంటే, సురేఖ డిల్లీలో కొద్దిసేపు మీడియాతో చిట్ చాట్ చేశారు. అందులోనూ ఏ మాత్రం తగ్గకపోవడం పలువురిని ఆశ్చర్య పరచింది. ‘క్రమశిక్షణ చర్యలు, షోకాజ్ నోటీసులు.. సీఎం నుంచే మొదలు పెడదాం. ఎమ్మెల్యే టికెట్లను ఎలా ప్రకటిస్తారు? పదేళ్ళు నేనే సీఎం అని ఎలా అంటారు? భట్టి భార్య వసూళ్ళు? పొంగులేటి దౌర్జన్యాల మాటేమిటి? పీసీసీని 50 కోట్లకు కొన్నారన్న కోమటిరెడ్డి మాటేమిటి? నా బిడ్డ ఆవేదనలోతప్పే లేదు. ప్రశ్నిస్తే షో కాజా? నన్ను ముట్టుకుంటే కాంగ్రెస్ కు తీవ్ర నష్టం. రాజీనామా చేయాలని నన్నెవరూ కోరలేదు. నిజాలు బయట పెడతారనే నా ఓఎస్డీ అరెస్టు. బీసీలంటే అలుసా? బీసీని కాబట్టే నాపై ఇన్ని కుట్రలు’ చేస్తున్నారనే వ్యాఖ్యలు చేశారు.
కొండా సురేఖలో పశ్చాత్తాపమే కనిపించకపోవడం, అధిష్ఠానం ఆసక్తి కనబరచకపోవడాన్ని బట్టి కొండా సురేఖ కాంగ్రెస్ తో ప్రయాణం దాదాపు పూర్తయినట్లుగానే భావించాల్సి వస్తున్నది.
ఇదిలావుంటే, సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలతో వరుసగా భేటీ కావడం. మల్లికార్జున ఖర్గేతో, అనంతరం కేసీ వేణుగోపాల్‌తో వేర్వేరుగా సమావేశమై తెలంగాణలోని తాజా రాజకీయ పరిణామాలను వివరించినట్లు సమాచారం. ముఖ్యంగా సురేఖ వ్యవహారాన్ని వ్యక్తిగత లేదా అంతర్గత వివాదంగా చూడకుండా, పార్టీ క్రమశిక్షణకు సంబంధించిన అంశంగా పరిగణించాలని రేవంత్‌రెడ్డి అధిష్ఠానం పెద్దలను కోరినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, సురేఖపై అధిష్ఠానం తుది నిర్ణయం మాత్రం వెలువడలేదు.

