ధరల పెరుగుదల కేవలం ఆర్థిక సమస్య మాత్రమే కాదు. అది సామాజిక సమస్య కూడా. నెల ఆదాయం పెరగకుండానే నెలవారీ ఖర్చు పెరిగితే మధ్యతరగతి పొదుపులు కరిగిపోతాయి. పేద కుటుంబాలు పోషకాహారం, విద్య, వైద్యం వంటి అవసరాలపై కోత పెట్టాల్సి వస్తుంది. అందుకే పాలకులకు ప్రజల అసలు పరీక్ష ఎన్నికల ప్రచారం కాదు. ప్రజల వంటిల్లే! ధరాఘాతాన్ని గుర్తించి, పరిష్కారాలను అమలు చేసే వరకు పాలన పూర్తి అయినట్టుకాదు. ప్రజలు కూడా ఇకపై హామీలకే కాకుండా తమ జీవన వ్యయాన్ని తగ్గించడంలో ఎవరు నిజంగా పనిచేశారో చూసి ప్రజాప్రతినిధులను ప్రశ్నించాలి.
డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్
నిత్యావసర ధరల పెరుగుదలలు ప్రజల జీవితాలను నేరుగా ప్రభావితం చేస్తాయి. అయితే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రాధాన్యతల్లో మాత్రం నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు తగిన గుర్తింపు కనిపించడం లేదు. ఎన్నికలు సమీపిస్తే సంక్షేమ పథకాలు, ఉచిత హామీలు, రాజకీయ వ్యూహాలపై ఊక దంపుడు నేతలు, సామాన్యుడి వంటింటి బడ్జెట్‌పై పడుతున్న భారాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రతిపక్షాలు కూడా ప్రజా సమస్యల కంటే రాజకీయ ఆరోపణలు, ఆందోళనలకే పరిమితమవుతున్నాయి. ఫలితంగా ధరల భారం నిశ్శబ్దంగా కుటుంబాల ఆదాయాన్ని కబళిస్తోంది.
ప్రభుత్వ గణాంకాలే పరిస్థితి తీవ్రతను సూచిస్తున్నాయి. 2026 జూలైలో దేశ రిటైల్ ద్రవ్యోల్బణం 4.45 శాతంగా నమోదైంది. జూన్‌లో ఇది 4.38 శాతం. మరింత ఆందోళన కలిగించే విషయం ఆహార ద్రవ్యోల్బణం 5.52 శాతానికి చేరడం. గ్రామీణ ప్రాంతాల్లో ఆహార ద్రవ్యోల్బణం 5.79 శాతంగా ఉండగా, పట్టణాల్లో 5.05 శాతంగా నమోదైంది. అంటే సగటు ద్రవ్యోల్బణం కంటే ఆహార ధరల భారం ఎక్కువగా ఉందన్నమాట.
వంటింటి పరిస్థితి చూస్తే ఈ గణాంకాల వెనుక ఉన్న వాస్తవం మరింత స్పష్టమవుతుంది. బియ్యం, పప్పులు, నూనెలు, చక్కెర, కూరగాయలు, మసాలా దినుసులు ఒక్కొక్కటిగా ఖరీదవుతున్నాయి. ముఖ్యంగా వెల్లుల్లి ధరల్లో భారీ పెరుగుదల నమోదైంది. జూలైలో వెల్లుల్లి ద్రవ్యోల్బణం (క్రమంగా ధరలు పెరగడం) 35.36 శాతానికి చేరగా, ఉల్లిపాయ ద్రవ్యోల్బణం 22.54 శాతంగా నమోదైంది. అల్లం ధరల పెరుగుదల ఏకంగా 83.62 శాతంగా నమోదైనట్లు అధికారిక గణాంకాల ఆధారిత నివేదికలు వెల్లడిస్తున్నాయి.
ఏపీ, తెలంగాణలోనూ పరిస్థితి భిన్నంగా ఏమీ లేదు. సన్నబియ్యం, కూరగాయలు, పండ్లు, పూలు, పూజా సామగ్రి వంటి వాటి ధరలు వినియోగదారులను ఇబ్బంది పెడుతున్నాయి. నిజానికి ఉత్పత్తి, నిల్వలు, రవాణా, మార్కెట్ డిమాండ్ వంటి అంశాలపై ప్రభుత్వాలకు ముందస్తు సమాచారం ఉండదా? ఒక వస్తువు ధర ఒక్కసారిగా పెరిగిన తర్వాత కారణాలను వెతకడం కంటే, ధర పెరగకముందే సరఫరా వ్యవస్థను పర్యవేక్షించడం ప్రభుత్వ బాధ్యత కాదా?
బియ్యం విషయంలో ఇది మరింత స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణలో ధాన్యం సేకరణ భారీ స్థాయిలో జరుగుతోంది. 2026లో రాష్ట్ర ప్రభుత్వం యాసంగి సీజన్‌కు 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తిని అంచనా వేసి, 30 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్‌ను కేంద్రానికి సేకరించాలని కోరింది. అంతకుముందు 2025-26 వానాకాలంలో అనుమతించిన పరిమాణానికి అదనంగా 18 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇంతటి భారీ సేకరణ జరుగుతున్నప్పుడు మార్కెట్‌లో కొన్ని రకాల బియ్యం ధరలు ఎందుకు ఎగబాకుతున్నాయో ప్రభుత్వాలు సమగ్రంగా పరిశీలించాలి.
తెలంగాణ పౌరసరఫరాల శాఖకు ధరల పర్యవేక్షణ, బ్లాక్‌మార్కెటింగ్‌ను అరికట్టడం, అవసరమైతే మార్కెట్‌లో జోక్యం చేసుకోవడం వంటి బాధ్యతలు అధికారికంగానే ఉన్నాయి. ధరల పర్యవేక్షణ కోసం జిల్లా స్థాయిలో ధరల పర్యవేక్షణ కమిటీలు కూడా ఉన్నాయి. మరి ధరలు పెరుగుతున్న సమయంలో ఈ వ్యవస్థలు ఎంత సమర్థంగా పనిచేస్తున్నాయన్నదే ప్రశ్న.
ఇల్లు నిర్మించుకునే వారి పరిస్థితి కూడా దయనీయంగా మారుతోంది. సిమెంట్, స్టీల్, ఇసుక, ఇటుకల ధరలు పెరగడంతో నిర్మాణ వ్యయం పెరుగుతోంది. మరోవైపు వైద్యం, మందులు, విద్య, రవాణా వంటి ఖర్చులు కుటుంబ బడ్జెట్‌ను మరింత ఒత్తిడికి గురిచేస్తున్నాయి. అధికారిక గణాంకాల్లో జూలైలో రవాణా విభాగం ద్రవ్యోల్బణం 4.43 శాతంగా, విద్యా సేవల ద్రవ్యోల్బణం 3.64 శాతంగా నమోదైంది. రెస్టారెంట్లు, వసతి సేవల ద్రవ్యోల్బణం 7.72 శాతంగా ఉండటం కూడా వినియోగ వ్యయాలపై పెరుగుతున్న ఒత్తిడిని సూచిస్తోంది.
ప్రభుత్వాలు ఉచిత పథకాలను ప్రకటించడం తప్పు కాదు. పేదలకు రక్షణ కల్పించే సంక్షేమం అవసరమే. కానీ ఒక చేత్తో ప్రయోజనం ఇచ్చి మరో చేత్తో నిత్యావసరాల ధరల ద్వారా కుటుంబాలపై అదనపు భారం మోపితే ఆ సంక్షేమం అసంపూర్ణమే. ధరల నియంత్రణను కూడా ఒక సంక్షేమ కార్యక్రమంగానే చూడాలి.
ప్రభుత్వాలు వెంటనే సమగ్ర ధరల సమీక్ష చేపట్టాలి. ప్రతి జిల్లాలో నిత్యావసర వస్తువుల రోజువారీ ధరలను డిజిటల్ విధానంలో పర్యవేక్షించాలి. పంటల ఉత్పత్తి అంచనాలు, నిల్వలు, రవాణా, మార్కెట్ డిమాండ్‌పై సమగ్ర డేటాబేస్ రూపొందించాలి. కృత్రిమ కొరత సృష్టించే దళారులు, అక్రమ నిల్వదారులు, బ్లాక్‌మార్కెటీర్లపై కఠిన చర్యలు తీసుకోవాలి. అవసరమైన చోట బఫర్ స్టాక్‌లను విడుదల చేసి మార్కెట్‌లో జోక్యం చేసుకోవాలి.
ప్రతిపక్షాల బాధ్యత కూడా అంతే ముఖ్యమైనది. ప్రభుత్వాన్ని అదేపనిగా తప్పు పట్టే రాజకీయ వ్యూహాల కంటే ప్రజల వంటింటి సమస్యలపై నిలదీయడం ప్రజలకు మరింత ఉపయోగకరం. పార్లమెంట్, శాసనసభల్లో ధరల పెరుగుదలపై చర్చ జరగాలి. ప్రజా ప్రతినిధులు ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజలను కలవకుండా, నిరంతరం వారి సమస్యలను వినాలి.
ధరల పెరుగుదల కేవలం ఆర్థిక సమస్య మాత్రమే కాదు. అది సామాజిక సమస్య కూడా. నెల ఆదాయం పెరగకుండానే నెలవారీ ఖర్చు పెరిగితే మధ్యతరగతి పొదుపులు కరిగిపోతాయి. పేద కుటుంబాలు పోషకాహారం, విద్య, వైద్యం వంటి అవసరాలపై కోత పెట్టాల్సి వస్తుంది. అందుకే పాలకులకు ప్రజల అసలు పరీక్ష ఎన్నికల ప్రచారంలో కాదు. ప్రజల వంటింట్లో ఉంది. ధరాఘాతాన్ని గుర్తించి, కారణాలను విశ్లేషించి, పరిష్కారాలను అమలు చేసే వరకు పాలన పూర్తి అయినట్టుకాదు. ప్రజలు కూడా ఇకపై హామీలకే కాకుండా తమ జీవన వ్యయాన్ని తగ్గించడంలో ఎవరు నిజంగా పనిచేశారో చూసి ప్రజాప్రతినిధులను ప్రశ్నించాలి.

