Monday, May 18, 2026
34.2 C
Hyderabad

‘ట్రంప’రితనపు కుంపటి- ఆర్థిక సంక్షోభం!|EDITORIAL

ట్రంప్ టెంపరితనం, దుందుడుకు దూకుడు, అగ్రరాజ్య ఆధిపత్యపు పైత్యం మొత్తం భూమండలాన్నే ఆర్థిక సంక్షోభంలోకి నెట్టాయి. ప్రపంచాన్ని నడిపే చమురే ఇప్పుడా ప్రపంచ చమురును తీస్తున్నది. అన్ని రంగాలపై పడిన ప్రభావం అందరి ఉసురు తీస్తున్నది. మధ్య, దిగువ తరగతి ప్రజలే అధికంగా ఈ ప్రభావం బారిన పడుతున్నారు. ఐటీ రంగం కుదేలైంది. కొత్త ఉద్యోగాల సంగతి దేవుడెరుగు? ఉన్న ఉద్యోగాలే ఊడుతున్నాయి. ధరలు పెరిగి, ధరణి సంక్షోభంలో కూరుకుపోయింది.

డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మళ్లీ ప్రపంచాన్ని ఆందోళనలోకి నెట్టాయి. అమెరికా–ఇరాన్ ఘర్షణలు కేవలం యుద్ధానికే పరిమితం కాలేదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కూడా తీవ్ర సంక్షోభంలోకి నెట్టాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దూకుడు నిర్ణయాలు అంతర్జాతీయ చమురు మార్కెట్‌ను అస్థిరం చేశాయి. ఇరాన్‌పై దాడులు, ప్రతిదాడుల హెచ్చరికలు, హార్ముజ్ జలసంధి చుట్టూ నెలకొన్న ఉద్రిక్తతలతో ముడి చమురు ధరలు ఎగసిపడుతున్నాయి. ప్రపంచ చమురు రవాణాలో 20 శాతం హార్ముజ్ జలసంధి ద్వారానే జరుగుతుండటంతో అక్కడి పరిస్థితులు మారితే దాని ప్రభావం నేరుగా భారత్ సహా అన్ని ప్రపంచ దేశాలపైనా పడుతోంది.

భారత్ తనకు అవసరమైన ముడి చమురులో 85 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ ముడి చమురు ధర 10 డాలర్లు పెరిగితే భారత దిగుమతి వ్యయం వేల కోట్ల రూపాయల మేర పెరుగుతుంది. ఫలితంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయి. ఇంధన ధరల పెరుగుదల కేవలం వాహనదారుల సమస్య మాత్రమే కాదు. రవాణా ఖర్చులు పెరగడం ద్వారా నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతాయి. నిత్యావసరాల నుంచి నిర్మాణ సామగ్రి వరకు అన్నింటిపై దాని ప్రభావం పడుతుంది. ఇప్పటికే విమానయాన రంగం అధిక ఇంధన వ్యయంతో సంక్షోభంలో ఉంది.

రానున్న రోజుల్లో విమాన టికెట్ల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో దేశీయంగా ఇంధన వినియోగాన్ని తగ్గించే మార్గాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోదీ ప్రోత్సహిస్తున్న “వర్క్ ఫ్రమ్ హోమ్” విధానం మళ్లీ చర్చకు వచ్చింది. ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు, పుణే వంటి ఐటీ నగరాల్లో దీని ప్రభావం గణనీయంగా ఉండొచ్చని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు.

హైదరాబాద్‌లో ప్రస్తుతం 9 లక్షల మంది ఐటీ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో చాలామంది ప్రతిరోజూ సగటున 40 నుంచి 50 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తున్నారు. ట్రాఫిక్ రద్దీ, ఇంధన వినియోగం, కాలుష్యం కలిసి నగర జీవనాన్ని భారంగా మారుస్తున్నాయి. నిపుణుల అంచనాల ప్రకారం, ఈ ఉద్యోగుల్లో కనీసం 50 శాతం మంది వారానికి మూడు రోజులు ఇంటి నుంచే పని చేసినా నెలకు రూ.140 కోట్ల విలువైన ఇంధనం ఆదా కావచ్చు. దేశవ్యాప్తంగా ఐటీ హబ్‌లను కలిపి చూస్తే ఈ ఆదా వేల కోట్ల రూపాయలకు చేరుకునే అవకాశం ఉంది.

కరోనా కాలంలో వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం విజయవంతంగా అమలైంది. ఉద్యోగులు ఇంటి నుంచే పని చేసి కంపెనీల కార్యకలాపాలను కొనసాగించారు. అయితే ప్రస్తుతం చాలా ఐటీ సంస్థలు పూర్తిస్థాయి వర్క్ ఫ్రమ్ హోమ్‌కు ఆసక్తి చూపడం లేదు. కార్యాలయ సంస్కృతి, జట్టు సమన్వయం, డేటా భద్రత, ఉత్పాదకత వంటి అంశాలను కంపెనీలు కారణాలుగా చెబుతున్నాయి. కొన్ని సంస్థలు హైబ్రిడ్ విధానానికే పరిమితమవుతున్నాయి. అయినప్పటికీ దేశ ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాల్సిన అవసరం ఉంది.

ఇంధన సంక్షోభం మధ్య మరో పెద్ద దెబ్బ ఐటీ రంగానికే తగులుతోంది. ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ కంపెనీలు ఉద్యోగాల కోతల దిశగా అడుగులు వేస్తున్నాయి. ఓరాకిల్ ఇటీవల ప్రపంచవ్యాప్తంగా వేలాది ఉద్యోగులను తొలగించడమే కాకుండా, భారత ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలల్లో ఇచ్చిన కొన్ని క్యాంపస్ ఆఫర్లను కూడా వెనక్కి తీసుకుంది. ఐఐటీ విద్యార్థులు ఈ నిర్ణయంతో తీవ్ర అనిశ్చితిలో పడ్డారు. ఎందుకంటే చాలా కళాశాలల్లో “ఒక విద్యార్థికి ఒకే ఉద్యోగం” విధానం అమల్లో ఉంది. ఒక కంపెనీ ఆఫర్ పొందిన విద్యార్థి ఇతర అవకాశాలను వదులుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ ఆఫర్లు రద్దవడంతో వారు మళ్లీ ఉద్యోగాల కోసం తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇక సిస్కో, లింక్డ్ ఇన వంటి సంస్థలు కూడా భారీ స్థాయిలో ఉద్యోగుల సంఖ్యను తగ్గించే ప్రయత్నాల్లో ఉన్నాయి. కంపెనీలు ఇప్పుడు సంప్రదాయ ఉద్యోగాల కంటే కృత్రిమ మేధస్సు, ఆటోమేషన్, క్లౌడ్ టెక్నాలజీలపై పెట్టుబడులను మళ్లిస్తున్నాయి. ఫలితంగా సాధారణ సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల భవిష్యత్తుపై ఆందోళనలు పెరుగుతున్నాయి.

ఇలాంటి సమయంలో ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయడం, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడం, ప్రజా రవాణాను బలోపేతం చేయడం, చమురు దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడం అత్యవసరం. అదే సమయంలో ప్రజాప్రతినిధుల వ్యయ నియంత్రణ, ప్రభుత్వ దుబారా తగ్గింపు వంటి అంశాలపై పొదుపు నిర్ణయాలు జరగాలి.

ప్రపంచ రాజకీయాల్లో ఏర్పడుతున్న ప్రతి ఉద్రిక్తత భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అంతర్జాతీయ సంక్షోభాలను పూర్తిగా అడ్డుకోవడం మన చేతుల్లో లేకపోయినా, వాటి ప్రభావాన్ని తగ్గించే దిశగా ముందస్తు చర్యలు తీసుకోవడం మాత్రం ప్రభుత్వ బాధ్యత. లేదంటే ట్రంప్ రగిలించిన ఈ కుంపటి ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే కాకుండా, భారత సామాన్యుడి జీవితాన్నీ మరింత భారంగా మార్చే ప్రమాదం ఉంది.

Latest News

గీ అవ్వ ధైర్యాన్ని మెచ్చుకోవాలె పో!?|ADUGU TRENDS

గీమె ధైర్యానికి మెచ్చుకోవాలె. ఇద్దరి దొంగలతో తలపడి, కొట్లాడి తన సంక సంచిని గా దొంగల శేతికి శిక్కకుండ కాపాడుకుంది. పానాలను గూడ దక్కించుకుంది. గదెట్లనో సూడుండ్రి. శీకటి పడ్డది. బాగా రాత్రైంది. గా...

జాతీయ ఆర్థిక అత్యవసర పరిస్థితి తప్పదా?!|EDITORIAL

దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడం కోసం ఇప్పుడు తీసుకునే నిర్ణయాలే భవిష్యత్తును నిర్ణయిస్తాయి. కేవలం రాజకీయ విజయాలు, విమర్శలతో దేశం ముందుకు సాగదు. బలమైన ఆర్థిక వ్యవస్థే నిజమైన జాతీయ శక్తి. పరిస్థితి...

ఈ రోజు/ వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

మే 17 నుండి మే 23 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. ఉద్యోగంలో మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. కుటుంబ...

సల్లసల్లగ కూల్ కూల్గ రూఫ్ టాప్!?|ADUGU TRENDS

ఎండా కాలం ఒచ్చిందంటే సాలు.. సల్లదనమిచ్చే కూలర్లు, ఏసీలకు పరుగులు పెడ్తం కనీ, గా ఇంటినే సల్ల సల్లగుండేటట్లు కట్టకుందామని అనుకోం. ఇగిప్పుడైతే టాపులపై కూల్ పెయింట్లు, సీలింగ్ అసొంటియే శేత్తానం. కనీ,...

16-05-2026 శనివారం| RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--కృష్ణపక్షం శని జయంతి తిధి బ అమావాస్య రాత్రి 01.52 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం భరణి సాయంత్రం 05.32 వరకు ఉపరి కృత్తిక యోగం సౌభాగ్య ఉదయం 10.15 వరకు ఉపరి శోభ కరణం చతుస్పాద...

కిటికీలకు స్లైడింగ్ తెరలు!?|ADUGU TRENDS

ఇల్లంటే సల్లంగుండాలె. ఎటు గాలి గటే పోవాలె. గట్లని కోతులు, పిట్టలు, పశుపచ్చాదులతోటి పరేషాన్లుండొద్దు. ఇగ గిట్ల నిమ్మలంగుండాలంటే, ఇల్లెట్ల కట్టుకోవాలె? ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలె! గసొంటిదే గీ కిటికీలకు స్లైడింగ్ తెరలు....

కాన్వాయ్‌లు కాదు, రాజకీయ దుబారాలు!|EDITORIAL

ప్రజల జీవితాలను కష్టాల్లోకి నెట్టడం పొదుపు కాదు. ప్రభుత్వ వ్యవస్థల్లో ఉన్న వ్యర్థ వ్యయాలను తగ్గించడం. ప్రజలు త్యాగాలు చేయాలని కోరే నాయకులు ముందుగా తమ ఉచిత సదుపాయాలు, అలవెన్సులు, విలాసాలను తగ్గించుకోవాలి....

15-05-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--కృష్ణపక్షం మాస శివరాత్రి తిధి బ త్రయోదశి ఉదయం 06.00 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం అశ్విని సాయంత్రం 06.51 వరకు ఉపరి భరణి యోగం ఆయుష్మాన్ మధ్యాహ్నం 12.58 వరకు ఉపరి సౌభాగ్య కరణం వణజి...

కరెంటు తీగల మద్దెలనే ఇల్లు!?|ADUGU TRENDS

కాని కట్టాలు రానీ, కరెంటు తీగలుంటే, గవాటి కింద మనం ఇల్లే కట్టం. గా ఆలోశెన కూడా శేయం. కనీ, గీ అన్న కరెంటు తీగల మద్దెలనే ఇల్లు కట్టిండు! గీ అన్న...

‘నీట్’ గా విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం!|EDITORIAL

పరీక్షల నిర్వహణలో ఇలాంటి వైఫల్యాలు చోటుచేసుకోవడం కేవలం పరిపాలనా నిర్లక్ష్యం కాదు. ఇది విద్యార్థుల భవిష్యత్తుతో ప్రమాదకరమైన ఆటాడుకోవడమే. నీట్ పేపర్ లీక్ మాఫియాను పూర్తిగా అరికట్టేందుకు కఠిన చట్టాలు తేవాలి. ఎన్‌టిఏ...

14-05-2026 గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--కృష్ణపక్షం తిధి బ ద్వాదశి ఉదయం 07.39 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం రేవతి రాత్రి 07.55 వరకు ఉపరి అశ్విని యోగం ప్రీతి మధ్యాహ్నం 03.25 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం తైతుల ఉదయం...

ఒక శెట్టుకు 234 రకాల మామిడి పండ్లు!?|ADUGU TRENDS

గిదేం ఇచ్చెంత్రం అని ఆశీరపోతుండ్రా!? నిజంగా ఇది నిజమేనుల్లా! గీ శెట్టుకు 234 రకాల మామిడి పండ్లు కాసినయి. గా శెట్టు దగ్గర నిల్సోని సాక్షాత్తు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహానే...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News