ఎన్నికలు కేవలం అధికార మార్పిడికి ప్రక్రియ మాత్రమే కాదు. అవి ప్రజల ఆశలు, ఆకాంక్షలు, సంతృప్తులు, అసంతృప్తుల ప్రతిబింబం. దేశంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే, దేశవ్యాప్తంగా ఓటర్లు స్పష్టంగా మార్పును కోరుకున్నారని అర్థమవుతుంది. పశ్చిమ బెంగాల్, అసోం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో అధికార పార్టీలు గెలిచినా, కేరళం, తమిళనాడు వంటి మరికొన్ని రాష్ట్రాల్లో గట్టి ప్రతిస్పందన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో, అధిక రాష్ట్రాల్లో అధికారాన్ని సంపాదించిన పార్టీలు, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ, తమకు అధికారం ఇవ్వని రాష్ట్రాల ప్రజల ఆశలను నెరవేర్చే దిశగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
ప్రస్తుతం దేశంలో 20కి పైగా రాష్ట్రాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా బీజేపీ ప్రభావం ఉంది. ఇది దాదాపు 70-75 శాతం రాష్ట్రాలపై ప్రభావం చూపుతున్నట్లే. ఈ స్థాయి రాజకీయ ఆధిపత్యం ఒకవైపు శక్తివంతమైన అవకాశమైతే, మరోవైపు బాధ్యతలను మరింత పెంచుతుంది. కేవలం ఎన్నికల విజయాలతో సరిపెట్టుకోకుండా, ప్రజల జీవన ప్రమాణాల్లో స్పష్టమైన మార్పు తీసుకురావడం అత్యవసరం.
దేశంలో విద్య, వైద్యం, ఉపాధి వంటి రంగాలు ఇప్పటికీ సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. జాతీయ స్థాయిలో నిరుద్యోగం రేటు 6-8 శాతానికి పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇది మరింత తీవ్రమైన సమస్యగా ఉంది. ప్రభుత్వ దవాఖానాల్లో, పాఠశాలల్లో మౌలిక వసతుల కొరత తీవ్రంగా ఉన్నాయి. ఈ రంగాల్లో కనీసం జీడీపీకి 6 శాతం విద్యకు, 3 శాతం వైద్యానికి కేటాయించాలన్న నిపుణుల సూచనలు చాలా కాలంగా ఉన్నప్పటికీ, అమలు మాత్రం పరిమితంగానే ఉంది.
అభివృద్ధి అంటే కేవలం మౌలిక సదుపాయాలు మాత్రమే కాదు. సామాజిక న్యాయం కూడా. పన్నుల రూపంలో ప్రజల నుంచి వచ్చే ఆదాయం సక్రమంగా వినియోగించబడాలి. ఉచిత పథకాలపై అధికంగా ఆధారపడకుండా, దీర్ఘకాలిక ప్రయోజనాలు అందించే ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలి. ఉదాహరణకు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు మద్దతు, వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం వంటి చర్యలు ఉపాధి అవకాశాలను పెంచగలవు.
భద్రతా అంశాలు కూడా కీలకం. సరిహద్దు ప్రాంతాల్లో అక్రమ ప్రవేశం, భద్రతా సవాళ్లు వంటి సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. అయితే, ఈ సమస్యలను పరిష్కరించే క్రమంలో చట్టపరమైన ప్రక్రియలను కచ్చితంగా అనుసరించడం అవసరం. వ్యక్తుల హక్కులను గౌరవిస్తూనే, దేశ భద్రతను కాపాడే సమతుల విధానం అవసరం. చర్యలేవైనా అవి రాజ్యాంగబద్ధంగా, పారదర్శకంగా ఉండాలి.
రాజకీయంగా చూస్తే, కొన్ని రాష్ట్రాల్లో ప్రజలు సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న పాలనకు వ్యతిరేకంగా ఓటు వేశారు. ఇది ప్రజాస్వామ్య బలాన్ని సూచిస్తుంది. ఓటర్లు తమ అసంతృప్తిని ఓటు రూపంలో వ్యక్తపరచగలుగుతున్నారంటే, అది రాజ్యాంగ వ్యవస్థపై నమ్మకాన్ని పెంచుతుంది. అదే సమయంలో, కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం చాలా ముఖ్యం.
పాలనలో పారదర్శకత, అవినీతి నియంత్రణ, వేగవంతమైన నిర్ణయాలు ప్రభుత్వాలపై ప్రజలు పెట్టుకున్న ప్రధాన అంచనాలు. డిజిటల్ సాంకేతికతను వినియోగించి సేవలను ప్రజలకు చేరువ చేయడం, ప్రభుత్వ వ్యవస్థలను సులభతరం చేయడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చు. ఇప్పటికే కొన్ని రంగాల్లో పురోగతి కనిపిస్తున్నప్పటికీ, అది సమగ్రంగా అన్ని రాష్ట్రాలకు విస్తరించాలి.
ప్రజలు ఓటు వేసినందుకు గర్వపడే పరిస్థితి ఏర్పడాలి. “మనం ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం కాబట్టి మన జీవితాల్లో మార్పు వచ్చింది” అని చెప్పగలిగే స్థాయి పాలన అవసరం. అది సాధ్యమవ్వాలంటే రాజకీయ సంకల్పం, పరిపాలనా సామర్థ్యం, ప్రజల భాగస్వామ్యం కీలకంగా కలిసి పనిచేయాలి. అధికారం పొందడం కంటే, ప్రజల ఆశలను నెరవేర్చడం అసలు పరీక్ష. ఆ పరీక్షలో విజయవంతమవ్వగలిగితేనే ప్రజాస్వామ్యం మరింత బలపడుతుంది.

