ఘనంగా స్వాగతం పలికిన సోమనాథ కళాపీఠం
కవి, పండితులు పల్లేర్ల రామ మోహన్ రావు నేతృత్వంలో పాలమూరు జిల్లాకు చెందిన 23 మంది తెలుగు పండితులు, కవులు, రచయితలు, రచయిత్రులు కలిసి ఒక ప్రత్యేక బస్సును ఏర్పాటు చేసుకుని తెలంగాణలో సాహితీ యాత్రను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం ఆ బ్రుందం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు చారిత్రక, అధ్యాత్మిక, సాహిత్య కవులు పుట్టిన ప్రాంతాలను సందర్శించింది. ఆయా ప్రాంతాల ప్రాముఖ్యాలను, ప్రాధాన్యతలను అధ్యయనం చేసింది. అలాగే తెలుగు మహాకవుల పుణ్యభూమి, తెలంగాణ ఆదికవి సోమనాథుడు, సహజకవి బమ్మెర పోతనల పుట్టినిల్లు పాలకుర్తి ప్రాంతానికి సాహితీ యాత్ర చేరుకోగా, వారికి సోమనాథ కళా పీఠం అధ్యక్షుడు డా. రాపోలు సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు, అడుగు చీఫ్ ఎడిటర్ డా. మార్గం లక్ష్మీ నారాయణలు ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా తెలుగు పండితులు పల్లేర్ల రామ మోహన్ రావు మాట్లాడుతూ, ఈ సాహితీ యాత్ర ఉమ్మడి వరంగల్ జిల్లాతో ప్రారంభించామని, ఇప్పటి వరకు హన్మకొండలోని కాళోజీ, మడికొండలోని వానమామై వరదాచార్యులు, ధర్మసాగర్ మండలం దేవునూరు లోని బిరుదరాజు రామరాజు, చిన్నగూడూరులోని దాశరథి సోదరుల జన్మస్థలాలను సందర్శించి పుష్పాంజలి ఘటించామన్నారు. అలాగే హన్మకొండలోని చారిత్రాత్మక రాజరాజనరేంద్ర గ్రంథాలయం, రాయప్రోలు సుబ్బారావు ప్రిన్సిపాల్ గా పని చేసిన హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలను సందర్శించి, వారి చరిత్రను తెలుసుకుని, వారి రచనలను చదివి వినిపించాం అన్నారు. ప్రత్యేకంగా చిన్నగూడూరులో దాశరథి సోదరుల పద్యాలు, పాటలు పాడుతూ ఊరేగింపు నిర్వహించామన్నారు. ఆయా చోట్ల ఆయా కవుల శిష్యప్రశిష్యులను కలిసి చర్చించి, తరించామని వివరించారు. తెలంగాణ ఆదికవి పాల్కురికి సోమనాథుడు, బమ్మెర పోతన ల జన్మ స్థలాలకు రావడం చాలా సంతోషంగా ఉందని, శుక్రవారం పాలకుర్తిలో దైవదర్శనం చేసుకుని, సోమనాథ స్మారక స్థలం, బమ్మెరలో పోతన స్మారక స్థలం, వల్మీడిలో వాల్మీక స్మారక స్థలం, గూడూరు శాసనాలను సందర్శిస్తామని ఆయన చెప్పారు. అలాగే ఆయా చోట్ల వారి రచనలను చదువుతాం అని వివరించారు. పాలకుర్తిలో సాహిత్య సమావేశం కూడా నిర్వహిస్తామని తెలిపారు. చరిత్రకారులు, సాహితీవేత్తలు, సాహిత్యాభిలాషులంతా తమతో కలిసి రావాలని అభిలషిస్తున్నామని తమ ఆకాంక్షను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డా. శంకరమంచి శ్యాంప్రసాద్, దేవగిరి రామన్న శివాచార్య, సునిల్ శివాచార్య తదితరులు పాల్గొన్నారు.

