తెలంగాణ రాష్ట్ర కేబినెట్ లో ఇద్దరు మహిళా మంత్రులుంటే ఇద్దరూ ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వారే. ఇద్దరికిద్దరూ ఫైర్ బ్రాండ్లే! ఒకరు మాటల్ని ‘తూటాల్లా’ పేలిస్తే, మరొకరు ‘బాంబుల్లా’ పేల్చేస్తారు. ఒకరు వివాదాల మీద వివాదాలు స్రుష్టిస్తుంటే, మరొకరు వాదాలను వివాదాలు చేసేస్తారు. ఒకరు సొంత పార్టీలోని తన సహచర తాజా మంత్రులనే ఇరుకున పెడితే, మరొకరు మాజీ మంత్రులను రఫాడిస్తారు. ఒకరు మాట అహంకారపూరితంగా అనిపిస్తే, మరొకరు ప్రత్యర్థుల అహంకారాన్ని నిలదీస్తారు? నిగ్గదీస్తారు. భాషా పద ప్రయోగ, విధి విన్యాసాలను వారి మాటల్లోనే వినాలి. కాకపోతే ఇక్కడ చదువుకోవాలి.
పిల్లలతో ఓ స్కూల్ మీటింగులో రాష్ట్ర దేవాదాయ, అటవీశాఖల మంత్రి కొండా సురేఖ మాటలు వివాదాస్పదమయ్యాయి. వాటిని కప్పి పుచ్చడానికి మరో వివాదంలోకి వెళ్ళారు. ఫైళ్ళపై సంతకాలు చేయడానికి మంత్రులు డబ్బులు తీసుకుంటారని, తాను మాత్రం తీసుకోనని అని, నేను అలా అనలేదు. టిఆర్ఎస్ ప్రభుత్వంలో అలా ఉండేదని ఇంకో వివాదం రేపారు. అలాగే పంచాయతీరాజ్, గ్రామీణాభివ్రుద్ధిశాఖల మంత్రి ధనసరి అనసూయ అలియాస్ సీతక్క వ్యాఖ్యలు కూడా ఒక వివాదాన్ని సద్దు మణిగించే ప్రయత్నంలో మరో మూడు వివాదాలకు తావిచ్చాయి. ఇవాంక ట్రంపు ఇండియాకొచ్చినప్పుడు ఆమె తోక పట్టుకుని తిరిగిన నాయకుడు అంటూ కేటీఆర్ పేరును ఉటంకించకుండా చేసిన వ్యాఖ్యలు కంపులేపాయి.. అలాగే సిగ్గులేకుండా అబద్ధాలు మాట్లాడుతున్నారు. అబద్ధాలకు అంబాసిడర్ అంటూ మాజీ మంత్రి సబితపై సెటైర్లు వేశారు. కలెక్టర్లను కాళ్ల దగ్గర కూర్చోబెట్టుకున్నారని, కాళ్ళు మొక్కించుకున్నారని చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి.
‘అడుసు’తొక్కనేల!?
FOREST|‘అటవీశాఖ మంత్రిగా ఉన్నాను. కాబట్టి నా దగ్గరకు కొన్ని కంపెనీల ఫైళ్ళ క్లియరెన్స్ కోసం వస్తాయి. మమూలుగా అలాంటి ఫైళ్ళు వచ్చినప్పుడు మంత్రులు డబ్బులు తీసుకుని క్లియర్ చేస్తారు. అప్పుడు వాళ్ళతో నేను అన్నా… మాకు ఒక్క నయాపైసా ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు సమాజ సేవ చేయండి. మా స్కూల్ ఒకటి డెవలప్ చేయండి. మీ పేరు గుర్తుండి పోతుందని చెప్పా. అప్పుడు మా చేతుల్లో లేదు. పై వాళ్ళతో మాట్లాడతామని అరబిందో ఫార్మాకుచెందిన సదానందరెడ్డి చెప్పారు. చివరకు సిఎస్ఆర్ నిధులు రూ.4.5 కోట్లతో కాలేజీ భవనం కడతామని చెప్పినప్పుడు నాకు సంతోషం కలిగింది.’ అన్నారు.
ఆ వివాదాన్నుంచి తప్పించుకోవడానికి మరో వివాదం లోకి కూరుకుపోయారు. ‘నిన్న వరంగల్‌లో నేను చేసిన వ్యాఖ్యలపై కొంతమంది పనిగట్టుకుని తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారు. నేను గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, అప్పటి మంత్రులు ఏ పని చేయాలన్నా పైసలు తీసుకునేవారని మాత్రమే అన్నాను. ఇది అక్షర సత్యం. నా ఆ వ్యాఖ్యలకు నేను ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను.’
‘కాళ్ళు’ కడగనేల!?
‘గుళ్లలోకి కాళ్లు కడుక్కొని వెళ్లడం గిరిజన సంప్రదాయం.. అదే అక్కడ పాటించారు. అందులో ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ అమ్మాయి సుందరీమణుల కాళ్లకు నీళ్లు పోసింది. దాన్ని పట్టుకుని తెలంగాణ ప్రభుత్వం చేసిందని బద్నాం చేస్తున్నారు. నిస్సిగ్గుగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం కాళ్లు కడిగితే అందరి కాళ్లూ కడిగించాలి కదా?. ఇలాంటి విషయాలను ప్రభుత్వానికి అంటగట్టడం సిగ్గు అనిపించడం లేదా?. ఎమ్మెల్సీ కవిత|KAVITHA తన కాళ్ల దగ్గర కలెక్టర్‌ను కూర్చోబెట్టుకోవడం, కలెక్టర్లతో కేసీఆర్ కాళ్లు మొక్కించుకోవడం దురహంకారం కాదా? తెలంగాణ ఆత్మగౌరవం గురించి మాట్లాడే అర్హత మీకుందా?’
‘ఈ మధ్య సబిత MULUGU|ములుగు మీద పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. ఆమె మంత్రిగా ఉన్నప్పుడు ఏం మానవత్వం చూపిందో తెలుసు. అబద్దాలకు అంబాసిడర్ గా సబితమ్మ మారకూడదు. అధికారం పోయాక, ప్రజల ఆత్మగౌరవం మీకు గుర్తుకు వచ్చిందా?’
‘హెరిటేజ్ వాక్ సక్సస్ కావడంతో బీఆర్ఎస్ నేతలు కళ్లలో నిప్పులు పోసుకున్నారు. కోడిగుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాంక ట్రంప్ వచ్చినప్పుడు తోక పట్టుకుని తిరిగిన నాయకుడు, ఎలాంటి సంస్కృతి, సంప్రదాయాలు పాటించారో అందరికీ తెలుసు.’

